రూ.10 కోట్లు ఏమైనట్లో...?

ABN , First Publish Date - 2022-06-14T05:56:19+05:30 IST

పులివెందుల ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన సూక్ష్మనీటి సేద్యం కలగా మారుతోంది.

రూ.10 కోట్లు ఏమైనట్లో...?
సంపు వద్ద ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్‌

సంపుల వద్దకు చేరని విద్యుత్‌... పొలాలకు అందని నీరు

నీటి పారుదల, విద్యుత్‌ శాఖల మధ్య సమన్వయ లోపం

కలగా మారిన సూక్ష్మనీటి సేద్యం


పులివెందుల, జూన్‌ 13: పులివెందుల ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన సూక్ష్మనీటి సేద్యం కలగా మారుతోంది. 2008లో అప్పటి ప్రభుత్వం సూక్ష్మనీటి సేద్యం పనులకు శ్రీకారం చుట్టింది. ఆ సూక్ష్మనీటి సేద్యానికి అవసరమైన విద్యుత్‌ నేటికీ సంపులవద్దకు చేరలేదు. ఇందుకోసం నీటిపారుదల శాఖ రూ.10.71కోట్ల నిధులు విద్యుత్‌ శాఖకు మళ్లించింది. కానీ నేటికి పనులు పూర్తిచేసి మాకు అప్పగించలేదని నీటిపారుదలశాఖ వాదన. పదేళ్లకిందటే పనులు పూర్తి చేశామని విద్యుత్‌శాఖ వాదిస్తోంది. కోట్లు ఖర్చుచేసి విద్యుత్‌ ఏర్పాటు చేశామని ఒక శాఖ, విద్యుత్‌ పనులు పూర్తైనట్లు మాకు అప్పగించాలి కాదా అని మరోశాఖ వాదించుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకెళితే...

పులివెందుల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరందించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం కృష్ణా నది నుంచి వచ్చే కొంతనీరు ఎక్కువ విస్తీర్ణానికి అందించాలంటే సూక్ష్మనీటి సేద్యమే పరిష్కారమని భావించింది. దీంతో 2.31 లక్షల ఎకరాలకు దాదాపు రూ.831 కోట్లతో సూక్ష్మనీటి సేద్యానికి సంబంధించి 2008లో అప్పటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఈ పనులు మూడు విడతల్లో చేసేందుకు శ్రీకారం చుట్టింది. మొదటి విడత 25వేలు, రెండో విడత లక్ష, మూడో విడత మిగిలిన ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పనులు చేపట్టింది. మొదటి విడతలో పైడిపాళెం ప్రాజెక్టు కింద 10వేల ఎకరాలు, పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ) కింద 10వేల ఎకరాలు, లింగాల కుడి కాల్వ కింద 5వేల ఎకరాల్లో సాగునీటిని అందించేందుకు పనులు చేపట్టింది. సూక్ష్మనీటి సేద్యం అమలు చేయాలంటే కాల్వ నుంచి వచ్చే నీటిని 100 ఎకరాలకు ఒక సిమెంట్‌ లైనింగ్‌తో నిర్మించిన సంపులో నింపుతారు. అక్కడి నుంచి 10 ఎకరాలకు ఒక మోటార్‌ ఏర్పాటు చేసి, ఆ మోటార్‌ ద్వారా పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి స్ర్పింక్లర్‌, డ్రిప్‌ ద్వారా పంట పొలాలకు నీరందించడం ఈ పథకం ఉద్దేశం. 


ఎవరి వాదన వారిది...

