ఏడాదిన్నర వాయిదా!

ABN , First Publish Date - 2021-01-21T08:27:04+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టు వీడింది. చట్టాల అమలును నిలిపివేసే ప్రసక్తే లేదన్న మోదీ సర్కారు ఒక మెట్టు దిగింది.

ఏడాదిన్నర వాయిదా!

సాగు చట్టాల అమలును నిలిపివేస్తాం

సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తాం

సమస్యలపై చర్చించుకుందాం 

రైతులకు కేంద్రం ప్రతిపాదన

నేడు అంతర్గతంగా చర్చిస్తాం

ఆ తర్వాతే నిర్ణయం చెబుతాం 

రైతు సంఘాల నేతల వెల్లడి

రేపు 11వ విడత చర్చలు 

రిపబ్లిక్‌ డే లోపే కొలిక్కి?

చట్టాలను రద్దు చేయాలి: సిర్సా


గురుపరబ్‌ పర్వదినం సందర్భంగా కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అకాలీదళ్‌ నేత మజీందర్‌ సిర్సా కోరారు. 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ జరుగుతుందని ఢిల్లీ సిక్కు గురుద్వారా నిర్వాహక కమిటీ అధినేత అయిన సిర్సా తెలిపారు. రైతులు గణతంత్ర దినోత్సవాలకు ఆటంకం కల్పిస్తారని కేంద్రం భావించడం ఆశ్చర్యకరమన్నారు.


న్యూఢిల్లీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టు వీడింది. చట్టాల అమలును నిలిపివేసే ప్రసక్తే లేదన్న మోదీ సర్కారు ఒక మెట్టు దిగింది. ఈ చట్టాలను పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాదని, ఏడాదిన్నర వరకు చట్టాలను అమలు చేయబోమని ప్రతిపాదించింది. అంతవరకు ఈ చట్టాలపై ఇరువర్గాల ప్రతినిధులతో సంయుక్త కమిటీ వేసి చర్చించేందుకు సిద్ధమని రైతు సంఘాలతో బుధవారమిక్కడ జరిగిన పదో విడత చర్చల్లో కేంద్ర మంత్రులు ప్రకటించారు. కేంద్రం ప్రతిపాదనపై అంతర్గతంగా చర్చించుకొని నిర్ణయం చెబుతామని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు.


తదుపరి చర్చలు శుక్రవారాని(22)కి వాయిదా పడ్డాయి. దీంతో గణతంత్ర దినోత్సవానికి ముందే రైతు సంఘాలతో చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారమిక్కడ సుమారు ఐదు గంటల పాటు కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వం తొలుత సాగు చట్టాలను సవరిస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాల ప్రతినిధులు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఒకవైపు చర్చలు జరుగుతుండగా ఎన్‌ఐఏ ద్వారా తమ నేతలకు నోటీసులు జారీ చేయడంపై రైతు సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనను అణచివేసే కుట్రలో భాగంగానే నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ఈ విషయంపై తాము పరిశీలించి, తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రులు రైతులకు హామీ ఇచ్చారు. ఎన్‌ ఐఏ నోటీసులు జారీ చేసిన రైతుల జాబితా తెప్పించుకుంటామని తెలిపారు. రైతు సంఘాల నేతల్లో ఉన్న సందేహాలను తొలగించేందుకు తమ ప్రతిపాదనలను సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో సమర్పిస్తామని కూడా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ హామీ ఇచ్చారు. మొత్తం మీద ప్రభుత్వం దిగి వచ్చిందని రైతు సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధర విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలూ చేయలేదని రైతు సంఘం నేత రాకేశ్‌ తికాయత్‌ తెలిపారు. 


నేడు చర్చించుకొని చెబుతాం..

కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని ప్రతిపాదించిందని, దీనిపై గురువారం తాము విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ తెలిపారు. సాగు చట్టాల అమలు నిలిపివేత, సంయుక్త కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ కూడా సమర్పిస్తామని తెలిపిందని మరో రైతు సంఘం నేత కవిత కురుగుంటి చెప్పారు. అయితే రైతు సంఘాలు మాత్రం చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తున్నాయని, కేంద్రం ప్రతిపాదనపై అంతర్గతంగా చర్చించుకొని తదుపరి సమావేశంలో నిర్ణయాన్ని తెలియజేస్తామని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించాలన్న అంశంపై చర్చించకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చే వరకు చట్టాలు అమలులో ఉండవని తొలుత కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతలకు తెలిపారు. నిపుణుల కమిటీ మంగళవారం రైతు సంఘాల నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. గురువారం మరోసారి భేటీ జరగనుంది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోమ్‌ప్రకాశ్‌, 40 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. 


టిక్రి సరిహద్దులో రైతు ఆత్మహత్య 

టిక్రి సరిహద్దులో నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొంటున్న ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరియాణాలోని పకస్మాకు చెందిన జైభగవాన్‌ రాణా(42) మంగళవారం సల్ఫాస్‌ మాత్రలు మింగేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అతని వద్ద సూసైడ్‌ నోట్‌ లభించింది. ‘‘కేంద్ర ప్రభుత్వం ఇది కేవలం రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఆందోళన అని చెబుతోంది. కానీ, దేశవ్యాప్తంగా రైతులంతా కొత్త చట్టాలపై నిరసనకు దిగారు. ఇది కేవలం ఉద్యమం కాదు, సమస్యలపై యుద్ధం. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చల్లోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది’’ అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-21T08:27:04+05:30 IST