Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 2 2021 @ 17:38PM

మీ కులానికి మీరేం చేశారు : బీఎస్‌పీ

లక్నో : వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బహుజన్ సమాజ్ పార్టీ సమాయత్తమవుతోంది. పార్టీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తులు పంపాలని ఆ పార్టీ కోరింది. దరఖాస్తుదారులు తమ కులానికి చేసిన సేవ ఏమిటో వివరించాలని తెలిపింది. 


బీఎస్‌పీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, వృత్తిపరమైన ప్రత్యేక నైపుణ్యంతో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. బీఎస్‌పీ జిల్లా శాఖ అధ్యక్షుడు/అధ్యక్షురాలు నేతృత్వంలోని కమిటీ ప్రతి నియోజకవర్గం నుంచి 10 దరఖాస్తులను ఎంపిక చేస్తుంది. దరఖాస్తుదారు తన కులానికి ఏం చేశారో వివరించాలి. దరఖాస్తుదారు బ్రాహ్మణుడైతే తన కులానికి తాను చేసినదేమిటో చెప్పాలి. అదేవిధంగా ఎస్సీలైతే తమ కులాలకు వారు ఏం చేశారో చెప్పాలి. తమ తమ కులాలను చైతన్యపరచడానికి సమావేశాల నిర్వహణ, సభల ఏర్పాటు, ధర్నాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేస్తే, వాటి గురించి 250-300 పదాల్లో వివరించాలి. కులానికి సేవ చేయడం మాత్రమే కాకుండా రాజకీయాల్లో సాధించిన విజయాలను కూడా దరఖాస్తుదారులు తెలియజేయాలి. దరఖాస్తుదారులు తమ కుటుంబ నేపథ్యం, వృత్తిపరమైన వివరాలను కూడా సమర్పించాలి. 


దరఖాస్తుల పరిశీలన ఈ నెలాఖరుకు పూర్తవుతుందని, అక్టోబరులో అభ్యర్థులను ఖరారు చేస్తారని బీఎస్‌పీ నేత ఒకరు ఓ వార్తా సంస్థకు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి రెండు లేదా మూడు దరఖాస్తుల చొప్పున ఎంపిక చేసి, పార్టీ చీఫ్ మాయావతికి సమర్పిస్తారని, తుది అభ్యర్థులను ఆమె ఖరారు చేస్తారని చెప్పారు. 


Advertisement
Advertisement