సంపుల వద్దకు కావాల్సిన విద్యుత్‌ సాగునీటి శాఖే ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఈ 25వేల ఎకరాలకు ఆయా సంపుల వద్దకు విద్యుత్‌లైన్‌ ఏర్పాటుచేసి 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.10.71కోట్ల నిధులు నీటిపారుదల శాఖ ట్రాన్స్‌కోకు అందించింది. ఈ మేరకు ట్రాన్స్‌కో కూడా పనులు చేపట్టింది. ప్రతి సంపు వద్దకు 11 కేవీ విద్యుత్‌ లైన్లు.. అక్కడ 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ తదితర సామగ్రి సమకూర్చుతూ వచ్చింది. దాదాపు 230 సంపుల వద్ద ఏర్పాటు చేయాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లు కొంతమేర ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో ప్రాజెక్టులోకి నీరు రావడం... కాల్వల్లో నీరు పారే పరిస్థితి అప్పట్లో లేకపోయింది. దీంతో ఎవరూ పట్టించుకోలేదు. ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు పగులగొట్టి రాగి తీగలు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు వచ్చి కాల్వల్లో నీరు ప్రవహిస్తోంది. దీంతో సంపులకు నీరు మళ్లించి పంట పొలాలకు అందించేందుకు ప్రస్తుతం విద్యుత్‌ కనెక్షన్లు లేవు. దీనిపై నీటిపారుదలశాఖ అధికారులను రైౖతులు ప్రశ్నిస్తే... విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ ఏర్పాటు చేయమని చెప్పినా పట్టించుకోలేదని చెబుతున్నారు. విద్యుత్‌ అధికారులు మాత్రం మేము ఏర్పాటు చేశాం... వాటిని నీటిపారుదలశాఖ పట్టించుకోకపోవడంతో అన్నీ పాడైపోయాయని వారు వాదిస్తున్నారు. మేము డబ్బులు చెల్లించినపుడు విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసి ఉంటే...  పనులు పూర్తి చేశామని పేపర్‌ ద్వారా మాకు అప్పగించాలి తప్ప ఫీల్డ్‌లో పనిచేశామని చేతులు దులుపుకొంటే ఎలా అని నీటిపారుదలశాఖ అధికారులు ప్రశ్నిస్తు న్నారు. అయితే విద్యుత్‌ మేము ఏర్పాటు చేసినా.. నీటిపారుదలశాఖ అప్పట్లో పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. ఇలా ఇరు శాఖల అధికారుల పుణ్యమా అని రూ.10కోట్ల నిధుల పనులు అంతుబట్టలేని విధంగా తయారయ్యాయి.   ఏమేర పనులు చేశారు.. వాటికి ఎంత ఖర్చు అయ్యాయో ఆ వివరాలు ట్రాన్స్‌కో అధికారులు నీటి పారుదల శాఖకు సమాచారం ఇవ్వనట్లు తెలస్తోంది. ఏదిఏమైనా ఈ రెండు శాఖల సమన్వయ లోపంతో సూక్ష్మనీటి సేద్యం పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. 

ఇందుకు సంబంధించి ఇరుశాఖల అధికారులను ఆంధ్రజ్యోతి వివరణ కోరింది. వారి మాటల్లోనే...


అప్పుడు నిద్రపోయారు...

ఎల్‌.నరసింహ ప్రసాద్‌,  పులివెందుల ట్రాన్స్‌కో డీఈ

పదేళ్ల కిందట సూక్ష్మనీటి సేద్యానికి సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పూర్తి చేశాం... అపుడు నీటిపారుదల శాఖ పట్టించుకోకుండా నిద్రపోయింది.  సంపుల వద్ద విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఎప్పుడో ఏర్పాటు చేశాం. నీటిపారుదల శాఖ పనులు చేయమని డబ్బులు మాశాఖకు బదిలీ చేసినపుడే పనులు ప్రారంభించి.. కడపకు సంబంధించి కాంట్రాక్ట్‌ వింగ్‌ ద్వారా పదేళ్ల కిందటే పూర్తిచేశాం. అపుడు పట్టించుకోకుండా వదిలేయడంతోనే ఈ పరిస్థితి వచ్చింది.


మాకు అప్పగించినట్లు ఆధారాలేవి..

రాజశేఖర్‌, పీబీసీ ఈఈ

సూక్ష్మనీటి సేద్యం అమలులో భాగంగా పనులు పూర్తిచేసి మాకు అప్పగించినట్లు పేపర్‌ పైన ఎప్పుడిచ్చారో చెప్పాలి. పది సంవత్సరాల క్రితం పనులు పూర్తిచేశామని ట్రాన్స్‌కో నోటిమాటలు చెప్పడం కుదరదు. సాగునీటి శాఖ దాదాపు రూ.10.71కోట్ల నిధులు ట్రాన్స్‌కోకు ఇచ్చింది. డబ్బులు ఇచ్చిన శాఖకు పనులు పూర్తి చేశామని.. ఆ పనులకు సంబంధించి వివరాలతో కూడిన పేపర్‌పై మాకు వివరించాల్సి ఉంది. కానీ పేపర్‌పైన ఎక్కడ ఇలాంటి అప్పగింతలేమీ జరగలేదు. డిపాజిట్‌ చేసిన డబ్బుకు ఆశాఖ సమాధానం చెప్పాలి తప్ప పనులు పూర్తి చేశామని నోటిమాటలు చెల్లవు. కొన్ని ట్రాన్స్‌ఫార్మర్లను సంపుల వద్ద ఏర్పాటు చేసిన మాట వాస్తవమే. కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏమిటి, వాటికి ఎంత డబ్బు ఖర్చు అయింది. మిగిలిన డబ్బు ఎంత అనే వివరాలు మాకు అందించలేదు.  

 

 

Updated Date - 2022-06-14T05:56:19+05:30 IST