రైతుల కోసం రూ.22వేల కోట్లు ఖర్చు చేశాం

ABN , First Publish Date - 2021-09-17T13:57:31+05:30 IST

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన..

రైతుల కోసం రూ.22వేల కోట్లు ఖర్చు చేశాం

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 


నరసరావుపేట: రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల్లో రైతుల కోసం రూ 22వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదేనని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రూ.80వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు రూ.14వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నాడన్నారు. నాడు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి... నేడు వ్యవసాయంపై ఉద్యమం చేస్తామనటం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు నిరాటంకంగా ఇచ్చిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడేనన్నారు. గత రెండు సంవత్సరాల్లో 58 లక్షల మంది రైతులు ఈ ప్రభుత్వంలో లాభ పడ్డారన్నారు.


రైతులకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు రూ.19,130 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేయటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను ఉద్దేశిస్తూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ‘చెత్తనా కొడుకులు అనటంపై’ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణమే అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గడిచిన రెండు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలను పూర్తిగా అందజేయటం జరిగిందన్నారు. దళారులు, మాఫియా వ్యవస్థను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీయేనని విమర్శించారు. 


Updated Date - 2021-09-17T13:57:31+05:30 IST