హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రేపే.. నిజమెంత?
ABN , First Publish Date - 2021-09-16T05:14:05+05:30 IST
కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్‌లో..
ఉప ఎన్నిక ఎప్పుడు?
రేపే నోటిఫికేషన్ అని పుకార్లు
హుజూరాబాద్‌లో జోరుగా ప్రచారం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్): కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ఎప్పుడు జరిగేది ఇంకా తేల్చకున్నా టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాలు మాత్రం రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు మరికొందరు మంత్రులు కాలికి బట్ట కట్టకుండా ఒక్కరోజు కూడా విరామమివ్వకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా నిద్రాహారాలు మాని ఆ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో కలిసి అధికార పార్టీకి ధీటుగా గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తే ఖర్చుకు తట్టుకోలేమనో, అభ్యర్థిగా ఎవరిని నిలపాలో తేల్చుకోలేకనో గాని కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్ ఉప ఎన్నిక ప్రకటన చేసిన సందర్భంలో దేశంలోని ఇతర రాష్ర్టాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలను కొవిడ్ కారణంగా జరపలేకపోతున్నామని, ఆ తర్వాత ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగేది ప్రకటిస్తామని పేర్కొన్నది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక నవంబర్ వరకు జరిగే అవకాశం లేదని తేలిపోయింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రకటనను సరిగ్గా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన రోజే చేయడంతో రాష్ట్రంలో పలు రకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. టీఆర్‌ఎస్, బీజేపీ గల్లీలో కుస్తీపడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో, టీఆర్‌ఎస్‌కు కేంద్రంలో ఉన్న బీజేపీతో అవసరాలు ఉన్న కారణంగానే లాలూచీ పడుతున్నాయని విమర్శలు వచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంలో బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటే అనే ప్రచారం జరిగేలా వ్యవహరిస్తారని వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్లే అదే అంశంపైకి తెరపైకి వచ్చినా ప్రజలు మాత్రం రెండు ఒక్కటే అనే భావనకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
అమిత్‌షాతో భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం
హుజూరాబాద్ ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జితేందర్‌రెడ్డి, వివేక్, ఈటల రాజేందర్, ఇతర బీజేపీ నేతలు ఈ పరిణామాలను జీర్ణించుకోలేక పోతున్నారని, జితేందర్ రెడ్డి, వివేక్ తమకున్న సంబంధాలతో బీజేపీ అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చేలా చూడాలని మాట్లాడినట్లు ప్రచారం జరుగుతున్నది. శుక్రవారంనాడు ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నదని బీజేపీలో, టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాని పక్షంలో 17న నిర్మల్‌లో జరిగే తెలంగాణ విమోచన సభకు హాజరవుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో రాష్ట్ర బీజేపీ నేతలు భేటీఅయి ఈ విషయం ప్రస్తావిస్తారని అంటున్నారు.
రాష్ట్ర నాయకులతో అమిత్‌షా భేటీఅయి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించే అవకాశం ఉన్నదని, దానిలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన కూడా వస్తుందని చెబుతున్నారు. అమిత్‌షా స్పందనను బట్టే ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. శుక్రవారం కాని, అమిత్‌షా వచ్చిన వెళ్లిన తర్వాత శుక్రవారం గాని ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకపోతే అది జరిగేది నవంబర్‌లోనేనని అనుకుంటున్నారు.
థర్డ్ వేవ్ మొదలైతే..
ఒకవేళ అప్పటి వరకు కరోనా థర్డ్ వేవ్ మొదలైతే ఇప్పుడిప్పుడే ఎన్నిక జరగకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఈ వ్యవహారమేదో తేలేదాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న టెంపోను కొనసాగిస్తూ ప్రచారం నిర్వహించాల్సిందేనని అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ భావిస్తున్నాయి. అందుకే ఇరు పార్టీలు పోటాపోటీగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో 2లక్షల 26 వేల పైచిలుకు ఓటర్లు ఉండగా ఏదో ఒక రూపంలో వారందరిని ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నాలనే ఇరు పార్టీలు కొనసాగిస్తున్నాయి. టీఆర్‌ఎస్ వివిధ కుల సంఘాలు, వృత్తి, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, ట్రేడ్ యూనియన్ల సమావేశాలను నిర్వహిస్తోంది.
ప్రతి ఓటరును ఏదో ఒక కార్యక్రమంలో హాజరయ్యేలా చూసుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులు ఈటల రాజేందర్‌పై విమర్శలు తీవ్రం చేస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ సెంటిమెంట్‌ను రగిలిస్తూ కేసీఆర్ పాలనాతీరును దుయ్యబడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. వారం రోజుల్లోగా ఉప ఎన్నిక జరిగే తేదీ విషయంలో స్పష్టత రాకపోతే ఇరు పార్టీల ప్రచారాలు మందగించే అవకాశం లేకపోలేదని అనుకుంటున్నారు.