ఇదెక్కడి నీతి

ABN , First Publish Date - 2021-04-29T06:35:50+05:30 IST

జిల్లాలో ప్రభుత్వపరంగా కొవిడ్‌ చికిత్సకు ఒంగోలులోని రిమ్స్‌న ప్రధాన కేంద్రంగా మార్చేశారు. మిగిలిన ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ వైద్యశాలలను కూడా కరోనాకు కేటాయించారు.

ఇదెక్కడి నీతి
ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

ప్రభుత్వ, పలుకుబడి ఉన్న  ప్రైవేటు వైద్యశాలల్లో ఏమి జరిగినా ఓకేనా? 

చిన్నస్థాయి ఆసుపత్రులపై తనిఖీల పేరుతో వేధింపులు 

రిమ్స్‌లో రెమ్‌డిసివిర్‌ అమ్ముకున్న ఉద్యోగిపై చర్యలు శూన్యం 

అక్కడ పడకల నుంచి అన్నీ విక్రయం 

కానీ విజిలెన్స్‌ అధికారులు  ఆవైపు చూడనే చూడరు 

ప్రైవేటు దోపిడీ కట్టడిలోనూ వివక్ష 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో ప్రభుత్వపరంగా కొవిడ్‌ చికిత్సకు ఒంగోలులోని రిమ్స్‌న ప్రధాన కేంద్రంగా మార్చేశారు. మిగిలిన ముఖ్యమైన ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ వైద్యశాలలను కూడా కరోనాకు కేటాయించారు. ఇవికాకుండా ఆయా ప్రాంతాల్లో రమారమి 15 వరకూ ప్రైవేటు వైద్యశాలలకు కొవిడ్‌ చికిత్స చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఇక అనధికారికంగా కిందిస్థాయిలో ఆర్‌ఎంపీ డాక్టరు నుంచి ఆయుర్వేద వైద్యుల వరకూ చాలామంది కరోనా చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న బాధితులు ఎక్కడ పడక దొరికితే అక్కడి వైద్యశాల యాజమాన్యం ఎంతచెబితే అంత డబ్బుని డిపాజిట్‌గా చెల్లించి చేరిపోతున్నారు. ఆ తర్వాత రెమ్‌డిసివిర్‌ లాంటి ఇంజక్షన్‌ కోసం బ్లాకులో భారీగా డబ్బు చెల్లిస్తున్నారు. ఇదంతా ఒక తంతు అయితే మరోవైపు ప్రభుత్వ వైద్యశాలల్లోనూ అటు ప్రైవేటు వాటిలో పేరున్న  ఆసుపత్రులు, మరీ ముఖ్యంగా కార్పొరేట్‌ వైద్యశాలల్లో ఇన్‌పేషెంట్లుగా చేరేందుకు అవకాశం లభించటమే గగనమైంది. అక్కడ పలుకుబడి, అంతకుమించి పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించటానికి వెనకాడని వారికే అవకాశం లభిస్తోంది. ఈ పరిస్థితిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగాన్ని సమన్వయంతో ముందుకు నడిపి రోగులకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఆవైపు చర్యలు కరువయ్యాయి.


అసలు దోపిడీని వదిలేసి.. 

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గత రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ చికిత్స చేస్తున్న వైద్యశాలల్లో తనిఖీలు ప్రారంభించారు.  కొన్నింటినే లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేశారు. మరికొన్నింటిని హెచ్చరించి వదిలేశారు. రాష్ట్రస్థాయిలో కొన్ని వైద్యశాలల మీద వివిధ లోపాల ను ఎత్తిచూపి బుధవారం కేసులు కూడా నమోదు చేశారు. జిల్లా విషయానికొస్తే ఒంగోలులోని నల్లూరి నర్సింగ్‌హోం, ప్రకాశం సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల ల మీద మాత్రమే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌ అక్రమంగా వినియోగించారన్న ఒకే ఒక్క కారణంతో ప్రకాశం సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. నల్లూరి నర్శింగ్‌ హోమ్‌ నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతవరకు వారి తనిఖీలు నిజమే కావచ్చు. కానీ వీటి నిర్వహణలో నిజాయితీ ఉందా అనేదే ఇక్కడ ప్రశ్నార్థకం. 


