పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ‘వొడాఫోన్ ఐడియా’... 1,500 మంది ఉద్యోగుల తొలగింపు

ABN , First Publish Date - 2020-08-04T20:48:47+05:30 IST

కొత్త ఆర్డర్ల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన నేపధ్యంలో... వొడాఫోన్ ఐడియా వృద్ధి మందగించినట్లు సమాచారం. ఈ సంస్థ... సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. దీంతో వొడాఫోన్ ఐడియా మరిన్ని నష్టాలనెదుర్కోవాల్సి వస్తోంది.

పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ‘వొడాఫోన్ ఐడియా’... 1,500 మంది ఉద్యోగుల తొలగింపు

హైదరాబాద్ : కొత్త ఆర్డర్ల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన నేపధ్యంలో...  వొడాఫోన్ ఐడియా వృద్ధి మందగించినట్లు సమాచారం. ఈ సంస్థ... సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. దీంతో వొడాఫోన్ ఐడియా మరిన్ని నష్టాలనెదుర్కోవాల్సి వస్తోంది.


మొత్తంమీద ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఈ క్రమంలో... కీలక నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల భారానికి తోడు నెట్ వర్క్ విస్తరణ పనులు నిలిచిపోవడం, డీల్స్ ఆలస్యం వంటి వివిధ కారణాల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసినట్లుగా సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులను మరింతగా తగ్గించుకునే లక్ష్యందో ఉద్యోగులపై వేటు వేసినట్లుగా తెలుస్తోంది.


దేశవ్యాప్తంగా దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించినట్లుగా  వినవస్తోంది. ప్రధానంగా వొడాఫోన్ ఐడియాకు సంబంధించి నోకియా, ఎరిక్సన్, హువావే, జెడ్‌టీఈ 4జీ పరికరాల కొత్త ఆర్డర్స్ ఆలస్యం కావడం వల్ల సంస్థ మరింత ఇబ్బందుల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. చైనా నుండి ఆర్డర్స్ తీసుకోవడం కూడా ఆగిపోయి ఉండవచ్చునని సమాచారం. టెలికం సర్కిళ్ళను 22 నుండి 10 కి కుదిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. సర్కిళ్ళు తగ్గిన నేపథ్యంలో‘మే’ నెల నుంచి దాదాపు 1,500 మంది ఉద్యోగులపై వేటు పడిందని తెలుస్తోంది. 


గత క్వార్టర్‌లో వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఏజీఆర్ మొత్తం బకాయిలు చెల్లిస్తే తమ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు తలెత్తుతాయని, ఈ క్రమంలో చెల్లింపులకు ఇరవై సంవత్సరాల సమయం కావాలని కూడా సుప్రీం కోర్టును సంస్థ కోరింది. 


కాగా... తొలగించిన ఉద్యోగులకు నిబంధనల మేరకు చెల్లింపులు జరుగుతాయి. సీనియర్ ఉద్యోగులకు... నిష్క్రమణ నిబంధనలకు లోబడి ఏడు నెలల వేతనాన్ని చెల్లిస్తారు. ఇక సంస్థకు... గత మార్చి నాటికి రూ. 1,12,520 కోట్ల మేరకు రుణాలున్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం పరికరాల సరఫరా కోసం రూ. 4 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. మొత్తంమీద సంస్థ పరిస్థితి ఆర్ధికంగా చాలా క్లిష్టంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

Updated Date - 2020-08-04T20:48:47+05:30 IST