రాజకీయం రసవత్తరం

ABN , First Publish Date - 2021-03-03T05:40:48+05:30 IST

పుర పోరు ఉపసంహరణల ఘట్టంలో వైసీపీ ఒత్తిడి వ్యూహాలు బయటపడ్డాయి. ఆ పార్టీ ఆశించినట్లు పలుచోట్ల విపక్షాల అభ్యర్థులు బరి నుంచి తప్పు కుని అధికార వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవ మయ్యేలా మంగళవారం తొలి అడుగులు వేశారు.

రాజకీయం రసవత్తరం

వైసీపీతో టీడీపీ చెట్టపట్టాలు.. అధిష్ఠానం సీరియస్‌

ముంద స్తు ఒప్పందాలతోనే ఉపసంహరణలు

ఆరు వార్డుల్లో ఏకగ్రీవం..రాజకీయం రసవత్తరం

ఏలూరులోనూ ఇదే పరిస్థితి..సైకిల్‌ నుంచి చేజారిన ఇద్దరు

నరసాపురంలో గమ్మత్తు.. టీడీపీకి షాక్‌ ఇచ్చిన అభ్యర్థి


పుర పోరు ఉపసంహరణల ఘట్టంలో వైసీపీ ఒత్తిడి వ్యూహాలు బయటపడ్డాయి. ఆ పార్టీ ఆశించినట్లు పలుచోట్ల విపక్షాల అభ్యర్థులు బరి నుంచి తప్పు కుని అధికార వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవ మయ్యేలా మంగళవారం తొలి అడుగులు వేశారు. ఏలూరు కార్పొరేషన్‌ సహా కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం మున్సిపాల్టీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో ఉపసం హరణ పర్వం ఉత్కంఠగా సాగింది. ఉపసంహ రణల ఘట్టానికి నేడు తుది గడువు కావడంతో బుజ్జగింపులు, బెదిరింపులు, బేరాలతో రహస్య శిబిరాలు నడిచాయి. వైసీపీ దూకుడును తట్టుకునేలా విపక్షాలు పోటీలో వున్న తమ అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలిం చాయి. ఉపసంహరణ గడువు పూర్తయ్యే వరకూ ఎవరికీ అందుబాటులో లేకుండా కట్టడి చేశాయి. అయినప్పటికీ అనూహ్య  పరిణామాలు చోటు చేసుకుని పార్టీలను దిమ్మతిరిగేలా చేశాయి. పలుచోట్ల టీడీపీ–జనసేన బంధంపై చర్చలు చివరి దశలో ఉన్నాయి. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి)


కొవ్వూరు : ఆరు ఏకగ్రీవం

కొవ్వూరు మున్సిపాల్టీలో వున్న 23 వార్డులను ఏకగ్రీవం చేసేందుకు మూడు రోజుల క్రితమే వైసీపీ ఎత్తుగడ వేసింది. తగ్గట్టుగానే వైసీపీకి 14,  టీడీపీకి 8, జనసేన లేదా బీజేపీకి ఒక స్థానం కేటాయించేలా వార్డులను ఆయా వ్యక్తుల బలాబలాలను బట్టి లెక్కగట్టారు. ఛైర్మన్‌ పదవి, వైస్‌ చైర్మన్‌ పదవి సహా చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ వ్యూహం పన్నింది. ఈ వలలో  స్థానిక తెలుగుదేశం నేతలు పడ్డారు. గత సాధారణ ఎన్నికల నుంచే ఇక్కడ పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయారు. వీరిని ఏక తాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం విఫలయత్నం చేసింది. అప్పటి నుంచి సాగుతున్న విభేదాలు మున్సిపల్‌ ఎన్నికల్లో మరోసారి బయటపడ్డాయి. పార్టీ అధిష్టానం అనుమతి లేకుండానే స్థానికంగా ఒప్పందాలకు దిగి.. కొవ్వూరును వైసీపీకి కట్టబెట్టేందుకే సహకరించేలా వ్యవహరించారు. ఫలితంగా ఏకగ్రీవాల ముందురోజు పార్టీ కార్యకర్తలు, కొందరు నేతలు ఈ చీకటి ఒప్పందంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం ప్రదర్శించినా.. అసంతృప్తి వెళ్లగక్కినా పార్టీ సీనియర్లు ఏ మాత్రం కరిగిపోలేదు. ఈ ఒప్పందంలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణకు తొలి రోజైన మంగళవారం ఐదు వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు సహా మిగతా వారు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఇక్కడ వైసీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో నిలవడంతో ఈ ఐదు స్థానాలు ఏకగ్రీవమైనట్లే. మరోవైపు టీడీపీకి ఒక స్థానంలో వైసీపీ మద్దతు ఇచ్చి తప్పుకోగా, మిగతా వారు వైసీపీ వెంటే నడిచారు. ఐదు వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో టీడీపీ ఏకగ్రీవం జెండాలు ఎత్తాయి. ఈ పరిణామాలు సాగుతుండగానే మంగళవారం ఉదయం టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇరు వర్గాలు ఏకం కావాలని వైసీపీకి అవకాశం ఇవ్వవద్దని పార్టీ సీనియర్లు పదే పదే స్థానిక నాయకులతో చర్చించారు. ఇక్కడ సాగుతున్న కుమ్మక్కు రాజకీయం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి  వెళ్ళింది. అయినప్పటికీ సాయంత్రానికి అందరూ ఊహించినట్లుగానే ఆరు వార్డులు  ఏకగ్రీవం కాగా, బుధవారం నాటికి మిగతా వార్డులు ఏకగ్రీవం చేసే దిశగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి, వైస్‌ ఛైర్మన్‌ అభ్యర్థి, టీడీపీ వైస్‌ చైౖర్మన్‌ అభ్యర్థి పోటీ చేస్తున్న మూడు వార్డుల్లోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ మూడింటిలో ఏకగ్రీవం జరిగేలా నానాతంటాలు పడినప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతోంది. పార్టీ ఖర్చు తప్పించుకోవడానికి అన్నట్లు అధికార, ప్రతిపక్షాలు ఏకమై ఏకగ్రీవాలకు తెరదీయడం జిల్లాలో ఇదే ప్రథమం. కొవ్వూరు మున్సిపాల్టీలో మంగళవారం 60 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 


