తాగునీటి కోసం..

ABN , First Publish Date - 2021-05-06T05:34:49+05:30 IST

గ్రామాల్లో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

తాగునీటి కోసం..
ఆలూరు: హత్తిబెళగల్‌ గ్రామంలో ట్యాంక్‌ వద్ద నీటి కోసం అవస్థలు పడుతున్న ప్రజలు

ఆలూరు రూరల్‌, మే 5: గ్రామాల్లో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బాపురం జలాశయం నుంచి తాగునీరు వారం రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. తరచూ మోటార్ల మరమ్మతులు, పైపులైన్లు మరమ్మతులకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని మొలగవల్లి కొట్టాల గ్రామంలో వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటికుంట నుండి ఎద్దులబండ్లు, సైకిళ్లపై నీరు తెస్తున్నామని సర్పంచ్‌ రాజశేఖర్‌ బుధవారం ఎంపీడీవో అల్లాబకాష్‌ దృష్టికి తీసుకెళ్లారు. హత్తిబెలగల్‌ గ్రామంలో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం నుంచి మండుటెండలో నీటి కోసం ఇబ్బందిపడుతున్నారు. మనేకుర్తి, హుళేబీడు, అంగసకల్‌, తుంబళబీడు గ్రామాల్లో కూడా నీటి సమస్య ఏర్పడింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మోహన్‌బాబును వివరణ కోరగా మోటార్లు చెడిపోవడంతో సమస్య తలెత్తిందని తెలిపారు. మోటార్లకు మరమ్మతు చేసి తాగునీటిని సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


హొళగుంద: హొళగుందలోని బీసీ కాలనీకి చెందిన మహిళలు నీటి కోసం గ్రామ శివారులోని సంప్‌ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గత్యంతరం లేక కిలోమీటర్‌ దూరంలోని సంప్‌ వద్దకు వెళ్లి తోపుడు బండి ద్వారా నీరు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నీటి సరఫరాను పునరుద్ధ్దరించాలని కోరుతున్నారు.



Updated Date - 2021-05-06T05:34:49+05:30 IST