న్యాయం ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2021-04-03T07:35:00+05:30 IST

‘‘నా పేరు డాక్టర్‌ సునీత. మా నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి. ఆయనను దారుణంగా హత్య చేసి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటిదాకా న్యాయం జరగలేదు.

న్యాయం ఇంకెప్పుడు?

  నాన్నను చంపి రెండేళ్లైంది...

వైఎస్‌ వివేకా కుమార్తె సునీత ఆక్రోశం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘‘నా పేరు డాక్టర్‌ సునీత. మా నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి. ఆయనను దారుణంగా హత్య చేసి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నేను ఎక్కని గుమ్మంలేదు. తట్టని తలుపు లేదు. ఏం చేస్తే న్యాయం జరుగుతుందో కూడా తెలియడంలేదు’’... రెండేళ్ల కిందట దారుణ హత్యకు గురైన వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత ఆవేదన, ఆక్రోశం ఇది! న్యాయం కోసం పోరాడుతున్న ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు.


శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరుపై విచారం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాల వల్లే (పొలిటికల్‌ మర్డర్‌) తన తండ్రి హత్య జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దోషులను పట్టుకోలేకపోయారన్నారు. తాను హైకోర్టుకు ఇచ్చిన పిటిషన్‌లో అనుమానితుల పేర్లు కూడా ప్రస్తావించానంటూ.. ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి సహా పలువురి పేర్లను ఆమె చదివి వినిపించారు. అనుమానితుల్లో తమ బంధువులూ ఉన్నారని చెప్పారు.


‘‘మా నాన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు చిన్నాన్న. ఆయన సమితి ప్రెసిడెంట్‌ నుంచి మంత్రి వరకు అనేక పదవులు నిర్వహించారు. మా నాన్న కేసులోనే ఇదీ పరిస్థితి! ఇక సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది?’’ అని ప్రశ్నించారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే...



రెండేళ్ల సమయం తక్కువ కాదు..

‘‘మా నాన్న వాళ్లు నలుగురు సోదరులు, ఒక సోదరి. వారిలో ఒకరు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి. మాది పెద్ద కుటుంబం. మా నాన్న ప్రజల సేవలోనే ఎక్కువ సమయం గడిపారు. ఆయన సౌమ్యుడని అందరూ అంగీకరిస్తారు. అలాంటి మా నాన్నను చంపేశారు. ఈ హత్య జరిగి రెండేళ్లు దాటింది. రెండేళ్ల కాలం తక్కువ సమయం కాదు. అయినప్పటికీ... మా నాన్నను  ఎవరు చంపారో ఇంకా గుర్తించలేదు. సెలవుల్లో నేను పులివెందులకు వెళ్లేదానిని. ఫ్యాక్షన్‌ నేపథ్యంతో జరిగే హత్యల గురించి వింటూ పెరిగాను.


కానీ... ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆర్థిక పరిస్థితితోపాటు ప్రజలూ మారిపోయారు. హింసను పక్కన పెట్టారు. మా తండ్రి హత్య విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందామని ఒక సీనియర్‌ అధికారితో మాట్లాడితే... ‘కర్నూలు, కడపలో ఇలాంటి హత్యలు మామూలే కదా!’ అని తేలిగ్గా మాట్లాడారు. ఇది విని నాకు చాలా బాధ కలిగింది. కోపం కూడా వచ్చింది. 



బెదిరింపులూ వచ్చాయి!

పిల్లలు ఒక తప్పు చేస్తే... మళ్లీ అదే తప్పు చేయకుండా దండిస్తాం. అలాగే... హంతకులను శిక్షించకపోతే మళ్లీ హత్యలు చేస్తూ పోతారు. ‘హంతకులను స్వేచ్ఛగా వదిలేస్తే, వారు హాయిగా తిరుగుతుంటే... బాధితులు రోధిస్తారు’ అనేది ఒక న్యాయ సూత్రం. ఈ పోరాటం మొదలుపెట్టిన నాకు బెదిరింపులు వచ్చాయి. నాకు బాగా తెలిసిన వాళ్లు ఈ విషయంలో నాకు జాగ్రత్తలు చెప్పారు. ‘‘పోయిన వాళ్లు ఎలాగూ పోయారు! ఇంతటితో వదిలెయ్‌. లేదంటే దాని ప్రభావం మీ పిల్లలపై పడుతుంది’’ అని సున్నితంగా హెచ్చరించారు.


అయితే... నా స్వార్థం చూసుకుని నేనే మౌనంగా ఉంటే... సాక్షుల పరిస్థితి ఏమిటి? అందుకే... పోరాడాలనే నిర్ణయించుకున్నాను. ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నాను. న్యాయం కోసం ఇంకా ఎన్నాళ్లు వేచి చూడాలి? శ్రీనివాసరెడ్డి అనే సాక్షి/అనుమానితుడు సందేహాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. అతనిది ఆత్మహత్య అని మొదట చెప్పారు. కానీ... పోస్టుమార్టం రిపోర్ట్‌ చూస్తే హత్య అని నాకు అనిపిస్తోంది. ఇంకా ఎంత మంది సాక్షులకు హాని జరుగుతుందో అనే భయం కలుగుతోంది. ఇప్పుడు పులివెందులలో  వైఎస్‌ వివేకానంద రెడ్డి గురించి బహిరంగంగా మాట్లాడేందుకు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో... సాక్ష్యం చెప్పేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అనే సందేహం కలుగుతోంది. ఇలాంటివి సంఘటనలు మళ్లీ  జరగకుండా మాకు త్వరగా న్యాయం చేయాలి.




మా వాళ్లే అధికారంలో ఉన్నా..


మా వాళ్ల ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ దోషులు దొరకలేదు. ఈ కేసు విషయంలో నాకు జగన్‌ సహకారం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరారు. సీఎం అయ్యాక ఆ అవసరం లేదంటూ వదిలేశారు. సిట్‌ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం విచారణ జపింది. అయినా... దోషులను పట్టుకోలేకపోయింది. నేను హైకోర్టులో పిటిషన్‌ వేశాకే కేసు సీబీఐకి వెళ్లింది. సొంత ఇంట్లోనే మా నాన్న హత్య జరిగింది. ఇది ఎవరు చేయగలరు? నాకు సమాధానం కావాలి. సీబీఐ ఏమీ చేయడం లేదని చెప్పను. సాక్షులు ముందుకు రావడానికి భయపడతారనేదే నా ఆందోళన. ఇప్పటిదాకా ఏవైనా సాక్ష్యాలు సేకరించారో లేదో సీబీఐకి తెలియాలి. రెండేళ్లలో ఒక్క అరెస్టూ జరగలేదు. అందుకే, అనుమానం కలుగుతోంది.




బాబు, పవన్‌లతో మాట్లాడలేదు..

పవన్‌, చంద్రబాబులతో మాట్లాడలేదు. లోకల్‌ బీజేపీ నేతలతో మాట్లాడాను. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో మాట్లాడాను. ‘పొలిటికల్‌ ఫైట్‌’ జరగడం నా ఉద్దేశం కాదు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు.  మా కుటుంబం నుంచి ఆశించిన సపోర్ట్‌ లేదు. కానీ, కొందరు వెరీ వెరీ స్ట్రాంగ్‌ పీపుల్‌ నాకు మద్దతు ఇస్తున్నారు. నాన్న హత్య విషయంలో తప్పు జరుగుతోందని షర్మిలకు తెలుసు. నిజయం బయటికి రావాలనే అభిప్రాయంతో ఉన్నారు. 


Updated Date - 2021-04-03T07:35:00+05:30 IST