ఇక ఇంతేనా..!

ABN , First Publish Date - 2021-10-06T05:23:40+05:30 IST

కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు సత్యరాజు.

ఇక ఇంతేనా..!
ఈ రైతు పేరు సత్యరాజు.

  1. యార్డులో నిలిచిన ఉల్లి కొనుగోళ్లు
  2. రోడ్లపై చిల్లరగా అమ్ముతున్న రైతులు
  3. ఉపాధి లేక రోడ్డున పడిన హమాలీలు
  4. కమీషన ఏజెంట్లపై చర్యలకు సమాయత్తం
  5. నోటీసులు జారీ చేసిన యార్డు అధికారులు
  6. ఈ-నామ్‌ విధానంపై ఎవరి వాదన వారిదే..!


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 5: 

కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు సత్యరాజు. దాదాపు రూ.50 వేల దాకా ఖర్చు చేసి అర ఎకరం పొలంలో ఉల్లిని సాగు చేశాడు. తీరా పంట చేతికొచ్చిన సమయంలో ఈ-నామ్‌ వివాదం కారణంగా కర్నూలు యార్డులో ఉల్లి విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో పొలంలో కుప్పలుగా పోసిన ఉల్లిని ఎలా అమ్ముకోవాలో తెలియక సత్యరాజు ఇబ్బంది పడుతున్నాడు. వ్యాపారులు గ్రామానికి వచ్చి నాణ్యమైన ఉల్లిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మరోదారి లేక నగరంలో చిల్లరగా అమ్ముకునేందుకు ట్రాక్టర్‌లో 50 ప్యాకెట్ల ఉల్లిని తీసుకువచ్చాడు. ట్రాక్టర్‌కు రూ.4 వేలు బాడుగ చెల్లించాడు. మార్కెట్‌ యార్డు బయట మెయిన రోడ్డుపై ఉల్లి సంచులను పేర్చుకుని సోమవారం నుంచి చిల్లరగా అమ్ముతున్నాడు. ప్యాకెట్‌ను రూ.300 నుంచి రూ.400 ప్రకారం 40 సంచుల ఉల్లిని అమ్ముకున్నాడు. మిగిలిన పది సంచుల ఉల్లిని మంగళవారం రాత్రికల్లా అమ్ముకుని ఇంటిదారి పట్టాలని రైతు తాపత్రపడుతున్నాడు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి ఇది. మరో వారం రోజుల్లో దసరా పండుగ ఉంది. బిడ్డలకు కొత్తబట్టలు కొందామన్నా, పండుగ సరుకులు కొందామన్నా.. చేతిలో చిల్లిగవ్వలేక తల్లడిల్లిపోతున్నారు. కర్నూలు యార్డు పరిసరాల్లో ఉల్లి  దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న తంటాలను చూసి నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 


తెగని ఈనామ్‌ పంచాయితీ

కర్నూలు మార్కెట్‌ యార్డులో గత నెల 17వ తేదీ నుంచి ఉల్లి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ-నామ్‌ పద్ధతిలో ఉల్లి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, కమీషన ఏజెంట్లు సుముఖంగా లేరు. ఉల్లి క్రయవిక్రయాలు ఆగిపోవడంతో వందలాది మంది హమాలీలు ఉపాధి కోల్పోయారు. పని లేక కుటుంబాలను పస్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉల్లిని ఈనామ్‌ పద్ధతిలోనే కొనుగోలు చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వ్యాపారులు, కమీషన ఏజెంట్లతో చర్చలు జరుపుతున్నా.. అధికారుల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ వ్యవహారంలో తమ తప్పేమీ లేదని వ్యాపారులు, కమీషన ఏజెంట్లు అంటున్నారు. నాణ్యమైన ఉల్లిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని వ్యాపారులు కోరుతున్నారు. కానీ రైతులకు అప్పు ఇచ్చిన కమీషన ఏజెంట్లు మాత్రం యార్డుకు రైతులు తెచ్చిన మొత్తం ఉల్లిని కొనుగోలు చేయాలని, లేదంటే తమ అప్పులు తిరిగి రావని అంటున్నారు. నాణ్యత పేరిట వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేయకుండా నిలిపివేస్తున్నారని, దీనివల్ల రైతులు, వారికి అప్పులు ఇచ్చిన తాము నష్టపోతామని అంటున్నారు. అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా కమీషన ఏజెంట్లు, వ్యాపారులతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. ఎవరి వాదన వారు వినిపిస్తూనే ఉన్నారు. అధికారులు చెప్పిన మాటలను వ్యాపారులు, కమీషన ఏజెంట్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. 

