తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2021-10-18T05:56:02+05:30 IST

వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనిని, రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
వీణవంక మండలం మామిడాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

-  రైతులు ఆందోళన చెందవద్దు

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

వీణవంక, అక్టోబరు 17: వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనిని, రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం వీణవంక మండలంలోని మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎలబాక, గంగారం, శ్రీరాములపేట, కిష్టంపేట గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధూంధాం కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ వానాకాలపు పంట ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మాత్రమే పోటీలో ఉన్నాయన్నారు.  ఈటల రాజేందర్‌ అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టే పని చేస్తున్నాడని విమర్శించారు. బండి సంజయ్‌ గెలిచి రెండున్నరేళ్లు అయింది. ఏమైనా సేవ చేశారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని, దాని తొలి ఫలితం వీణవంక, హుజూరాబాద్‌ ప్రజలకు అందిందన్నారు. రైతుల కోసం పని చేసే టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలన్నారు.  మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి స్వగ్రామమైన మామిడాలపల్లిలో ప్రచారానికి విశేష స్పందన లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే తానే దగ్గరుండి ఐదువేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు హుజూరాబాద్‌లో కట్టిస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు పరిపాటి రవీందర్‌రెడ్డి, మాడ సాధవరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ ధూంధాం కార్యక్రమం నిర్వహిస్తుండగా మండలంలోని నర్సింహులపల్లె గ్రామానికి చెందిన భీపార్మసీ విద్యార్థిని లోకటి నిరోషా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటూ సభను అడ్డుకునే ప్రయత్నం చేయగా, అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకొని సభ అనంతరం ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2021-10-18T05:56:02+05:30 IST