ఏమవుతుందో!

ABN , First Publish Date - 2021-01-11T05:08:06+05:30 IST

పంచాయతీ సంగ్రామంపై ఇంకా సందిగ్ధం వీడలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషర్‌ (ఎస్‌ఈసీ) పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినా సర్కార్‌ మాత్రం ఇప్పట్లో నిర్వహించలేమని చెబుతోంది. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఎన్నికలు జరిగేనా? ఆగేనా? అన్న సందిగ్ధత అందరిలో నెలకొంది.

ఏమవుతుందో!

పంచాయతీ సంగ్రామం.. అయోమయం

 ఎన్నికలపై గ్రామాల్లో చర్చ

 ఆశావాహుల్లో టెన్షన

కొమరాడ/ విజయనగరం రూరల్‌, జనవరి 10:

పంచాయతీ సంగ్రామంపై ఇంకా సందిగ్ధం వీడలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషర్‌ (ఎస్‌ఈసీ) పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినా సర్కార్‌ మాత్రం ఇప్పట్లో నిర్వహించలేమని చెబుతోంది. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఎన్నికలు జరిగేనా? ఆగేనా? అన్న సందిగ్ధత అందరిలో నెలకొంది. అయితే ఏడేళ్ల తరువాత జరుగుతున్న స్థానిక పోరుకు ఆశావాహులు సిద్ధమవుతున్నారు. గతేడాది మార్చిలో స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి నామినేషన్ల స్వీకరణ, స్ర్కూట్నీ, విత్‌డ్రాలు సైతం పూర్తయ్యాయి. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను సైతం వెలువరించారు. తరువాత గ్రామ పంచాయతీల ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అప్పట్లో రెండు విడతల్లో జిల్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. జిల్లాలో పార్వతీపురం, విజయనగరం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 34 మండలాలు ఉన్నాయి. 960 గ్రామ పంచాయతీల (కొత్త వాటితో కలిపి) సర్పంచ్‌లకు, 9032 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి.

రిజర్వేషన్లు ఇలా

2018 ఆగస్టు నెలతో పల్లె పాలకుల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేశారు. అప్పట్లో జిల్లా అధికారులు గ్రామ పంచాయతీల రిజర్వేషన్లను సైతం ఖరారు చేశారు. ఇప్పుడు దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 960 గ్రామ పంచాయతీల్లో ఎస్సీ 135, ఎస్సీ 92, బీసీ 282, అన్‌ రిజర్వుడు 451 స్థానాలకు కేటాయిస్తూ గెజిట్‌ను కలెక్టర్‌ అప్పట్లో జారీ చేశారు.

సిబ్బందిని నియమిస్తే చాలు

స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియలో 80 శాతం గతంలోనే పూర్తి చేశారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, రిజర్వేషన్ల ఖరారు, బ్యాలెట్‌ పేపరు ముద్రణ, ఎన్నికల సిబ్బంది శిక్షణ వంటి వాటిని పూర్తి చేశారు. చివర్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ నెల 23న తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పల్లె పోరు నిర్వహణపై అధికారులు పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనుండడంతో బ్యాలెట్‌ బాక్సులకు కూడా ఇబ్బంది ఏర్పడదు. స్టేజ్‌-1 అధికారులను, సిబ్బందిని నియమించి ఒకసారి పునశ్చరణ శిక్షణ ఇస్తే సరిపోతుందని మండల స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల సంఘం స్థానిక పోరుకు షెడ్యూల్‌ ఖరారు చేయడంతో పల్లెల్లో రాజకీయ వేడి పెరిగింది. పంచాయతీలకు పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినా కొందరు అభ్యర్థులకు పార్టీలు మద్దతు ఇస్తుండటంతో రాజకీయంగా చర్చ మొదలైంది. సర్పంచ్‌లుగా బరిలో ఉండాలనుకొనే కొంతమంది అభ్యర్థులు ప్రధాన పార్టీల నాయకులను ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీగా ఉన్నారు.


Updated Date - 2021-01-11T05:08:06+05:30 IST