కనిపించని ‘కేర్‌’

ABN , First Publish Date - 2021-05-04T06:38:34+05:30 IST

‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’ అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చేయిదాటిపోతున్న దశలో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకి నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా జిల్లాలో 13 చోట్ల కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఆదివారం నుంచి ప్రారంభించారు. పలుప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ లేక ప్రైవేటు భవనాల్లో వీటిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేంద్రాల్లో పెద్దగా కరోనా బాధితులు చేరలేదు.

కనిపించని ‘కేర్‌’
కేర్‌ సెంటర్‌లో అప్పటికప్పుడు సిద్ధం చేస్తున్న బెడ్లు

హడావుడిగా కొవిడ్‌కేర్‌ సెంటర్ల ఏర్పాటు

నేతల నుంచి నిన్నటి చేయూత కరువు

వారిలోనూ పెరిగిన కరోనా భయం 

వెంటాడుతున్న నిధుల కొరత

ప్రభుత్వం నుంచి పరిమితంగానే విడుదల

సౌకర్యాల కల్పనకు యంత్రాంగం పాట్లు 

అవస్థలు పడుతున్న బాధితులు 

ఎన్నికలు లేవుగా అంటున్న సామాన్యులు 

ఆంధ్రజ్యోతి, ఒంగోలు


కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్లు అలంకార ప్రాయమయ్యాయి. వాటి నిర్వహణ కూడా తూతూమంత్రంగా కనిపిస్తోంది. తొలిదశలో ప్రజాప్రతినిధుల నుంచి లభించిన చేయూత సెకండ్‌వేవ్‌లో కరువైంది. దీంతో కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లోనే ఉండి ఇబ్బందులు పడటమో, అప్పోసప్పో చేసి లక్షలకు లక్షలు కుమ్మరించి కార్పొరేట్‌ వైద్యశాలల్లో చికిత్స పొందటమో చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని వారు వైరస్‌ ముదిరి వైద్యశాలలో పడకలు కూడా దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ముందుగానే ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలు కల్పించి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేదన్న భావన వ్యక్తమవుతోంది. అంతేగాక ఈ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం నామమాత్రంగానే నిధులు విడుల చేస్తుండగా గతంలో మాదిరి ప్రజాప్రతినిధులు, దాతల నుంచి చేయూత కరువైంది.  బాధితులను ఆదుకునేందుకు తొలి విడత కేసులు వచ్చిన సమయంలో వారు చూపిన ఉత్సాహం, ఇచ్చిన ప్రోత్సాహం ఇప్పుడు కనిపించటం లేదు. దీంతో ప్రజలు కూడా ‘అవునులే స్థానిక ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడేం ఎన్నికలు లేవు. వాళ్లెందుకు వస్తారులే!’ అని వ్యాఖ్యానిస్తున్నారు. 



‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’ అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చేయిదాటిపోతున్న దశలో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకి నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా జిల్లాలో 13 చోట్ల కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఆదివారం నుంచి ప్రారంభించారు. పలుప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ లేక ప్రైవేటు భవనాల్లో వీటిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేంద్రాల్లో పెద్దగా కరోనా బాధితులు చేరలేదు. అలాగని బాధితులు లేరా అంటే భారీగానే ఉన్నారు. రాష్ట్రమంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం పంచాయతీలో సోమవారం సుమారు వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్‌ అని తేలింది. వారందరినీ అక్కడే ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కి వెళ్లాలని సూచించినా బాధితులు ఆ వైపు   చూడలేదు. ఆ నియోజకవర్గంలో మొత్తంగా ఇప్పటికే వందల మంది కరోనా బారిన పడినా కేర్‌ సెంటర్‌లో కేవలం నలుగురే ఉన్నారు. అలాగని అందరూ హోం ఐసోలేషన్‌  కే పరిమితం కాలేదు. ఇటు జిల్లాలోనూ అటు గుంటూరు, అడపాదడపా విజయవాడ, ఇతర నగరాల్లో ప్రైవేటు వైద్యశాలలు, ప్రత్యేకించి కార్పొరేట్‌ ఆసుపత్రులకు చాలామంది బాధితులు పరుగు తీశారు. ఇదే పరిస్థితి జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. అదేసమయంలో ఒంగోలు రిమ్స్‌కు కూడా బాధితుల తాకిడి పెరిగింది. వందల సంఖ్యలో బాధితులు పడకల కోసం పడిగాపులు కాస్తున్నారు.  కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణ కు అవసరమైన ప్రోత్సాహం లేకపోవటమే ఇందుకు కారణ ంగా తెలుస్తోంది.  కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణ , తోడ్పాటు విషయంలో  మొదటి దశకు, ప్రస్తుతం రెండో వేవ్‌కి ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిస్తే వాటి నిర్వహణపై ప్రజాప్రతినిధుల ఆసక్తి తగ్గినట్లు అర్థమవుతుంది. 

