ఆధునిక పరికరాలు అందేదెప్పుడు?

ABN , First Publish Date - 2020-08-05T10:37:24+05:30 IST

ఆధునిక వ్యవసాయం అన్నదాతకు అందని ద్రాక్షే అవుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి..

ఆధునిక పరికరాలు  అందేదెప్పుడు?

 కరోనా ప్రభావంతో కానరాని లబ్ధిదారుల ఎంపిక

నిరాశ చెందుతున్న రైతులు 


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): ఆధునిక వ్యవసాయం అన్నదాతకు అందని ద్రాక్షే అవుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి.. మరోపక్క నిధుల లేమితో ఈ ఏడాది నిరుపేద రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందడం లేదు. ఫలితంగా పాత విధానంలోనే సాగుకు ఉపక్రమిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కరోనా కష్ట కాలంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే పరికరాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఏటా మార్చి నెలాఖరు నాటికి అధికారులు ప్రభుత్వ రాయితీపై రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ పూర్తిచేసేవారు. ముందుగానే సర్వే చేసి.. లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా.. ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. లాక్‌డౌన్‌తో అధికారులు దీని ఊసే మరచిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


కరోనా విజృంభణ.. నిధుల లేమి

కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు ఆధునిక సాగు పరికరాలు రాయితీపై అందజేస్తోంది. ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు, వరి నాట్లు వేసే యంత్రాలు, కోత యంత్రాలు, పవర్‌ వీడర్స్‌, వరి నూర్పిడి యంత్రాలు, పంటల స్ర్పేయింగ్‌ వంటి సుమారు వంద రకాల ఆధునిక పరికరాలను రాయితీపై పంపిణీ చేసేది. యూనిట్‌ ధరలో 50 శాతం రుణం, 40 శాతం రాయితీ, 10 శాతం లబ్ధిదారుని వాటా చెల్లించాలి. సాగు పరికరాలపై రుణం తీసుకున్న రైతులకు కేవలం 7 శాతం మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 820 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు సంఘాలకు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందజేయాలనే ప్రతిపాదన చేశారు.


ప్రతి యూనిట్‌ ధర రూ.10 లక్షల నుంచి, రూ.15 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్రముఖ కంపెనీలతో వ్యవసాయ పరికరాల పంపిణీకి ఒప్పందం చేసుకున్నారు. కానీ కరోనా మహమ్మారి విజృంభించడం, కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు అందలేదు. కరోనా దెబ్బకు పలు చోట్ల వ్యవసాయ శాఖ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. రైతు భరోసా కేంద్రాల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఇప్పటికీ ఆధునిక సాగు పరికరాల పంపిణీ కోసం గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. తాజాగా అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇక లబ్ధిదారులను ఎప్పుడు ఎంపిక చేస్తారో? పరికరాలు ఎప్పటికి అందజేస్తారో వేచిచూడాలి. 


వచ్చే నెలాఖరుకి..  కె.శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ, శ్రీకాకుళం

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా.. ఆధునిక వ్యవసాయ పరికరాల పంపిణీ ప్రక్రియ జాప్యమైంది. సెప్టెంబరు నెలాఖరు నాటికి అర్హులందరికీ పరికరాలు పంపిణీ చేస్తాం. పంటల ఆధారంగా ఐదుగురు తక్కువ కాకుండా రైతు సంఘాలు ఉంటే, రైతు భరోసా కేంద్రాలలో రాయితీ వ్యవసాయ పరికరాల పంపిణీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈనెల 15 వరకు దరఖాస్తులు అందజేయవచ్చు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలలో వ్యవసాయ పరికరాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి, పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఏవైనా సందేహాలు ఉంటే.. రైతు భరోసా కేంద్రాల్లో నివృత్తి చేసుకోవచ్చు. 

Updated Date - 2020-08-05T10:37:24+05:30 IST