కార్మికులపై కక్ష ఎందుకో?

ABN , First Publish Date - 2022-07-18T06:06:21+05:30 IST

ఆర్టీసీలో ఉన్న లోటు పాట్లను సరిచేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని గట్టెక్కెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రంలోనే పేరుగాంచిన పోలీసు అధికారి సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించారు.

కార్మికులపై కక్ష ఎందుకో?
కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌

- కామారెడ్డి ఆర్టీసీ డిపోలో అధికారులు ఒకవైపు.. కార్మికులు మరోవైపు

- ఇటీవల వచ్చిన ఓ ఉన్నతాధికారి వేధింపులకు గురి చేస్తున్నారంటున్న కార్మికులు

- తోటి ఆర్టీసీ కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు వెళ్లడమే శాపమా

- అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో వెల్లడి

- కార్మికుని ఆత్మహత్య అధికారుల మెడకు చుట్టుకుంటుందని కప్పిపుచ్చేకునే ప్రయత్నాలు

- గతంలో మాదిరికాకుండా బస్టాండ్‌లోనే విధులు కేటాయిస్తూ కక్షసాధింపు చర్యలు

- జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని వేడుకోలు


కామారెడ్డి, జూలై 17: ఆర్టీసీలో ఉన్న లోటు పాట్లను సరిచేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని గట్టెక్కెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ  రాష్ట్రంలోనే పేరుగాంచిన పోలీసు అధికారి సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించారు. ఆయన రావడంతో ఆర్టీసీలో సమూల మార్పులు చేస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. దీంతో కార్మికులు తమకు భవిష్యత్తు ఉందనే భరోసాతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విధులు నిర్వహిస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుతూ వస్తున్నారు. ఒక వైపు ఎండీ కార్మికులకు, ప్రజలకు, సంస్థకు ఇబ్బందులు తొలగించేలా ప్రయత్నాలు చేస్తుంటే కొంత మంది అధికారులు తమ ఒంటెద్దు పోకడతో తమ అధిపత్యం చూపుకుందామనే ఆలోచన చేస్తుండడంతో ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడడంతో పాటు సంస్థకు నష్టం చేకూరుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల వచ్చిన డిపో ఉన్నతాధికారి చేస్తున్న చర్యలకు కార్మికులు సిబ్బంది విలవిల్లాడుతున్నారు. పరుష పదజాలంతో పాటు కార్మికుడు చనిపోతే అంత్యక్రియల్లో పాల్గొన్న పాపానికి 22 మంది సిబ్బందిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇదేమాదిరిగా వేధింపులు కొనసాగితే తాము మూకుమ్మడిగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తోటి కార్మికుడు మరణిస్తే అంత్యక్రియల్లో పాల్గొనడమే శాపమా?

కామారెడ్డి ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న డ్రైవర్‌ స్వామి గత నెల 18న  భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో తన స్వగృహంలో అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్‌ రాసి మరణించాడు. స్వామి డెడ్‌బాడీని పరిశీలించగా సూసైడ్‌ నోట్‌ లభించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరుసటిరోజు ఉదయం కామారెడ్డి డిపోలో పనిచేస్తున్న సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మహిళ కావడంతో మృతదేహం వద్దకు తాను ఒకరినే వెళితే గ్రామస్థులతో ఇబ్బంది ఉంటుందని కొంతమంది కార్మికులను తీసుకెళ్లి నివాళ్లు అర్పించారు. అప్పటికే గ్రామస్థులు స్వామి ఆత్మహత్యకు కారణం ఉన్నతాధికారుల వేధింపుల వల్లే జరిగిందని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో ఆర్టీసీ కార్మికులు పాల్గొనలేదు. ప్రభుత్వానికి, ఆర్టీసీకి వ్యతిరేకంగా అధికారుల నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఆర్టీసీ సిబ్బంది ప్రోత్సాహం వల్లే జరిగిందని భావించిన ఉన్నతాధికారులు ఆసుపత్రికి వెళ్లిన 22 మందిపై విచారణ చేపట్టాలని స్థానిక డీఎంను ఆదేశించారు. వారిలో కొంతమందిని బాధ్యులుగా భావించి 7 గురు సిబ్బందికి వారు నిర్వహించే విధుల నుంచి తప్పించి బస్టాండ్‌ ఆవరణలో ప్రయాణికులను పిలిచేందుకు డ్యూటీలు వేస్తూ వారిని మానసికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిలో నలుగురు డ్రైవర్‌లు, ముగ్గురు కండక్టర్‌లు ఉన్నారు. తోటి కార్మికుడు మరణిస్తే మానవతా దృక్పథంతో అంత్యక్రియలకు హాజరయిన పాపానికి తమకు ఈ వేధింపులు ఎంటోనని ఆ కార్మికులు కుమిలిపోతున్నారు.

అధికారుల తప్పును కప్పిపుచ్చుకునేందుకే వేధింపులా?

డ్రైవర్‌ మరణించిన కారణాన్ని, అధికారుల తప్పును కప్పిపుచ్చుకునేందుకు తమను బూచిగా చూపి ఉన్నతాధికారుల నుంచి తప్పించుకునేందుకే ఈ రకంగా తమను వేధింపులకు గురి చేస్తున్నారని సదరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్‌ స్వామి మృతిపై గ్రామస్థులు నిరసన తెలిపితే తమనేందుకు బాధ్యులను చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. డీఎంతో పాటు స్టేషన్‌ మేనేజర్‌ మహిళా ఉద్యోగి అయిఉండి నోటికి ఎంత వస్తే అంతా బూతులు తిడుతూ మానసికంగా వేధిస్తున్నారని పేర్కొంటున్నారు. మహిళ కండెక్టర్‌లపై సైతం తమ నోటి దురుసుతనం ప్రదర్శించడమే కాకుండా పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరణానికి కారణం చెప్పాలే తప్ప అంత్యక్రియల్లో పాల్గొనందుకు తామేదో నేరం చేసినట్లు వేధింపులకు గురిచేయడం తగదని అంటున్నారు. డీఎంతో పాటు స్టేషన్‌ మేనేజర్‌పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. గతంలో తాము రెగ్యులర్‌ విధులు నిర్వహించి ఆర్టీసీకి నాలుగు బస్సులకు కలిపి రోజుకు రూ.80వేల చొప్పున ఆదాయం సమకుర్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం తమను ఎలాంటి ప్రాధాన్యత లేని బస్టాండ్‌లో విధులకు కేటాయిస్తూ తమపై కక్షను తీర్చుకుంటున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికీ రూ.2లక్షల వరకు ఆదాయం డిపోకు నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. ఇదంతా డిపో మేనేజర్‌ అసమర్థతనే అని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే తప్ప నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. దీంతో తమ కష్టాలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నేను ఎవరినీ వేధించలేదు

- మల్లేషం, డిపో మేనేజర్‌, కామారెడ్డి

కార్మికులను నేను వేధించలేదు. 600 మంది డిపోలో పని చేస్తున్నారు. కేవలం ఏడుగురిని ఎందుకు వేదిస్తాను. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా కిందిస్థాయి అధికారులే నాకు టచ్‌లో ఉంటారు. వారి ద్వారానే పనులు చేయిస్తానే తప్ప కార్మికులపై ఎలాంటి అజామాయిషీ చేయను. తాను ఎన్నడూ దురుసుగా మట్లాడడం, వేధించడం చేయలేదు.

Updated Date - 2022-07-18T06:06:21+05:30 IST