‘రెండో’ పదవికి ఎవరు?

ABN , First Publish Date - 2021-07-28T06:43:40+05:30 IST

రెండు నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్‌, ఐదు పురపాలక సంస్థల్లో రెండో వైస్‌ చైర్మన్‌ పోస్టులకు అభ్యర్థులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి శుక్రవారం ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 23వ తేదీన నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

‘రెండో’ పదవికి ఎవరు?

30న డిప్యూటీ మేయర్‌, వైస్‌చైర్మన్లకు ఎన్నిక 


ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్న ఆశావహులు


చిత్తూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రెండు నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్‌, ఐదు పురపాలక సంస్థల్లో రెండో వైస్‌ చైర్మన్‌ పోస్టులకు అభ్యర్థులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి శుక్రవారం ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 23వ తేదీన నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాలోని చిత్తూరు, తిరుపతి నగరపాలికలకు.. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి పురపాలికలకు మార్చిలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లోనే ప్రభుత్వం చట్టాన్ని సవరించి రెండో పోస్టును సృష్టించి, త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించింది. అన్ని సంఘాల్లోనూ వైసీపీ అభ్యర్థులే అధిక సంఖ్యలో విజయం సాధించడంతో అన్నిచోట్లా అధికార పార్టీ పాలకవర్గం ఏర్పాటుచేసింది. కాగా, రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఆశావహుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలిస్తే.. 


 తిరుపతిలో యాదవ వర్గానికి చెందిన డాక్టర్‌ శిరీష మేయరుగా, బలిజ వర్గానికి చెందిన ముద్ర నారాయణ డిప్యూటీ మేయరుగా ఉన్నారు. ప్రస్తుతం రెండో డిప్యూటి మేయర్‌ పోస్టు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు భూమన అభినయ్‌రెడ్డికు దక్కుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 30వ తేదీన ఆయన పుట్టినరోజు కావడంతో.. అదే రోజు డిప్యూటీ మేయర్‌ పోస్టు బహుమతిగా రాబోతోందని సన్నిహితులు చెప్పుకుంటున్నారు.


చిత్తూరు నగరపాలక సంస్థలో అముద మేయర్‌గా, చంద్రశేఖర్‌ డిప్యూటి మేయర్‌గా ఉన్నారు. రెండో డిప్యూటి మేయర్‌ పోస్టు కోసం గట్టి పోటీ నెలకొంది. కార్పొరేటర్లు గడ్డం రమణ, సయ్యద్‌, హరిణిరెడ్డి, నారాయణ, జ్ఞాన జగదీష్‌, రాజేష్‌కుమార్‌రెడ్డి ఈ పదవిని ఆశిస్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చాలామందికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మేయర్‌ పదవి ఎస్సీలకు, డిప్యూటి మేయర్‌ పదవి బీసీలకు కేటాయించగా.. రెండో పదవి ఓసీలకు కేటాయిస్తారని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇక్కడ రెండు బలమైన వర్గాలు ఉండడంతో రెండో పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.


మదనపల్లె మున్సిపల్‌ చైర్మన్‌గా వి.మనూజ, వైస్‌ చైర్మన్‌గా బీఏ ఆజామ్‌ ఉన్నారు. ఈ రెండు పోస్టులూ ఓసీలకే కేటాయించారు. రెండో వైస్‌ చైర్మన్‌ పోస్టు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. కాగా, నీరుగట్టువారిపల్లెకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ఒకే మాట మీద ఉండి.. తమలో ఒకరికి ఇవ్వాలని అడుగుతున్నారు. ఇంకా ప్రసాద్‌బాబు (ఎస్సీ) తీవ్రంగా కృషి చేస్తున్నారు. బలిజ వర్గానికి చెందిన జింకా వెంకటా చలపతి.. తనకు పెద్దిరెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. చివరగా ఎమ్మెల్యే నవాజ్‌ బాషా ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనేది తెలియాల్సి ఉంది.


పలమనేరు మున్సిపాలిటీలో విశ్వ బ్రాహ్మణ వర్గానికి చెందిన పవిత్ర చైర్మన్‌గా, మైనార్టీలకు చెందిన చాన్‌మా వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. రెండో వైస్‌ చైర్మన్‌ పోస్టు కోసం కిరణ్‌కుమార్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇతడికి రెండో పోస్టు ఇచ్చేందుకు ఎమ్మెల్యే వెంకటేగౌడ సుముఖంగా ఉన్నారంటున్నారు.


పుంగనూరులో మైనార్టీ వర్గానికి చెందిన ఎస్‌.ఆలీమ్‌ బాషా చైర్మన్‌గా, బీసీ వర్గానికి చెందిన నాగేంద్ర వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఇక్కడ ఎవరికి రెండో వైస్‌ చైర్మన్‌ పదవి వస్తుందనే స్పష్టత లేదు. గతంలో చైర్మన్గఆ కూడా పలువురు పోటీలో ఉన్నప్పటికీ.. మంత్రి పెద్దిరెడ్డి, ఊహించని విధంగా ఆలీమ్‌ బాషాను చైర్మన్‌గా చేశారు. ప్రస్తుతం రెండో వైస్‌ చైర్మన్‌ పోస్టు విషయంలోనూ ఇదే విధంగా చేయనున్నట్లు చెబుతున్నారు. రెండో పోస్టును ఎవరూ అడగొద్దు.. ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం తాను తీసుకుంటానని మంత్రి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పుత్తూరులో ఎస్సీ వర్గానికి చెందిన హరి చైర్మన్‌గా, మొదలియార్‌ (బీసీ) వర్గానికి చెందిన శంకర్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. రెండో వైస్‌ చైర్మన్‌ పదవి బలిజ వర్గానికి చెందిన జయప్రకాష్‌కు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.


నగరిలో బీసీ(మొదలియార్‌) వర్గానికి చెందిన నీలమేఘం చైర్మన్‌గా, ఎస్సీ వర్గానికి చెందిన బాలన్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. వెంకటరత్నంకు రెండో వైస్‌ చైర్మన్‌ పోస్టు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.

Updated Date - 2021-07-28T06:43:40+05:30 IST