ఏడాదిలో ఏం జరిగింది?

ABN , First Publish Date - 2020-06-01T10:53:32+05:30 IST

పారిశ్రామిక ప్రగతికి అద్భుతమైన అవకాశాలు..

ఏడాదిలో ఏం జరిగింది?

అప్పుడు పరి‘శ్రమించగా’.. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించక..

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన కొత్త ప్రభుత్వం

టీడీపీ హయాంలో పెద్దఎత్తున కొలువుదీరిన పరిశ్రమలు

ఏడాదిలో ఒక్కటీ కొత్త పరిశ్రమ రాని వైనం

ముందుకొచ్చిన వాళ్లూ వెనక్కి పోతున్నారు

చిత్తూరు జిల్లాలో కుప్పకూలిన పారిశ్రామిక ప్రగతి


చిత్తూరు(ఆంధ్రజ్యోతి):  పారిశ్రామిక ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్న జిల్లా చిత్తూరు. చెన్నై, బెంగళూరు నగరాలు అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం. మూడు విమానాశ్రయాలు, రెండు ఓడరేవులు అందుబాటులో ఉన్న జిల్లా. జాతీయ రహదారుల కూడలి. అందుకే గత పదిహేనేళ్లలో జిల్లా పారిశ్రామిక చిత్రపటంలో వేగవంతమైన ప్రగతి కనిపిస్తుంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనాకాలంలో మొదలైన శ్రీసిటీ దేశంలోనే ప్రతిష్టాత్మక సెజ్‌గా పేరుతెచ్చుకుంది. మెట్రో రైళ్ల మొదలు, మొబైల్‌ విడి భాగాల దాకా ఇక్కడ తయారవుతున్నాయి. ఎప్పటి నుంచో అమరరాజ సంస్థలు వేలాది మందికి జిల్లాలో ఉపాధి చూపుతున్నాయి. ఈ అనుకూల పరిస్థితులను గమనించిన గత ప్రభుత్వం జిల్లా తూర్పు ప్రాంతాన్ని పారిశ్రామిక క్లస్టర్‌లుగా అభివృద్ధి చేసేందుకు పూనుకుంది.


రేణిగుంట-ఏర్పేడు నడుమ పరిశ్రమల స్థాపనకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. విభజన అనంతరం తిరుపతి మెట్రో నగరంగా రూపు మారడానికి మార్గం ఏర్పడింది. ఉపాధి కోసం చెన్నై, బెంగళూరు నగరాలకు పరుగులెత్తే యువతకు సొంతజిల్లాలోనే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంతా ఆశపడ్డారు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పారిశ్రామిక ప్రగతి మరింత పరుగులు తీయాల్సిందిపోయి కుప్పకూలింది. ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా జిల్లాలో మొదలవలేదు. పైగా కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన పెట్టుబడిదారులు ఒకరొకరుగా వెనక్కిపోవడం మొదలు పెట్టారు. జిల్లా పారిశ్రామిక కేలండర్‌లో ఎదుగూబొదుగూ లేని కాలంగా ఈ ఏడాది మిగిలిపోనుంది. 



రూ.15 వేల కోట్ల జియో పరిశ్రమ రద్దు

టీడీపీ హయాంలో భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ సంస్థ తిరుపతి సమీపంలోని 150 ఎకరాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ర్టానిక్‌ పార్కును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జియో ఫోన్‌లు, టీవీలు, సెటాప్‌ బాక్సులు వంటి ఇక్కడ తయారవుతాయి.  అవసరమైన స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. కనీసం 2 వేల మందికి ఉపాధి లభించేది. జిల్లావాసులు దీనిమీద కోటి ఆశలు పెట్టుకున్నారు. తీరా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏం జరిగిందో ఏమో.. జియో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కొత్త ప్రభుత్వ  పారిశ్రామిక విధానం పారిశ్రామిక వేత్తలను పెట్టుబడిదారులను ఆందోళనపరుస్తోందని విమర్శలు వచ్చాయి. 


ప్రశ్నార్థకంగా రూ.10.70 కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ప్రగతి

జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరుపుకున్న 56 భారీ పరిశ్రమల ప్రగతి ఆగిపోయింది. అవన్నీ ఇప్పుడిప్పుడే ఉత్పత్తిని ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. రూ.10,730 కోట్ల పెట్టుబడితో 45 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పరిశ్రమలన్నీ టీడీపీ హయాంలో నిర్మాణం ప్రారంభించాయి. ఏడాదిగా ముందుకు కదలని పరిశ్రమల జాబితా ఇదీ.. 

  • - పానెల్‌ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏర్పేడు, రూ.1732 కోట్ల పెట్టుబడి, 3174 మందికి ఉపాధికి లక్ష్యం
  • - లిండె ఇండియా లిమిటెడ్‌ (లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్స్‌), రూ.500 కోట్ల పెట్టుబడి, 600 మంది ఉపాధి.
  • - నవ క్వాలిటీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎర్రావారిపాలెం, రూ.155 కోట్ల పెట్టుబడి, 1500 మందికి ఉపాధి
  • - హైటైన్‌ ప్లాస్టిక్స్‌ మిషనరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెట్‌, శ్రీసిటీ, రూ.84 కోట్ల పెట్టుబడి, 121 మంది ఉపాధి
  • - హమిల్టన్‌ హౌప్‌వేర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శ్రీసిటీ (ప్లాస్టిక్‌ హోమ్‌ నీడ్స్‌), రూ.47 కోట్లు, 400 మంది ఉపాధి
  • - ఆర్‌వీ లిఫ్ట్‌ ప్రాడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గంగవరం (లిఫ్ట్‌లు, వాటి విడిభాగాల తయారీ) రూ.21 కోట్లు, 200 మందికి ఉపాధి
  • - జీజే ఫ్రూట్‌ పాడ్రక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కలకడ, రూ.16 కోట్లు, 150 మందికి ఉపాధి
  • - వెజ్‌బై నేచ్యుర్‌ పాడ్రక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌ఆర్‌పురం, రూ.12.5 కోట్లు, 265 మందికి ఉపాధి



గతమెంతో ఘనం..

టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో జిల్లాకు పరిశ్రమలు పెద్దఎత్తున వచ్చాయి. రూ.19,452 కోట్లతో పెద్ద, భారీ పరిశ్రమలు లక్ష మందికిపైగా ఉపాధి కల్పించాయి. వీటితో పాటు రూ.2,200 కోట్ల పెట్టుబడితో 3 వేల ఎంఎస్‌ఎంఈలు సుమారు 60 వేల మందికిపైగా ఉపాధిని ఇస్తున్నాయి. సెల్‌ఫోన్‌లు, టెలివిజన్‌ సెట్ల తయారీలో అతిపెద్ద మ్యానుఫ్యాక్షరింగ్‌ సంస్థలు సెల్‌కాన్‌, ఫాక్సన్‌, డిక్సన్‌ వంటివి తిరుపతి, శ్రీసిటీలో ఉన్నాయి. ఛైర్‌మ్యాక్స్‌, గ్రీన్‌ప్లే, మొండెలేజ్‌, ఇసుజి, కోల్గేట్‌, కెలోగ్స్‌, షాహి ఎక్స్‌పోర్ట్స్‌, అమర్‌రాజా వంటి అతి భారీ పరిశ్రమలు  జిల్లాలో ఏర్పాటై ఉన్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వాల పాలనా కాలంలో ఏర్పడినవే. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో మాత్రం ఒక్క పరిశ్రమా ఈ జాబితాలో జత కాలేదు.


ఐదేళ్ల టీడీపీ హయాంలో జిల్లాలో పరిశ్రమల ప్రగతి ఇలా..

సంవత్సరం పరిశ్రమలు పెట్టుబడులు (రూ.కోట్లలో..)

2014-15 235 1,611

2015-16 398 2,104

2016-17 491 2,941

2017-18 826 2,377

2018-19 1076 10,419

మొత్తం 3,026 19,452

  • - ఇవి పెద్ద, భారీ తరహా పరిశ్రమల వివరాలు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎ్‌సఎంఈ) వేల సంఖ్యలో ఏర్పాటయ్యాయి.


ఐదేళ్లలో వివిధ కేటగిరీల్లో పరిశ్రమలు- ఉపాధి

పరిశ్రమ తరహా పరిశ్రమల సంఖ్య ఉద్యోగాల సంఖ్య

సూక్ష్మ 966 45,048

చిన్న 950 23,424

మధ్య 64 8,990

పెద్ద 134 38,784

భారీ 21 13,373

మొత్తం 2,135 1,29,619


టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరుపుకున్న కీలకమైన 11 పరిశ్రమలు ఇటీవల తమ ఉత్పత్తిని ప్రారంభించాయి. వాటి వివరాలు:

  • - హీరో మోటార్స్‌, సత్యవేడు
  • - రాక్‌మ్యాన్‌ ఇండస్ర్టీస్‌, ఏర్పేడు
  • - యూఎ్‌సజీ బోరాల్స్‌, శ్రీసిటీ
  • - టాటా స్మార్ట్‌ ఫుడ్‌, శ్రీసిటీ
  • - ఫామ్‌గేట్‌, గండ్రాజుపల్లె
  • - కజారియా ఇండస్ర్టీస్‌, తొట్టంబేడు
  • - సుందరం ఫాస్ట్‌నర్స్‌, శ్రీసిటీ
  • - టీవీఎస్‌ బ్రేక్స్‌ ఇండియా లిమిటెడ్‌, శ్రీసిటీ
  • - విశ్వ అపరైల్స్‌, గండ్రాజుపల్లె
  • - ట్యూబ్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌, శ్రీసిటీ
  • - సన్నీ ఒపో టెక్‌, ఈఎంసీ, ఏర్పేడు

ఈ ఏడాదిలో ఏం జరిగింది?

వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మందగించింది.  గతేడాది జూన్‌ నుంచి 407 మంది (అన్ని రకాల పరిశ్రమల కోసం) రూ.9160 కోట్ల పెట్టుబడుల అంచనాలతో పరిశ్రమల స్థాపనకు ఆన్‌లైన్‌  ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇందువల్ల 24,268 మందికి ఉపాధి లభిస్తుందని భావించారు. అయితే అన్నీ అలాగే పెండింగ్‌లో ఉన్నాయి.


జిల్లాలో పరిశ్రమలకు అనుకూలతలు

  • - చెన్నై- విశాఖ, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లలో ఉన్న జిల్లా కావడం
  • - విస్తారంగా ప్రభుత్వ భూములు
  • - దక్షిణాది రాష్ట్రాల సరిహద్దులో ఉండడం
  • - మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థ, రైల్వే విమానాశ్రయాలు
  • - సమీపంలో చెన్నై, కృష్ణపట్నం ఓడరేవులు

Updated Date - 2020-06-01T10:53:32+05:30 IST