సాయిరెడ్డిపై భగ్గుమన్న విశాఖ

ABN , First Publish Date - 2020-11-21T06:10:11+05:30 IST

విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసేయాలని కేంద్ర మంత్రికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ ఇవ్వడంపై విశాఖలో పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

సాయిరెడ్డిపై భగ్గుమన్న విశాఖ

విమానాశ్రయాన్ని మూసివేయాలని కేంద్రాన్ని కోరడంపై సర్వత్రా విమర్శలు

ఎయిర్‌పోర్టు జోలికొస్తే ఊరుకోబోమని విపక్షాల హెచ్చరిక

ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు

ఆ రూల్‌ ప్రకారం అయితే... కొత్తగా వచ్చే విమానాశ్రయాన్నే నిర్దేశిత దూరంలో ఏర్పాటుచేసుకోవాలనే సూచన

2 పోర్టులు ఉండొచ్చు... రెండు విమానాశ్రయాలు ఉండకూడదా అంటూ వ్యాపార వర్గాల నుంచి ప్రశ్నలు


విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసేయాలని కేంద్ర మంత్రికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ ఇవ్వడంపై విశాఖలో పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆలు లేదు...చూలు లేదు...కొడుకు పేరు సోమలింగం’ అని భోగాపురంలో ఇంకా విమానాశ్రయం నిర్మించక  ముందే... భూ సేకరణ ప్రక్రియ పూర్తికాక ముందే...ఇక్కడ విమానాశ్రయం మూసేయాలని డిమాండ్‌ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ అన్ని రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. విజయసాయిరెడ్డి తీరును టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, విమాన ప్రయాణికుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధే...తమ ధ్యేయమని పైకి చెబుతూ వెనుక గోతులు తవ్వుతారా? అంటూ ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. తక్షణమే ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు చేపడతామని టీడీపీ, జనసేన, వామపక్షాలు ప్రకటించాయి. వీరంతా వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి కంఠకుడిగా మారారని ఆరోపించాయి.


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎన్నో ఏళ్ల పోరాటంతో విశాఖ విమానాశ్రయం ఈ స్థాయికి వచ్చిందని, ఒకదాని తరువాత మరొక సౌకర్యం 

సమకూర్చుకోవడానికి ఇటు నేవీతో, అటు కేంద్రంతో పోరాడి అనేక వసతులు సమకూర్చుకుంటే...దానిని మూసేయా ల్సిందిగా అడగాడానికి మీకున్న అర్హత ఏమిటంటూ...టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. దీనిపై ఎటువంటి చర్చకు అయినా సిద్ధమని జనసేన నాయకులు శివశంకర్‌, బొలిశెట్టి సత్య ప్రకటించారు. విమానాశ్రయం అంశంపై ప్రతిపక్షాలను ఉద్దేశించి విలేఖరుల సమావేశంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్ని పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం

వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి  జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో

ఏదైనా నిర్ణయం తీసుకునేటపుడు రాజకీయ పక్షాలతో చర్చించడం ఆనవాయితీగా వస్తోందని, దానిని కాదని ఫ్యూడల్‌ వ్యవస్థలో మాదిరిగా విజయసాయిరెడ్డి విశాఖలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇది సరైన విధానం కాదన్నారు. 


రూల్‌ తెలుసుకొని దూరంగా వెళ్లు...!

