కాలుష్య కాసారం

ABN , First Publish Date - 2020-04-03T16:58:48+05:30 IST

గోవాడ చక్కెర కర్మాగారం నుంచి..

కాలుష్య కాసారం

కలుషితమైన శారదా నది నీరు

చనిపోతున్న చేపలు, రొయ్యలు

గోవాడ షుగర్స్‌ నుంచి వ్యర్థాలను విడుదల చేస్తున్నట్టు ఆరోపణలు

అటువంటిదేమీ లేదంటున్న  ఫ్యాక్టరీ ఎండీ


అనకాపల్లి(విశాఖపట్నం): గోవాడ చక్కెర కర్మాగారం నుంచి శారదా నదిలోకి రసాయన వ్యర్థాలను విడుదల చేస్తుండడంతో నీరు కలుషితం అవుతున్నది. ఇటీవల వరకు స్వచ్ఛంగా కనిపించిన శారదా నది నీరు, నాలుగైదు రోజుల నుంచి నల్లగా కనిపిస్తున్నది. పలుచోట్ల చేపలు, రొయ్యలు చనిపోయి నీటిపైకి తేలాయి. గోవాడ చక్కెర కర్మాగారంలో బాయిలర్‌ నుంచి రసాయన వ్యర్థాలను నేరుగా బయటకు విడుదల చేయడం లేదా మొలాసిస్‌ నిల్వ కోసం తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గోతుల్లో నుంచి లీక్‌ కావడం వల్ల గానీ శారదా నదిలో నీరు కలుషితం అవుతున్నదని పలువురు అంటున్నారు. గత వారం కురిసిన వర్షాలకు ఆరు బయట నిల్వ చేసిన మొలాసిస్‌ పులిసిపోయి పొంగి ప్రవహించి వుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది. ఈ విషయమై గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడును వివరణ కోరగా, శారదా నదిలోకి ఎటువంటి వ్యర్థాలను విడుదల చేయలేదని, ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో నిల్వ చేసిన మొలాసిస్‌ ప్రభావితమై ఎక్కడైనా లీక్‌ అయి వుండవచ్చని స్పష్టం చేశారు.


కాలుష్య బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ ‘బుద్ద’

గోవాడ చక్కెర కర్మాగారం నుంచి వ్యర్థాలను నదిలోకి విడుదల చేస్తుండడంతో నీరు కలుషితం అవుతున్నది. నీరు నల్లగా మారి చేపలు చనిపోతున్నాయి. శారదా నది నీటిని అనకాపల్లి పట్టణ ప్రజలకు సరఫరా చేస్తుంటారు. కలుషిత జలాల వల్ల జనం రోగాల బారినపడితే ఎవరు బాధ్యత వహిస్తారు? శారదా నది నీరు కలుషితం కావడానికి కారకులైన వారిపై అంటువ్యాధుల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేయాలి. తక్షణమే రైవాడ జలాశయం నుంచి నీటిని విడుదల చేసి శారదా నదిలో ఉన్న కలుషిత నీరు సముద్రంలోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలి.


Updated Date - 2020-04-03T16:58:48+05:30 IST