ఆయుర్వేదంతో కొవిడ్‌ దూరం!

ABN , First Publish Date - 2021-05-17T06:05:42+05:30 IST

ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాలతో కొవిడ్‌ రాకుండా అడ్డుకోవచ్చు.

ఆయుర్వేదంతో  కొవిడ్‌ దూరం!

(పోడూరు)

ఆయుష్‌ వైద్యురాలు డాక్టర్‌ జి.మల్లీశ్వరి 

ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాలతో కొవిడ్‌ రాకుండా అడ్డుకోవచ్చు. నోరు, ముక్కును శుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు పోడూరు మండలం కవిటం ప్రభుత్వాసుపత్రి ఆయుర్వేద వైద్యు రాలు డాక్టర్‌ మల్లీశ్వరి. ఆమె మాటల్లోనే..

బయటకు వెళ్లి వస్తే.. ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చిన వెంటనే వేడినీటిలో చిటికెడు పసుపు, ఉప్పు లేదా త్రిఫల లేదా యష్ఠిమధు చూర్ణం వేసి పుక్కలించాలి. దీనివల్ల నోటిలో ఏదైనా వైరస్‌ ఉన్నా బయటకు వచ్చేస్తోంది. రెండు ముక్కు నాళాల్లో అణు తైలం లేదా షడ్బిందు తైలం, లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి కొద్దిగా వేసి పీల్చి వదిలేయాలి. 

రోజుకోసారి.. ఆవిరి పట్టాలి. ఏ ఇబ్బంది లేనివాళ్లు వేడి నీటితోను, తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు తదితర శ్వాసకోశ సమస్యలు ఉంటే వాము లేదా పసుపు లేదా యూ కలిప్టస్‌ ఆయిల్‌ లలో ఏదో ఒకటి వేసి మూడు నిమిషాలు ఆవిరిపట్టాలి.

వ్యాయామం తప్పనిసరి.. రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. దీనివల్ల అలసట తగ్గి శరీరం తేలిక పడుతుంది. రోజూ అరగంట సేపు వ్యాయామం, 20 నిమిషాలు యోగా, ధ్యానం చేయాలి. వీటి వల్ల శ్వాసకోశ, గుండె పనితీరు మెరుగుపడి ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది.  

ఈ నీటిని తాగితే.. తులసి లేదా అల్లం లేదా కొత్త మీర ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం మంచిది. రోజూ రాత్రి 150 మి.లీ పాలలో అర టీ స్పూన్‌ పసుపు వేసుకుని తాగాలి. జీర్ణక్రియ సరిగా లేనివారు తాగరాదు. 

ఇమ్యూనిటీ పెంచేవి.. గడుంచి (తిప్పతీగ), ఉసిరి, పసుపు, తులసి, అశ్వగంధ.. ఇవి మనకు ప్రకృతి సిద్ధంగా లభించేవి. అందుబాటులో లేకపోతే అశ్వగంధ చూర్ణం, సంశమనవటీ, చ్యవనప్రాశ లేహ్యం, అగస్త్య హరితకీ లేహ్యం తీసుకోవాలి. 

వేడిగా తినాలి.. ఆకలి ఉన్నప్పుడు వేడివేడిగా తింటే అరుగుదల బాగుంటుంది.  వేసవి దృష్ట్యా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగి జావ, గంజి, బార్లీ నీళ్లు, మంచినీళ్లు తాగాలి, నిమ్మ రసంలో చిటికెడు ఉప్పు, ఒక చెంచా పంచదార కలుపుకుని తాగండి. 

ఇవి తినండి..  ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉండే పెసలు, కందిపప్పు, ఉలవలు, శనగలు తినడం మంచిది. పొటాషియం ఎక్కువ ఉండే వంకాయ, కాకర, పొట్ల, మునగ శ్రేష్టమైనవి. పాలకూర, తోటకూర ఉంటుంది. పొట్లకాయలో క్రిములపై దాడి చేసే గుణం ఉంది. తరచుగా వీటిని తింటే ప్రయోజనం. ద్రాక్ష, దానిమ్మ, వెలగ, నిమ్మ, ఉసిరి, జామ, బొప్పాయి పండ్లు ఉపయోగం. 

ఇంటిలో దూపం.. రోజూ వేయాలి. నిప్పులపై వేపాకులు, కర్పూరం, గుగ్గిలం, దింటెన లేదా ఘృతము వేసి రాత్రి వేళల్లో దూపం వేస్తే క్రిములు నశిస్తాయి. 

మట్టికుండల్లో ఆహారం బేష్‌ : మట్టి కుండలో ఆహారం ఆరోగ్యానికి మంచిది. బీపీ, సుగర్‌ వంటి దీర్ఘకాలిక రోగాలను దరిచేరనీయదు. అన్నం గంజి వార్చుకుని తింటే మంచిది. గంజి తాగితే బి.కాంప్లెక్స్‌ లభిస్తుంది. ఇలా రోజు వారి పద్ధతులను కాస్త మార్చుకుంటే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. ఎటువంటి వైరస్‌ మన దరిచేరదు. ఒక వేళ వైరస్‌ సోకినా ప్రమాదం ఉండదు.  

Updated Date - 2021-05-17T06:05:42+05:30 IST