ఒక విమానాశ్రయం ఎక్కడైనా ఉంటే...దానికి నిర్ణీత పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదని ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో సెలవిచ్చారు. అందరూ ఆ రూల్‌ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. దీనిపై వ్యాపారవేత్తలు పలువురు మాట్లాడుతూ, విశాఖలో విమానాశ్రయం 1981 నుంచి నడుస్తోందని, కొత్తగా వచ్చే విమానాశ్రయం రూల్‌ ప్రకారం ఎంత దూరంలో వుండాలో అక్కడ నిర్మించుకోవాన్నారు. అంతేగానీ...ఇక్కడ విమానాశ్రయాన్ని మూసేయమనడం సరికాదన్నారు. నాడు విశాఖపట్నంలో పోర్టు వుండగా, పక్కనే గంగవరం పోర్టును ప్రైవేటు సంస్థతో ఏర్పాటు చేయించారని, అలాంటప్పుడు అభివృద్ధి చెందుతున్న విశాఖకు రెండు విమానాశ్రయాలు వుంటే తప్పు ఏమిటని ఫార్మా పరిశ్రమకు చెందిన ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. విశాఖకు ఏది వుండాలో ఏది వుండకూడదో చెప్పే నైతిక హక్కు ఆయనకు లేదని అన్నారు. 


విశాఖలో శాంతిభద్రతలు 100 శాతం పెర్‌ఫెక్టా!?

విశాఖలో శాంతిభద్రతలు వంద శాతం పెర్‌ఫెక్ట్‌గా ఉన్నాయని ఆయన విలేఖరుల సమావేశంలో ప్రస్తావించిన విషయాన్ని తెలుగుదేశం నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. ఆక్రమణలు, లీజులు అంటూ చట్టబద్ధంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సెలవు రోజుల్లో నిర్మాణాలు కూల్చివేస్తున్నారని, దీనివల్ల వ్యాపార వర్గాల్లో తీవ్రమైన అశాంతి నెలకొందని, ఇది శాంతిభద్రతలను కాపాడడమా? అని ఎద్దేవా చేశారు.


అంచెలంచెలుగా ఎదిగిన విశాఖ విమానాశ్రయం

విశాఖ విమానాశ్రయానికి మొదట్లో కేవలం ఒక టెర్మినల్‌ మాత్రమే ఉండేది. ఆ తరువాత ఇరవై వేల చ.మీ. విస్తీర్ణంలో కొత్త టెర్మినల్‌ నిర్మించి, పాత భవనాన్ని కార్గోకు కే టాయించారు.

ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరగడంతో టెర్మినల్‌ భవనాన్ని మరో పది వేల చ.మీ.కు విస్తరిస్తున్నారు.

2007 చివరి వరకు విశాఖకు చీకటి పడితే విమానాలు వచ్చేవి కావు. దీనిపై నేవీతో పోరాడి మార్చి, 2008లో నైట్‌ ల్యాండింగ్‌ (ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌) సాధించారు. అప్పటి నుంచి రాత్రి వేళ కూడా విమానాలు వచ్చి వెళుతున్నాయి. దీనికి అప్పట్లో రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కృషిచేశారు.

అంతర్జాతీయ విమానాలు రావాలంటే...రాత్రి 11 గంటల తరువాత కూడా విమానాశ్రయం తెరిచి ఉంచాలి. దానికి తగిన సిబ్బంది లేరని నేవీ అనుమతించలేదు. సింగపూర్‌ విమానాలు వస్తాయని ఆసక్తి చూపడంతో నాటి విశాఖ ఎంపీ, కేంద్ర మంత్రి పురందేశ్వరి రక్షణ శాఖతో మాట్లాడి 24/7 విమానాశ్రయం నడపడానికి 400 మంది సిబ్బందిని మంజూరు చేయించారు.

రాత్రిపూట వచ్చే విమానాలు వెంటనే తిరిగి వెళ్లిపోకుండా రాత్రికి ఇక్కడే పార్కింగ్‌ చేసుకునే తెల్లవారుజామున బయలుదేరే సౌకర్యం ఉండేది కాదు. దీనికి నైట్‌ పార్కింగ్‌ అవసరమని గత ఎంపీ హరిబాబు కేంద్రంతో మాట్లాడి నిధులు సాధించి పార్కింగ్‌ బేలు నిర్మించారు.

...ఇలా ఒక్కొక్క సౌకర్యం సాధించుకొని విమానాశ్రయం అభివృద్ధి చెందుతుంటే...దానిని మూసేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేయడాన్ని విశాఖ పారిశ్రామిక వర్గాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Updated Date - 2020-11-21T06:10:11+05:30 IST