కేంద్రాల నిర్వహణకు నిధుల కొరత 

గతంలో ఎవరైనా కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతూ ఫోన్‌ చేస్తే వారు ఉండే ప్రాంతానికి ప్రభుత్వ అంబులెన్స్‌ లేక, 108 వాహనం వెళ్లేది. వారిని నేరుగా ఆయా ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తీసుకొచ్చేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆపని చేయటం లేదు. ఇంకోవైపు అప్పట్లో  కేర్‌ సెంటర్ల నిర్వహణ పుష్కలంగా నిధులు మంజూరు చేసింది. ఈ పర్యాయం ఆవిషయంలోనూ పరిమితి విధించింది. కొవిడ్‌ నివారణ  చర్యలకు ఈ పర్యాయం గతంకన్నా తక్కువగానే మంజూరు చేసినట్లు తెలుస్తోంది. మన జిల్లాకు   తొలి విడతగా రూ.93 లక్షలే ఇచ్చినట్లు సమాచారం. అటు కేర్‌ సెంటర్ల ఏర్పాటుకి చివరి క్షణంలో నిర్ణయం తీసుకోవటం, ఇటు నిధుల కొరత లాంటి కారణాలు సమస్యలుగా మారిపోయాయి. 

నాటి ప్రోత్సాహం నేడు కరువు  

గతంలో కరోనా నివారణ చర్యలకు ప్రత్యేకించి కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. శానిటైజర్లు, మాస్క్‌ల పంపిణీ మొదలు ఉచితంగా మందుల పంపిణీ, ఆహార పదార్థాల సరఫరా విషయంలో పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా భారీగా విరాళాలు సమీకరించి ఇచ్చారు. అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్‌ కృష్ణచైతన్య ముఖ్యమంత్రిని కలిసి తొలుత కోటి రూపాయలు విరాళం ఇవ్వగా, ఆ తర్వాత జిల్లాలోని సగం మంది ప్రజా ప్రతినిధులు పోటీలుపడి నిధులు సమకూర్చుకుని వెళ్లి ముఖ్యమంత్రికి అందజేశారు. ఆ విషయాన్ని అలా ఉంచితే కిందిస్థాయిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణకు పూర్తిస్థాయి చేయూతనిచ్చారు. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో బాధితులకు మంచి ఆహారాన్ని అందించటం, అవసరమైతే పడకలు ఏర్పాటు చేయటం, అడపాదడపా ఆక్సిజన్‌ కొనుగోలుకి కూడా నిధులు ఇవ్వటం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. 

అరకొర సమీక్షలకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరిమితం

జిల్లాలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే స్థానికంగా కనిపిస్తున్నారు. వారిలో ఒకరిద్దరైతే నిరంతరం పర్యవేక్షణ  కూడా చేస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ కనిపిస్తున్నారు. ఒకరిద్దరైతే ఉపన్యాసాలు, తూతూమంత్ర కార్యక్రమాలకే పరిమితమయ్యారు. మంత్రులలో బాలినేని శ్రీనివాస రెడ్డి రెండుసార్లు జిల్లాకు వచ్చి కరోనా అంశంపై సమీక్ష చేసి అధికారులను అప్రమత్తం చేసి వెళ్లిపోయారు. పది, ఇంటర్‌ పరీక్షల బిజీ కాబోలు మరోమంత్రి ఆదిమూలపు సురేష్‌ అయితే ఇంతవరకూ జిల్లాకే రాలేదు. బెంగళూరు లాంటి సిటీలలో నివాసం ఉండే ఎమ్మెల్యేలైతే ఒకట్రెండు సార్లు వచ్చి అధికారులతో సమీక్షలు చేసి వెళ్లిపోయారు.  తెలుగుదేశంకు చెందిన అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు కరోనాకు గురయ్యారు. మార్కాపురం, కందుకూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఒకటి రెండుసార్లు చీరాల ఎమ్మెల్యే కూడా నియోజకవర్గానికి వెళ్లి వచ్చారు. అంతకు మినహా ప్రభుత్వ సహకారం ఎలా ఉంది తామేమి చేయాలి, గతంలో మాదిరి కేర్‌ సెంటర్‌లలో బాధితులకు చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచన చేసే వారు కరువయ్యారు. వారికీ కరోనా భయం ఉండవచ్చు, కానీ అవసరమైన జాగ్రత్తల్లో ప్రజలకు అందుబాటులో ఉండి కేర్‌ సెంటర్లను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తద్వారా ఆసుపత్రుల్లో పడకల సమస్యను కొంత వరకు అధిగమించవచ్చు. అయినా ఆ వైపు నేతలు దృష్టిసారించకపోవటంతో ప్రజల్లో అపోహలు పెరిగిపోయాయి. 

ఎన్నికలు లేవుగా అంటున్న ప్రజలు 

స్థానిక ఎన్నికలు కూడా ముగిశాయి, ఇక ఎన్నికలు లేవని నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. కరోనా తొలి దశ సమయంలో ఎన్నికల ప్రకటన  చేసి ఉన్నందునే హడావుడి చేశారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా కొవిడ్‌ కేర్‌ సెంటర్ల నిర్వహణపై నేతలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో బాధితులకు వైద్య చికిత్సతోపాటు, అవసరమైన ఆహారం అందించడం వంటి సహాయక చర్యలు చేపట్టి బాధితులకు మేమున్నామని ధైర్యాన్నిస్తే అది వారికి ఎంతో ఉపశమనం కల్గిస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతోంది.


Updated Date - 2021-05-04T06:38:34+05:30 IST