వాల్తేర్‌ క్లబ్‌పై పంచాయితీ

ABN , First Publish Date - 2021-01-13T06:20:16+05:30 IST

నగర నడిబొడ్డున గల వాల్తేర్‌ క్లబ్‌ భూములపై ‘సిట్‌’ విచారణ మొదలెట్టింది. క్లబ్‌ నడుస్తున్న ప్రాంతం ప్రభుత్వానికి చెందినదంటూ నగరానికి చెందిన న్యాయవాది ఒకరు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులకు ఈ నెల ఐదో తేదీన ‘సిట్‌’ నోటీస్‌ ఇచ్చింది.

వాల్తేర్‌ క్లబ్‌పై పంచాయితీ
వాల్తేరు క్లబ్‌ భూములకు సంబంధించి రికార్డులు పరిశీలిస్తున్న సిట్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, సభ్యురాలు అనురాధ

‘సిట్‌’ ఎదుట క్లబ్‌ తరపున న్యాయవాదులు హాజరు

లీజు పత్రాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు

తమ వద్ద గల డాక్యుమెంట్లతో వచ్చిన భూ యజమాని వారసులుగా

చెప్పుకుంటున్న వ్యక్తులు

అదే భూములపై కలెక్టర్‌ నివేదిక

మ్యాప్‌, రికార్డులు సమర్పించిన జీవీఎంసీ ఎస్టేట్‌ అధికారి 


విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): నగర నడిబొడ్డున గల వాల్తేర్‌ క్లబ్‌ భూములపై ‘సిట్‌’ విచారణ మొదలెట్టింది. క్లబ్‌ నడుస్తున్న ప్రాంతం ప్రభుత్వానికి చెందినదంటూ నగరానికి చెందిన న్యాయవాది ఒకరు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులకు ఈ నెల ఐదో తేదీన ‘సిట్‌’ నోటీస్‌ ఇచ్చింది. మరోవైపు క్లబ్‌ నుంచి తమ భూములు తమకు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆ భూమి వారసులుగా చెప్పుకుంటున్నవారు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో క్లబ్‌ నిర్వాహకులు, భూ యజమాని వారసులుగా చెప్పుకుంటున్నవారు మంగళవారం సిట్‌ కార్యాలయానికి వచ్చారు. వాల్తేర్‌ క్లబ్‌ తరపున సీనియర్‌ న్యాయవాదులు రామదాసు, కృష్ణమోహన్‌, పృథ్వీరాజ్‌లు సిట్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, సభ్యులు వైవీ అనురాధ, వి.భాస్కరరావుల ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు. క్లబ్‌ భూమిపై జిల్లా కోర్టు, హైకోర్టులో కేసులు విచారణలో వున్నాయని వివరించారు. క్లబ్‌ ఏర్పాటుకు 1900లో భూ యజమాని ఇచ్చిన లీజు పత్రం సమర్పించాలని న్యాయవాదులకు సిట్‌ చైర్మన్‌ సూచించగా...త్వరలో అందజేస్తామన్నారు. అనంతరం సదరు భూమికి సంబంధించిన మ్యాప్‌, రికార్డుతో గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) సర్వేయర్‌ అప్పన్న రాగా...ఎస్టేట్‌ అధికారిని పిలిపించాల్సిందిగా విజయకుమార్‌ ఆదేశించారు. వెంటనే ఇన్‌చార్జి ఎస్టేట్‌ అధికారి మహాపాత్రో రికార్డుతో హాజరయ్యారు. 1922 సర్వే రికార్డుల్లో క్లబ్‌ ప్రస్తావన వుండడాన్ని గుర్తించారు. అయితే రికార్డులలో కొట్టివేతలు, అది కూడా ఒక్కొక్కచోట ఒక్కో రంగు సిరాతో రాసి ఉండడం గమనించిన సిట్‌ బృందం...దీనిపై తగిన వివరణ కోరుతూ టౌన్‌ సర్వే ల్యాండ్‌ రికార్డుల్లో వున్న వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తరువాత భూ యజమాని వారసులుగా పేర్కొంటున్న రాజగోపాల్‌, తదితరులు సిట్‌ బృందాన్ని కలిసి తమ వద్ద గల డాక్యుమెంట్లు సమర్పించారు. తమ ముత్తాత పేర్ల సత్తెయ్యశెట్టి 31 ఎకరాలు క్ల్లబ్‌కు లీజుకు ఇచ్చారని వివరించారు. 1985లో ప్రభుత్వ అవసరాల కోసం వుడా 16 ఎకరాలు సేకరించిందని, ఆ సమయంలో సత్తెయ్యశెట్టి పేరిట నోటీసులు వచ్చాయన్నారు. లీజు గడువు 1999లో ముగిసిందని, తరువాత క్లబ్‌ నిర్వాహకులతో వివాదం నెలకొనడంతో 2005లో కోర్టును ఆశ్రయించామని చెప్పారు. ప్రస్తుతం జిల్లా కోర్టుతోపాటు హైకోర్టులో కేసులు విచారణలో ఉన్నాయన్నారు. క్లబ్‌కు సంబంధించి పలు డాక్యుమెంట్లు కోర్టులో ఉన్నాయని, ఈ నెల 20 వరకు గడువిస్తే వాటి నకళ్లు సమర్పిస్తామని చెప్పగా...అందుకు సిట్‌ అంగీకరించింది. కాగా వాల్తేర్‌ క్లబ్‌ భూములు ప్రభుత్వానికి చెందినవంటూ న్యాయవాది ఒకరు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటి వివరాలతో కలెక్టర్‌ నివేదిక ఇచ్చారు. అయితే పూర్తి రికార్డులు సమర్పించాలని సిట్‌ ఆదేశించింది.

Updated Date - 2021-01-13T06:20:16+05:30 IST