ఏమి జరుగునో..

ABN , First Publish Date - 2021-10-23T05:51:24+05:30 IST

వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కాకినాడ నగర మేయర్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈనెల 25న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో కొత్త మలుపు లు తిరుగుతోంది.

ఏమి జరుగునో..

  • కాకినాడ మేయర్‌ ఎన్నిక, కోర్టు వాయిదా ఒకేరోజు
  • 25న నగర మేయర్‌ ఎన్నిక.. వైసీపీలో అసమ్మతి సెగలు  

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 22: వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కాకినాడ  నగర మేయర్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈనెల 25న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో కొత్త మలుపు లు తిరుగుతోంది. తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం శాస్త్రీయబద్ధంగా జరగలేదని మాజీ మేయర్‌ సుంకర పావని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అవిశ్వాస తీర్మాన ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై శుక్రవారం జరిగిన విచారణ అనంతరం తిరిగి ఈనెల 25కి కోర్టు వాయిదా వేసింది. రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు నడచుకోకుండా అవిశ్వాస తీర్మాన ఫలితాలు కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపడాన్ని హైకోర్టు ప్రశ్నించడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ మొదలైంది. సోమవారం కలెక్టర్‌ హైకోర్టుకు హాజరు కావాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియపై ఎటువంటి నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు జోరుగా పావులు కదిపి పరిస్థితులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. అందులో భాగంగా డిప్యూటీ మేయర్‌-2కు ఇన్‌చార్జి మేయర్‌ బాధ్యతలు అప్పగించడం, ఇన్‌చార్జి మేయర్‌ అధ్యక్షతన కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. సరిగ్గా ఈ సమయంలోనే వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్‌కు డిప్యూటీ మేయర్‌-2 పదవి కట్టబెట్టడం, హడావుడిగా ఇన్‌చార్జి మేయర్‌గా బాధ్యతలు అప్పజెప్పడం వంటి పరిణామాలపై కొందరు కార్పొరేటర్లు రగిలిపోతున్నారు. డిప్యూటీ మేయర్‌-2 అధ్యక్షతన కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించడం పట్ల వైసీపీ కార్పొరేటర్‌ కిషోర్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఊహించిన ఈ పరిణామాలతో వైసీపీ కార్పొరేటర్లు రంగంలోకి దిగి సర్దుబాటు ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్వయంగా కిషోర్‌ను కౌన్సిల్‌ యాంటీ రూమ్‌లోకి తీసుకెళ్లి బుజ్జగించినట్టు తెలిసింది. ఈ పరిణామాలతో డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి ఎంపికపై సందిగ్ధం కొనసాగుతోంది. మరోవైపు టీడీపీ, వైసీపీలతో సత్సంబంధాలు గల సుంకర విద్యాసాగర్‌ సతీమణి సుంకర శివప్రసన్నను మేయర్‌గా ఎన్నుకునేందుకు ఖరారు చేశారు. అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్‌గా వైసీపీ కార్పొరేటర్లు కిషోర్‌, సత్యలలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని మెజారిటీ కార్పొరేటర్లు భావిస్తున్నారు. కుల సమీకరణలలో భాగంగా మరొకరిని తెర మీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతుండడంతో సొంత గూటిలోని అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి.

కాకినాడ మేయర్‌ అభిశంసనపై వివరణ ఇవ్వండి

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ కార్పొరేషన్‌ మేయర్‌ సుంకర పావని అభిశంసన విషయంలో కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈనెల 25న కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. అవిశ్వాస తీర్మానం ఫలితం తామిచ్చే తీర్పునకు లోబడి ఉంటుందని ఆదేశించినా.. ఫలితం వివరాలను ప్రభుత్వానికి అందజేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు అనుబంధ పిటిషన్‌ వేస్తామని చెప్పి ఆ ప్రక్రియ పూర్తికాక ముందే అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని ప్రభు త్వానికి ఎలా పంపిస్తారని నిలదీసింది. విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేష్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు. తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ మేయర్‌ పావని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం అవిశ్వాస ఫలితం తామిచ్చే తుది తీర్పుకి లోబడి ఉంటుందని స్పష్టంచేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కానీ అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపించడంతో మేయర్‌ పదవి నుంచి పావనిని తొల గిస్తూ సర్కారు జీవోతోపాటు గెజిట్‌ జారీచేసింది. వాటిని సవాల్‌ చేస్తూ పావని మరో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ.. ‘ఈ వ్యవహారంలో కౌంటర్‌తోపాటు స్టేవెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన తరువాతే అవిశ్వాస తీర్మాన ఫలితం ప్రకటిస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. అందుకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం సమావేశం మీటింగ్‌ మినిట్స్‌ను కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపించారు. వాటి ఆధారంగా ప్రభుత్వం తొలగింపు జీవో జారీచేసింది. నివేదికలో అవిశ్వాస తీర్మానంపై రిమా ర్కులు నమోదు చేయాల్సిన బాధ్యతను కలెక్టర్‌ నెరవేర్చలేద’ని వివరించారు. చట్ట నిబంధ నల మేరకే కలెక్టర్‌ వ్యవహరించారని ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు.

Updated Date - 2021-10-23T05:51:24+05:30 IST