వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తీవ్ర అసంతృప్తి!

ABN , First Publish Date - 2021-07-19T06:56:14+05:30 IST

‘ప్రతిపక్షంలో ఉన్నపుడు..

వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తీవ్ర అసంతృప్తి!
శ్రీకాళహస్తీశ్వరాలయం

మాకు పదవులు ఇవ్వరా?

శ్రీకాళహస్తిలో అధికార పార్టీ నేతల ఆవేదన 

ముక్కంటి చైర్మన్‌గా స్థానికేతరులకు అవకాశంపై అసంతృప్తి 


శ్రీకాళహస్తి(చిత్తూరు): ‘ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ బలోపేతానికి కృషి చేశాం. రోడ్డెక్కి ఉద్యమాలు చేశాం. పోలీసు కేసులు ఎదుర్కొన్నాం. పార్టీ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలయ్యాం. అధికారంలోకి వచ్చాక న్యాయం జరుగుతుందనుకున్నాం. రెండేళ్లు దాటి పోయినా ఏ పదవీ లేదు. కనీసం ప్రాధాన్యతా లేదు. ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ విషయంలోనూ మాకు తీరని అన్యాయం జరిగింది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి...?’ అంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా స్థానికేతరుడు.. సత్యవేడు మండలానికి చెందిన బీరేంద్రవర్మను నియమించడంపై వీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదవిని స్థానిక నేతలు ఎందరో ఆశించారు. వీరి ఆశలపై పార్టీ అధిష్ఠానం నీళ్లు చల్లింది.


రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల్లో శ్రీకాళహస్తికి ప్రాతినిధ్యం లేకుండా చేశారు. దీనిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన గెలుపు కోసం పని చేసిన వారికి రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు ఇప్పించడానికి ఆయన తీవ్రంగా కృషి చేసినప్పటికీ.. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఓ నేత కారణంగా ఆ ప్రయత్నం ఫలించలేదనే ప్రచారం జరుగుతోంది. కనీసం ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పదవైనా తన అనుచరులకు ఇవ్వాలని మధు కోరినప్పటికీ.. సదరు నేత ఒత్తిళ్ల కారణంగా అధిష్ఠానం స్థానికేతరుడికి ఇచ్చిందని చెబుతున్నారు. దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని కాదని స్థానికేతరులకు చైర్మన్‌ పదవి ఇస్తే, తనను నమ్ముకున్న వారికి ఏం సమాధానం చెప్పాలని, ఇక్కడ ఎలా రాజకీయం చేయాలని తన అనుచరులతో ఎమ్మెల్యే అన్నట్లు తెలిసింది. ఈ పరిణామంతో అధికార పార్టీ నేతల్లో అసమ్మతి రాజుకుంటోంది. 


- ముక్కంటి ఆలయ చైర్మన్‌ పదవికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి విజ్ఞప్తితో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య కుమారుడు సత్రవాడ ప్రవీణ్‌ పేరు పరిశీలనలోకి వచ్చింది. స్థానిక రాజకీయాల కారణంగా ఆ పదవి ఆయనకు లభించలేదు. 


- ఆప్కో మాజీ డైరెక్టరు, వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మిద్దెల హరి కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ఈ పదవి కోసం ప్రయత్నించారు. స్థానిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఈయనకు ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిసింది. పార్టీ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన తనకు ఇలా చేయడం ఏంటని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 


- ఈ పదవి కోసం ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల తాంగళ్‌ బాలాజీ ప్రసాద్‌రెడ్డి కూడా తనకున్న మార్గాల్లో ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. 


- వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు మాత్రం తన భారం మొత్తం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డిపైనే వేశారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఈయనకు మధు హామీ ఇవ్వడంతో ఈ పదవిపై చాలా ఆశలు పెంచుకున్నారు. చివరకు వైసీపీ అధిష్ఠాన నిర్ణయం ఈయనకూ నిరాశను మిగిల్చింది. 

Updated Date - 2021-07-19T06:56:14+05:30 IST