మదనపల్లె ఎంపీపీ పీఠం... ఎవరికి దక్కేనో?

ABN , First Publish Date - 2021-09-19T05:38:13+05:30 IST

మదనపల్లె డివిజన్‌లోనే అతి పెద్ద మండలమైన మదనపల్లె ఎంపీపీ పీఠంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మదనపల్లె మండలంలో 27 ఎంపీటీసీ స్థానాలుండగా, ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియలోనే వైసీపీ నాయకులు చక్రం తిప్పి ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా చేసుకున్నారు. ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవడానికి వైసీపీకి ఇక 6 స్థానాలు గెలిస్తే పూర్తి మెజారిటీ వచ్చినట్లవుతుంది.

మదనపల్లె ఎంపీపీ పీఠం... ఎవరికి దక్కేనో?
ఇ.రెడ్డెమ్మ

రేసులో ముగ్గురు ఎస్సీ మహిళలు


మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 18: డివిజన్‌లోనే అతి పెద్ద మండలమైన మదనపల్లె ఎంపీపీ పీఠంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మదనపల్లె మండలంలో 27 ఎంపీటీసీ స్థానాలుండగా, ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియలోనే వైసీపీ నాయకులు చక్రం తిప్పి ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా చేసుకున్నారు. ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవడానికి వైసీపీకి ఇక 6 స్థానాలు గెలిస్తే పూర్తి మెజారిటీ వచ్చినట్లవుతుంది.  దీంతో ఎంపీపీ పదవి కోసం వైసీపీలో పోటీ పెరిగింది. ఏప్రిల్‌ 8న మదనపల్లె జడ్పీటీసీ, 19 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్‌ వాయిదా పడింది. ఈ క్రమంలో హైకోర్టు తాజా తీర్పుతో ఈనెల 19న ఆదివారం స్థానిక ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో ఎన్నికలు సాదాసీదాగా జరిగాయి. ఆదివారం నిర్వహించనున్న కౌంటింగ్‌కు కూడా వైసీపీ నాయకులు అన్ని ఎంపీటీసీ స్థానాలకు, టీడీపీ నాయకులు ఐదారు ఎంపీటీసీ స్థానాల ఎన్నికల కౌంటింగ్‌కు ఏజెంట్లను నియమించుకుంటున్నారు. 

ఎంపీపీ స్థానం ఎవరికో..?

సీటీఎం-1, పెంచుపాడు, కొత్తవారిపల్లె ఎంపీటీసీ స్థానాలు ఎస్సీ మహిళలకు రిజర్వు అయ్యాయి. ఈ మూడు స్థానాల్లో పోటీ చేసిన సీటీఎం, కొత్తవారిపల్లె ఎంపీటీసీ అభ్యర్థులుగా ఇ.రెడ్డెమ్మ, కె.రెడ్డిరాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెంచుపాడు స్థానానికి వైసీపీ తరపున ఎం.సుబ్బలక్ష్మి, టీడీపీ తరపున డి.మల్లికరాణి మధ్య పోటీ జరిగింది. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎంపీపీ అభ్యర్థిగా సీటీఎం ఎంపీటీసీ ఇ.రెడ్డెమ్మ పేరు తొలినుంచి వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి సీటీఎంలో జెండా కట్టి, సభ్యత్వం తదితర ప్రచార కార్యక్రమాలను నిర్వహించడంలో రెడ్డెమ్మ భర్త వెలుగుచంద్ర ముందు నిలిచారు. అంతేకాక 2013లో జరిగిన సీటీఎం సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో రెడ్డెమ్మ పోటీ చేసినా రెబల్స్‌ దెబ్బతో ఓటమి పాలయ్యారు. తరువాత వైసీపీ కార్యక్రమాలను నిర్వహిస్తూ సీటీఎం గుండా సాగిన జగన్‌ పాదయాత్ర విజయంతానికి వెలుగు చంద్ర కష్టపడ్డారు. అంతేకాక సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు సీటీఎంలో వైసీపీ మెజారిటీకీ దోహదపడ్డారు. అలాగే ఇటీవల జరిగిన సీటీఎం సర్పంచ్‌ ఎన్నికల్లో ఆనందపార్థసారథి ఏకగ్రీవం కావడానికి వెలుగు చంద్ర కృషి చేశారు. దీంతో అటు కొత్తవారిపల్లె, ఇటు సీటీఎం పంచాయతీల్లో వెలుగు చంద్ర పట్టునిలుపుకోవడంతో ఎంపీపీ రేసులో వెలుగు చంద్ర సతీమణి రెడ్డెమ్మ ముందువరుసలో నిలిచారు. ఇదిలా వుండగా కొండామర్రిపల్లె ఎంపీటీసీ స్థానం జనరల్‌కు కేటాయించగా, అక్కడి నుంచి వైసీపీ నాయకుడు నీరుగట్టు రమణ కోడలు టి.మేరీ(ఎస్సీ మహిళ) వైసీపీ అభ్యర్థిగా పోటీలో దిగింది. ఈ స్థానం దాదాపు వైసీపీ కైవసం చేసుకోనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పట్టణంలో కాంట్రాక్టరుగా ఉన్న రమణ కోడలైన టి.మేరీ కూడా ఎంపీపీ రేసులో ఉన్నారు. ఈయనకు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ తట్టిశారదమ్మ, డైరెక్టర్‌ తట్టి శ్రీనివాసులురెడ్డి మద్దతు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా వుండగా సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ దండు కరుణాకర్‌రెడ్డి వర్గం నుంచి పెంచుపాడు ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.సుబ్బలక్ష్మి పేరు కూడా ఎంపీపీ రేసులో వినపడుతోంది. కాగా మదనపల్లె ఎంపీపీ స్థానం ఎవరికి కేటాయించాలో ఎమ్మెల్యే నవాజ్‌బాషాదే తుది నిర్ణయంగా ఉండవచ్చని చెబుతున్నారు.





Updated Date - 2021-09-19T05:38:13+05:30 IST