నీటి మీటర్లు కావాలి..!

ABN , First Publish Date - 2021-01-21T06:52:56+05:30 IST

గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథకం అమలు చేసేందుకు నీటి మీటర్లు అత్యవసరంగా మారాయి.

నీటి మీటర్లు కావాలి..!

5 లక్షలు అత్యవసరం

తొమ్మిది ఏజెన్సీల సరఫరా

నాలుగేళ్ల క్రితమే ఎం ప్యానల్‌

డిమాండ్‌ మేరకు సప్లయ్‌కి చర్యలు 

గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథకం అమలు చేసేందుకు నీటి మీటర్లు అత్యవసరంగా మారాయి. వాటర్‌బోర్డు  ఎంపిక చేసిన ఏజెన్సీలు ఒకేసారి వాటిని అందించే పరిస్థితి  లేదు. సరఫరా చేసినా, బిగించాల్సిన ప్లంబర్లు ఆ స్థాయిలో  లేరు. మార్చి నెలాఖరు వరకు నీటి మీటర్లు బిగించుకున్న గృహ కనెక్షన్లకు మాత్రమే  ఉచిత నీటిని సరఫరా చేస్తామని వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని గృహ కనెక్షన్లకు మీటర్లు సరఫరా చేయడం సవాలేనని ఓ ఏజెన్సీ నిర్వాహకుడు వాపోయాడు. 

హైదరాబాద్‌ సిటీ, జనవరి20 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ పరిధి లో గృహా కనెక్షన్లకు, అపార్ట్‌మెంట్లలోని కుటుంబాలకు నెలకు 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా సరఫరా చేసే పథకం అమలులోకి వచ్చింది. మురికివాడల్లోని నల్లా కనెక్షన్‌దారులు ఆధార్‌ కార్డును క్యాన్‌ నెంబర్‌తో అనుసంధా నం చేసుకుంటే ఉచిత పథకానికి అర్హులవుతారు. మిగతా గృహ కనెక్షన్‌దారులు ఆధార్‌కార్డు, క్యాన్‌ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవడంతోపాటు తప్పనిసరిగా మీటర్లు బిగిం ుకోవాలని వాటర్‌బోర్డు స్పష్టం చేసిం ది. గ్రేటర్‌  పరిధిలో ప్రస్తుతం 10.60లక్షల నీటి కనెక్షన్లు ఉన్నా యి. ఇందులో ఉచిత తాగునీటి పథకానికి అర్హత కలిగిన గృహ కనెక్షన్లు 9.50 లక్షలు మాత్రమే. వీటిలో 2.50 లక్షల కనెక్షన్లకు నీటి మీటర్లున్నాయి. మురికివాడల్లో 2లక్షల గృహకనెక్షన్లు ఉండగా, వీటికి మీటర్లు అవసరం లేదు. ప్రస్తుతం నీటి మీటర్లు అవసరమున్న గృహ కనెక్షన్లు ఐదు లక్షల వరకు ఉన్నాయి.

డివిజన్‌కు రెండు ఏజెన్సీలు..

నగరంలో నల్లా కనెక్షన్లకు నీటి మీటర్లను బిగించడానికి తొమ్మిది ఏజెన్సీల ను వాటర్‌ బోర్డు నాలుగేళ్ల క్రితమే ఎంపిక చేసింది. 15ఎంఎం సైజు పైపునకు అవసరమున్న నీటి మీటర్‌ ధర ఏడాది గ్యారంటీతో రూ. 1,300గా నిర్ణయించింది. మూడేళ్ల గ్యారంటీ ఉన్న మరో మీటర్‌ ధర రూ.1,500గా నిర్ణయించింది.  20ఎంఎం సైజు పైపునకు అవసరమున్న నీటి మీటర్‌ ధర ఏడాది గ్యారంటీతో రూ.2,500. ఏజెన్సీలు అదనంగా రూ. 500 చెల్లిస్తే బిగించాలని నిర్ణయించాయి. గ్రేటర్‌ పరిధిలో 14 ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ డివిజన్లు ఉండగా, డివిజన్‌కు రెండు ఏజెన్సీలు మీటర్లను సరఫరా చేస్తున్నాయి. కొత్తగా నల్లా కనెక్షన్‌ తీసుకున్న సందర్భంలో ఫీజులన్నీ వాటర్‌బోర్డుకు చెల్లించి నీటి మీటర్‌ కొనుగోలు చేస్తే పైపులైన్‌ ద్వారా నీటి కనెక్షన్‌ ఇచ్చేటప్పుడు మీటర్‌ను అమరుస్తారు.

ప్రత్యామ్నాయంపై దృష్టి 

గ్రేటర్‌లో ప్రస్తుత డిమాండ్‌ మేరకు నీటి మీటర్లు సరపరా చేయడం ఏజెన్సీలకు కష్టసాధ్యమని భావిస్తున్న వాటర్‌బోర్డు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. నీటి మీటర్ల సరఫరాకు, బిగించేందుకు అర్హత కలిగిన కొత్త ఏజెన్సీలను ఎంప్యానల్‌ చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. పలు సంస్థల నుంచి ఇప్పటికే అవసరమైన పత్రాలను కూడా తీసుకున్నట్లు సమాచారం. 

ఏజెన్సీల వద్దకు బారులు

నగరంలోని ఐదు లక్షల గృహ కనెక్షన్‌దారులకు మీటర్లు బిగించుకోవడానికి మార్చి 31 వరకు అధికారులు గడువిచ్చారు. దీంతో గృహ కనెక్షన్‌దారులు ఆయా ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే, ఏజెన్సీల వద్ద డిమాండ్‌ మేరకు మీటర్లు అందుబాటులో లేవని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో ఏజెన్సీ నెలకు 100 మీటర్లు సరఫరా చేయడమే గగనం. అలాంటిది లక్షల్లో మీటర్లు సరఫరా చేయాల్సి రావడంతో వారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఢిల్లీలో ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేయగా, 18 లక్షల తాగునీటి కనెక్షన్లకు మీటర్లు బిగించడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో నగరంలో ఎంత సమయం పడుతుందో వేచి చూడాల్సిందే. 


Updated Date - 2021-01-21T06:52:56+05:30 IST