టీఆర్‌ఎస్‌లోనే ఉంటాం

ABN , First Publish Date - 2021-05-15T05:46:28+05:30 IST

తామంతా టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటే ఉంటామని, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంటకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌లోనే ఉంటాం
మంత్రి గంగులతో మాట్లాడుతున్న నాయకులు, ప్రజాప్రతినిధులు

 జమ్మికుంట సర్పంచులు, ఎంపీటీసీలు 

కరీంనగర్‌, మే 14 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): తామంతా టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటే ఉంటామని, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంటకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు ప్రకటించారు. శుక్రవారం వారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కరీంనగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు అండగా ఉండడమే కాకుండా నియోజకవర్గ సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు కృషిచేస్తానని, ఈ విషయంలో ఎవరూ కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థే ముఖ్యమని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ మంత్రి ఈటలను ఎంతో గౌరవించిందని, 20 సంవత్సరాలుగా అనేక పదవులను అనుభవించిన ఆయన పార్టీని చీల్చే కుట్ర పన్నారని కమలాకర్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ లేకుంటే ఈటల రాజేందర్‌ ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి పథకాలను ఆయన అవహేళన చేసి మాట్లాడారన్నారు.  తెలంగాణలో విశేష ఆదరణ ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ బొమ్మపై గెలిచిన ఈటల ధిక్కార స్వరం వినిపంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకులైన బీజేపీ, కాంగ్రెస్‌ వారితో ఈటలకు ఉన్న చీకటి వ్యవహారం ఇప్పుడు బహిర్గతమైందని అన్నారు. పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అధైర్యపడవద్దని, అందరికీ తాను అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటుపడతానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్‌, పొనగంటి మల్లయ్య, సర్పంచుల ఫక్షరం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు మహేందర్‌, మారెపల్లి బిక్షపతి, చిదురాల రామస్వామి, రాజు, రాజమౌళి, సమ్మయ్య పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-05-15T05:46:28+05:30 IST