చనిపోయిందనుకుని తలుపులు వేసి పారిపోయిన భర్త... స్థానికులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా..
ABN , First Publish Date - 2022-09-15T00:48:26+05:30 IST
భర్త ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. కట్టుకున్న వాడు కావడంతో భార్య ఓపిగ్గా భరిస్తుంది. కొన్నిసార్లు భర్తలు పెట్టే చిత్రహింసలు చాలా దారుణంగా ఉంటాయి. అయినా చాలా మంది..
భర్త ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. కట్టుకున్న వాడు కావడంతో భార్య ఓపిగ్గా భరిస్తుంది. కొన్నిసార్లు భర్తలు పెట్టే చిత్రహింసలు చాలా దారుణంగా ఉంటాయి. అయినా చాలా మంది మహిళలు ఓర్చుకుంటూ కాపురం చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో భర్త దారుణాలను ధైర్యంగా ఎదురిస్తుంటారు. చివరకు వారి నుంచి విడిపోయి, స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన మూడో నెల నుంచే భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఓ రోజు చనిపోయిందనుకుని తలుపులు వేసి పారిపోయాడు. అయితే స్థానికులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్ పరిధి డెహ్లిగేట్ ప్రాంతానికి చెందిన అష్ఫియాకు ఖదీర్ అనే వ్యక్తితో 2020లో వివాహమైంది. ఖదీర్ స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. పెళ్లయిన రెండు నెలలు బాగానే చూసుకున్న భర్త.. తర్వాత చిత్రహింసలు పెట్టడం మొదలెట్టాడు. రోజూ రాత్రిళ్లు వివిధ సాకులు చూపుతూ దారుణంగా కొడుతుండేవాడు. రూ.3లక్షలు కట్నం తేవాలని వేధించేవాడు. అయినా ఆమె భరిస్తూ వచ్చింది. మధ్యలో పలుమార్లు పెద్దలు పంచాయతీలు చేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. తర్వాత యథావిధిగా భార్యపై దాడికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం మళ్లీ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. మధ్యాహ్నం హఠాత్తుగా ఇంట్లోకి వచ్చి తలుపులు మూశాడు.
4 అంతస్థుల భవనం.. యజమానికి తెలియకుండానే ఏడాదిలోనే 20 సార్లు అమ్మేశారు.. ఇంత మోసం ఎలా జరిగిందంటే..
భార్య జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. వద్దని ఎంత వేడుకుంటున్నా కనికరం చూపలేదు. చేతులు కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కి మరీ దాడి చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. చనిపోయిందని భావించిన భర్త.. తలుపులు మూసి అక్కడి నుంచి పరారయ్యాడు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8వరకూ అలాగే నరకయాతన అనుభవించింది. పక్కింటి వారికి అనుమానం వచ్చి తలుపులు తెరిచారు. లోపల తీవ్ర గాయాలతో గిలాగిలా కొట్టుకుంటున్న అష్ఫియాను చూసి షాక్ అయ్యారు. అనంతరం ఆమె కట్లు విడిపించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి శాడిస్టు భర్త తనకు వద్దని, విడాకులు ఇప్పించాలని బాధితురాలు వేడుకుంటోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.