నిండా మునుగుతున్న రైతులు

జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో ఉల్లిని సాగు చేశారు. ఎకరాకు రూ.70 వేల దాకా ఖర్చు చేశారు. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా ఉల్లి దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. ఎకరాకి 100 క్వింటాళ్ల దాకా దిగుబడి రావాల్సి ఉండగా.. 30 నుంచి 40 క్వింటాళ్లు మాత్రమే చేతికందింది. దీనికితోడు కర్నూలు మార్కెట్‌యార్డులో ఉల్లి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు, అధికారుల నడుమ తాము నిండా మునిగిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు కంటతడి పెడుతున్నారు. తాజా పరిస్థితులలో వ్యాపారులు గ్రామాలకే వాహనాలు తీసుకుని వెళ్లి రైతుల నుంచి ఉల్లి దిగుబడులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రవాణా ఖర్చులు మిగిలిపోతాయని, యార్డులో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తప్పిపోయిందని రైతులు సంతోషిస్తున్నా, వ్యాపారులు కేవలం నాణ్యమైన సరుకునే కొనుగోలు చేస్తున్నారు. దీంతో మిగిలిన రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

కమీషన ఏజెంట్లలో గుబులు 

జిల్లాలో దశాబ్ద కాలంగా కమీషన ఏజెంట్లు ఉల్లి రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం అప్పులు ఇస్తున్నారు. పంట దిగుబడిని మార్కెట్‌లో రైతులు అమ్మిన తర్వాత వడ్డీతో కలిపి అప్పులను వసూలు చేసుకుంటున్నారు. తాజా వివాదం కారణంగా తాము తీవ్రంగా నష్టపోతామని కమీషన ఏజెంట్లు వాపోతున్నారు. ఈ-నామ్‌ పద్ధతి అమల్లోకి రాకముందు తమకు ఇబ్బందులు ఉండేవి కావని, మొత్తం దిగుబడులను వ్యాపారులు కొనేవారని అంటున్నారు. ఈ-నామ్‌ పద్ధతిని అమల్లోకి వచ్చాక నాణ్యత లేదన్న కారణంగా రోజుకు వెయి క్వింటాళ్ల దాకా ఉల్లిని కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల రైతుల నుంచి అప్పులు వసూలు చేసుకోవడం భారంగా మారిందని వాపోతున్నారు. రైతుల నుంచి రూ.కోటికి పైగా అప్పులు రావాల్సి ఉందని కమీషన ఏజెంట్లు అంటున్నారు. 

చర్యలు తప్పవా..?

వ్యాపారులు మొత్తం దిగుబడులను కొనేవరకూ యార్డుకు ఉల్లిని తీసుకురావద్దని రైతులకు కమీషన ఏజెంట్లు సూచించారు. దీంతో లావాదేవీలు నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్కెట్‌ కమిటీ పాలకమండలి, అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉల్లిని కర్నూలు యార్డుకు తీసుకురానివ్వకుండా అడ్డుపడుతున్న కమీషన ఏజెంట్లపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ-నామ్‌ పద్ధతిని వ్యతిరేకిస్తున్నందున మొదట కమిషన ఏజెంట్లపై చర్యలు చేపట్టేందుకు నోటీసులు జారీ చేస్తున్నామని పాలకమండలి డైరెక్టర్‌ మహబూబ్‌ బాషా, సెక్రటరీ జయలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ-నామ్‌ పద్ధతికి అడ్డుపడే వారిపై ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

రోడ్డున పడిన హమాలీలు

ఉల్లి విక్రయాలు నిలిచిపోవడంతో యార్డులో పని చేస్తున్న వందలాది మంది హమాలీలు పని లేక రోడ్డున పడ్డారు. ఉల్లి విక్రయాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ వారం రోజులుగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పూట గడవక పస్తులు ఉండాల్సి వస్తోందని హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


లైసెన్సులు రద్దు చేస్తాం..

ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తాం. ఉల్లిని మార్కెట్‌ యార్డుకు తీసుకురానీకుండా రైతులకు అడ్డుపడుతున్న కమీషన ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామ. ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చాము. సహకరించకపోతే లైసెన్సులు రద్దు చేసి, కొత్తవారికి లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తాం. ఈ-నామ్‌ విధానంలో వ్యాపారులు, కమీషన ఏజెంట్లకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వీటిని పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరాము. 

 - జయలక్ష్మి, సెక్రటరీ



Updated Date - 2021-10-06T05:23:40+05:30 IST