రిమ్స్‌లో అక్రమాలు అన్నీ ఇన్నీ కావు 

వాస్తవికతను పరిశీలిస్తే ఒంగోలులోని ప్రభుత్వ వైద్యశాల రిమ్స్‌లో జరుగుతున్న దోపిడీ అంతాఇంతా కాదు. ప్రభుత్వం రిమ్స్‌లో చేరిన రోగుల చికిత్స కోసం ఉచితంగా వినియోగించేందుకు సరిపడా రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లను సరఫరా చేసింది. ఒకటి అరా తప్ప ఇతరత్రా మందులు కూడా ఇక్కడ పుష్కలంగానే ఉన్నాయి. ఇక పడకల ఏర్పాటుకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సాధారణ  పడకలు, ఆక్సిజన్‌ సౌకర్యంతో పడకలు, ఐసీయూ పడకలు కూడా ఎంతవరకు విస్తరించుకోవాలన్నా సదుపాయాలకు కొదువ లేదు. అయితే ఆ దిశగా ప్రయత్నం జరగటం లేదు. ఇక కరోనా భయాందోళనను ఆసరా చేసుకుని రిమ్స్‌లో భారీ ఎత్తున దోపిడీ జరుగుతోంది. రిమ్స్‌లో చేరితే మెరుగైన వైద్యం అందుతుందని, రెమ్‌డిసివిర్‌ లాంటి ఇంజక్షన్లు దొరుకుతాయన్న ఆలోచనతో ప్రాణం అరచేతిలో పెట్టుకుని రిమ్స్‌కి వస్తున్న బాధితుల ఆందోళనను ఇక్కడ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. రిమ్స్‌లో పడక ఇవ్వాలంటేనే రూ.5వేలు వసూలు చేయటంతో అవినీతి ప్రారంభమై ప్రాణం పోతే మృతదేహం దహనక్రియల ప్రక్రియ పూర్తయ్యేవరకు అవినీతి తాండవిస్తోంది. ప్రజలు ఏ ఆకాంక్షతో అయితే ఇక్కడకు వస్తున్నారో ఆ రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు కూడా సరిగా వాడుతున్న దాఖలాలు లేవు. మరోపక్క రిమ్స్‌లో రెమ్‌డిసివిర్లు లేవన్న సిబ్బంది ద్వారానే బహిరంగ మార్కెట్లో అనేకమంది ఆ ఇంజక్షన్లు కొనుగోలు చేసిన ఘటనలు కోకొల్లలు. ఆ ఇంజక్షన్‌ని అమ్ముకోవటం ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. రెమ్‌డిసివిర్‌లు పక్కదారి పట్టడానికి ఓ నర్సు కారణమని తేల్చారు కానీ అతనిపైనా చర్యలు లేవు. ఇక్కడ నిబద్ధత, అంకితభావం కలిగిన పరిపాలనా అధికారులు ఉన్నా, క్రమశిక్షణ  కలిగిన వైద్యులు ఎంతమంది ఉన్నా అవినీతి మాత్రం ఆగటం లేదు. 


కార్పొరేట్‌ వసూళ్లు కనపడలేదా?

దోపిడీకి నిలయాలుగా మారిన కార్పొరేట్‌ హాస్పిట ల్స్‌లో సామాన్య ప్రజలకు ప్రవేశం గగనమైంది. వారు అడిగినంత చెల్లించటానికి సిద్ధపడి న వారిలో సిఫార్సు చేయించగలిగిన వారికే ఇక్కడ బెడ్లు లభ్యమవుతు న్నాయి. ఇటీవల ఒక సాధారణ  జర్నలిస్టుకి ఓ కార్పొరేట్‌ వైద్యశాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తే సాధ్యం కాకపోగా ఆ తర్వాత కొద్దిక్షణాలకే మంత్రి సిఫార్సు చేస్తే బెడ్‌ సిద్ధం కావటం విశేషం. ఈ కరోనా కష్టకాలంలో సామాన్యుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. అయినా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్రభుత్వం తనిఖీలు చేయమందన్న పేరుతో ఒంగోలులోని కేవలం రెండు ప్రైవేటు వైద్యశాలలనే టార్గెట్‌ చేశారు. అందులో ఒక వైద్యశాలకు క్లీన్‌చిట్‌ ఇచ్చి ఒక వైద్యశాలపై కేసు నమోదు చేశారు. ఒంగోలు రిమ్స్‌లో నిలువెత్తు దోపిడీ జరుగుతున్న విషయం నగ్నసత్యం. కార్పొరేట్‌ వైద్యశాలల్లో సాధారణ  బాధితులకు ప్రవేశం లేదనేది కూడా నగ్నసత్యం. ఇక రెమ్‌డిసివిర్‌ లాంటి ఇంజక్షన్‌ ఒంగోలులో కూడా వేలకు వేలు ధర పలికిందనేది పచ్చినిజం. అయితే ప్రభుత్వం విజిలెన్స్‌ అధికా రుల ద్వారా తూతూమంత్రపు తనిఖీలకే పరిమితం కావటంలోని ఆంతర్యం ఏమిటనేదే ప్రశ్నార్థకం. 


రెమ్‌డిసివిర్‌ వినియోగంలో అవకతవకలు 

ప్రకాశం ఆసుపత్రి యాజమాన్యంపై కేసు

 కరోనా రోగులకు అత్యంత అవసరమైన రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల వినియోగంలో అవకతవకలు జరిగాయని విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తేల్చారు. ఈ అవకతవకలపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వడంతో కేసు నమోదు చేయాలని ఎస్పీకి పంపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు ప్రకాశం సూపర్‌ స్పెషాలిటీ అసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్‌ తనిఖీలో రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు 533 నిల్వ ఉండాల్సి ఉండగా 476 ఉన్నాయి. 57 వినియోగానికి సంబంధించి లెక్కలు లేకపోవడంతో విజిలెన్సు డీఎస్పీ టి.అశోక్‌వర్ధన్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఒంగోలు వన్‌టౌన్‌ సిఐ, సింగరాయకొండ సిఐల అధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేస్తున్నట్లుఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు.

Updated Date - 2021-04-29T06:35:50+05:30 IST