వైద్యం.. దైన్యం!

ABN , First Publish Date - 2021-09-13T04:27:35+05:30 IST

వైద్యం.. దైన్యం!

వైద్యం.. దైన్యం!
రేగిడి మండలం బూరాడ పిహెచ్‌సిలో 24 గంటలు వైద్యసేవలు అందని దుస్దితి

- పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు ఎక్కడ?

- సాయంత్రం 5గంటలకే మూతపడుతున్న కేంద్రాలు

- కనిపించని వైద్యులు, సిబ్బంది

- గ్రామీణ రోగులకు ఇబ్బందులు 

- పట్టించుకోని అధికారులు 

(రాజాం)

‘ప్రభుత్వాస్పత్రుల్లో వసతులు మెరుగుపరిచాం. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాం. 24 గంటలు వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాం.’.. ఇదీ ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు తరచూ చేసే ప్రకటనలు. కానీ, క్షేత్రస్థాయిలో బాధితులకు వైద్యసేవలు అందడం లేదు. పీహెచ్‌సీలో మెరుగైన వైద్యసేవలు ప్రకటనలకే పరిమి త మవుతున్నాయి. సాయంత్రం ఐదు గంటలకే పీహెచ్‌సీలకు తాళాలు పడుతున్నాయి. జిల్లాలో 80 పీహెచ్‌సీల్లో 53 కేంద్రాల్లో 24 గంటలూ వైద్యసేవలు అందజేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, చాలా ఆస్పత్రులు కనీసం 12 గంటలు కూడా సేవలు అందజేయడం లేదు. సాయంత్రం ఐదు గంటల తర్వాత తాళాలు వేసేయడంతో అత్యవసర వైద్యం కోసం వచ్చే బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుండడంతో సరైన వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల రేగిడి మండలం బూరాడ పీహెచ్‌సీకి అత్యవసర వైద్యం కోసం ఓ బాధితుడుని  కుటుంబ సభ్యులు సాయంత్రం పూట తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఎవరూ లేకపోవడంతో రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలిం చారు. అక్కడి వైద్యులు వెంటనే అప్రమత్తమై చికిత్స చేయడంతో.. ప్రాణపాయం నుంచి బాధితుడు బయటపడ్డాడు. జిల్లాలో దాదాపు అన్ని పీహెచ్‌సీల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. నైట్‌వాచ్‌మెన్లు సైతం కనిపించడం లేదు. ఏజెన్సీలోని 30 పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా ఉంది. మధ్యాహ్నానికి కొంత మంది వైద్యులు, సిబ్బంది ఇంటి ముఖం పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు వైద్యసేవలు స క్రమంగా అందడడం లేదని వాపోతున్నారు.


- సుదూరం నుంచి రాకపోకలు 

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్థానికంగా నివాసం ఉండాలనే ప్రభుత్వ నిబంధన జిల్లాలో అమలుకావడం లేదు. చాలామంది సుదూర ప్రాంతాల్లోని పట్టణాలు, మండల కేంద్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సబ్‌ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి పీహెచ్‌లకు వెళ్లి అక్కడ నుంచి వ్యాధి నిరోధక టీకాలు, సామగ్రిని సబ్‌ సెంటర్లకు తీసుకెళ్లేటప్పటికి మధ్యాహ్నం 12 దాటుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఎక్కువ మంది డిప్యుటేషన్లపై గడుపుతున్నారు. చాలామంది జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో విధులు వేయించుకుంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో కీలక పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఫలితంగా సేవలు గగనమవుతున్నాయి. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పీహెచ్‌సీలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. 


వసతులు మెరుగుపరుస్తాం

పీహెచ్‌సీల్లో వసతులు మెరుగుపరుస్తున్నాం. 24 గంటల పాటు వైద్యసేవలు అందేలా చర్యలు చేపడుతున్నాం. నిబంధనలు, సమయపాలన పాటించని వైద్య ఆరోగ్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. పీహెచ్‌సీల్లో అత్యవసర సేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చాం. జిల్లాలో 83 పీహెచ్‌సీలకు గాను ప్రస్తుతం 53 కేంద్రాల్లో 24 గంటలు వైద్యసేవలు అందించాలని నిర్ణయించాం. ప్రజలు వైద్యసేవలను వినియోగించుకోవాలి.

- చంద్రానాయక్‌, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

 

Updated Date - 2021-09-13T04:27:35+05:30 IST