ఏలూరులో మరో డ్రామా 

ఏలూరు కార్పొరేషన్‌లోనూ అధికార పార్టీకి రెండు డివిజన్లను వదిలి వేస్తూ టీడీపీ అభ్యర్థులు రంగం నుంచి తప్పుకున్నారు. ఓ వైపు అభ్యర్థులెవరూ వైసీపీ వలలో చిక్కుకోకూడదని ఏలూరు పార్టీ నాయకత్వం పదే పదే కోరినా పెద్దగా ఫలితం లేకపోయింది. మొదటి నుంచి ఏలూరు కార్పొరేషన్‌లో దాదాపు పది మంది టీడీపీ అభ్యర్థులు చివరి క్షణాల్లో పోటీ నుంచి తప్పుకోవడం ఖాయమని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే కాస్తంత అన్ని విషయాల్లో బలహీనంగా వున్న వారికి వైసీపీ నగదు రూపంలో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. రూ.15 నుంచి రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమేనన్నట్లు ఒప్పందాలకు దిగింది. దీనిని ముందే పసికట్టి పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేసినా రెండు డివిజన్లలో మాత్రం చివరి క్షణంలో జారుకున్నారు. దీంతో ఏలూరులోని 1, 3, 32 డివిజన్లలో వైసీపీ అనుకూల అభ్యర్థుల ఏకగ్రీవాలకు దారితీసింది. పరిస్థితిని అధ్యయనం చేసి బుధవారం తిరిగి ఏకగ్రీవాలు జరగకుండా టీడీపీ సరికొత్త ఎత్తుగడ వేసింది. అధికార పార్టీకి మాత్రం తాము ఊహించి ఆశించినట్లుగానే ఏకగ్రీవాలు ఉంటాయన్న ధీమాతో ఉంది. 65 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా వీరిలో టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీల డమ్మీ అభ్యర్థులు ఉన్నారు. 


నరసాపురంలో టీడీపీకి షాక్‌

నరసాపురం మున్సిపాల్టీలో ఉపసంహరణ పర్వం రంజుగా సాగింది. టీడీపీకి చెందిన 5వ వార్డు అభ్యర్థి చెరుకూరి నాగేశ్వరరావు వ్యక్తిగత కారణాలపై హైదరాబాద్‌కు వెళ్ళారు. తాను బరిలోనే ఉంటానని ఏ మాత్రం భయపడనక్కర లేదని చెప్పి మరీ వెళ్లారు. సరే కదా అంటూ స్థానిక నాయకత్వం ఆయనను చూసీచూడనట్లు వదిలేసింది. నామినేషన్ల ఉపసంహ రణకు తొలిరోజున ఆయన నేరుగా నరసాపురం రావడం, తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడం, ఆ వెంటనే హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం పట్టడం అంతా నాటకీయంగా సాగిపోయింది. ఇదే వార్డు వైసీపీ లెక్కలో చేరేందుకు సదరు వ్యక్తి తోడ్పడినట్లు అయింది. ఈ ఘటనతో టీడీపీ నాయత్వం ఖంగుతింది. అంత కట్టడి చేసినా వైసీపీ దీటుగా రంగం సిద్ధం చేసినా ఇలా దొడ్డిదారిన చేజారిపోవడం టీడీపీలో అసంతృప్తిని మిగిల్చింది. ఇక్కడ 15 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 

నిడదవోలు మున్సిపాల్టీలో 15 మంది డమ్మీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా ఇప్పటి వరకు ఆ మున్సిపాల్టీలో ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాలేదు. 


జంగారెడ్డిగూడెంలో టీడీపీకి ఊపు తెచ్చేలా..

జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇక్కడ కేవలం తొమ్మిది మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. టీడీపీకి చెందిన డమ్మీ అభ్యర్థులంతా నేడు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఇక్కడ వైసీపీకి టీడీపీ కంటిలో నలుసుగా మారింది. ఒక్కసారిగా సమీకరణలు మారడం టీడీపీకి కొంత నైతిక బలంతోపాటు నగర పంచాయతీలో అనేక వార్డులు చేజిక్కించుకోవడానికి మార్గం సుగమం చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, శ్రీరామమూర్తి, ముస్తఫా, రామ్‌కుమార్‌ వంటి నేతలు సహా పలువురు రంగంలోకి దిగి పార్టీకి ఊపు తెచ్చేలా వ్యూహం పన్నారు. జంగారెడ్డిగూడెం, ఏలూరులోను జనసేనతో ఒప్పందం జరిగేలా జాగ్రత్త పడుతున్నారు. 




Updated Date - 2021-03-03T05:40:48+05:30 IST