పినరయి చరిత్ర సృష్టిస్తారా?

ABN , First Publish Date - 2021-04-05T08:21:48+05:30 IST

కేరళలో హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. 140 అసెంబ్లీ సీట్లకు మంగళవారమే (6వ తేదీ) పోలింగ్

పినరయి చరిత్ర సృష్టిస్తారా?

  • కేరళలో సీపీఎం గాలి! 
  • డీలా పడని కాంగ్రెస్‌.. బీజేపీ బలం పెరుగుతుందా? 
  • రేపే పోలింగ్‌

తిరువనంతపురం, ఏప్రిల్‌ 4: కేరళలో హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. 140 అసెంబ్లీ సీట్లకు మంగళవారమే (6వ తేదీ) పోలింగ్‌. ఈ ఎన్నికల్లో మళ్లీ వామపక్ష కూటమి- ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించవచ్చని దాదాపుగా అన్ని సర్వేలూ అంచనా వేశాయి. అదే జరిగితే పినరయి విజయన్‌ చరిత్ర సృష్టించినట్లే! ఎందుకంటే గడచిన 44 సంవత్సరాల్లో ఏనాడూ ఒకే పార్టీ లేదా కూటమి వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన దాఖలాల్లేవు. ఒకసారి ఎల్డీఎఫ్‌ గెలిస్తే మరోమారు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌..! ఈ సైకిల్‌ ఈ దఫా బ్రేక్‌ కావొచ్చని అంటున్నారు. బరిలో ఉన్న మూడో పక్షం- బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ గట్టి సవాల్‌ విసిరినా అది అధికార పీఠానికి చేరువ కాలేదని సర్వేలు స్పష్టీకరిస్తున్నాయి. మహా అయితే 2016లో ఒక్క సీటు గెలిచిన బీజేపీ ఈసారి తన బలాన్ని స్వల్పంగా పెంచుకొనే అవకాశాలున్నాయని అంటున్నారు. ముస్లిం, క్రైస్తవ ఓటుబ్యాంకులు ఈ ఎన్నికల్లో కీలకం. ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌తో పొత్తులో ఉన్న కాంగ్రెస్‌ ముస్లింల ఓట్లు గుండగుత్తగా తమవేనంటోంది. కానీ గత ఎన్నికల తీరు చూస్తే ఎల్‌డీఎ్‌ఫకు కూడా ముస్లిం ఓట్లు గణనీయంగానే పడ్డాయి. కాబట్టి ఈ సారి చీలిక తప్పదు. ఇక క్రైస్తవ ఓట్ల కోసం బీజేపీ కొంతమంది చర్చి పెద్దలతో మంతనాలు సాగించినా ఇది పెద్ద ఫలితాన్నివ్వకపోవచ్చని అంటున్నారు. శబరిమల వివాదాన్ని రేకెత్తి, సీఏఏ, ఉమ్మడి పౌరస్మృతి వంటి వివాదాస్పద అంశాలను ధాటిగా ప్రచారం చేసిన బీజేపీకి ఎంత మేర లబ్ధి చేకూరుతుందో చూడాలి. 


ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం.. ఎల్‌డీఎఫ్‌ 77 స్థానాలు కైవసం చేసుకోవచ్చు, యూడీఎ్‌ఫకు 62 లభించవచ్చు. కానీ ఇది పోలింగ్‌ తేదీకి సుమారు నెలరోజుల ముందు జరిపినది. కాంగ్రెస్‌ కూడా ఉధృత ప్రచారంతో మేజిక్‌ ఫిగర్‌ (71)కు చేరువగా వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదన్న వాదనలు ఉన్నాయి. 



పినరయి పాపులారిటీ

కేరళలో అత్యంత జనాకర్షణ గల నేతగా పినరయి అవతరించారు. ఆయన పాపులారిటీ మిగిలిన వారి కంటే ఏకంగా 30 శాతం ఎక్కువగా ఉంది. ఓ కల్లుగీత కార్మికుడి కుమారుడైన పినరయి రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన ఎళవా వర్గానికి చెందిన వారు. ఆ వర్గపు ఓట్లు ఆయన సారథ్యంలోని ఎల్‌డీఎ్‌ఫకే ఎక్కువ లభిస్తాయని ఓ అంచనా. ఇక యూడీఎఫ్‌ తరఫున మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ బలం కూడా తక్కువేం కాదు. అయితే ఆయనకు రమేశ్‌ చెన్నితాల సహా పార్టీలో కొందరు నేతల వర్గపోరు పెద్ద మైనస్‌. రాహుల్‌, ప్రియాంకల ప్రచారం కొంతవరకూ యూడీఎ్‌ఫకు సానుకూల వాతావరణం సృష్టించిందనీ, కాంగ్రెస్‌ శ్రేణులేవీ డీలా పడలేదని విశ్లేషకులంటున్నారు. అయితే సీపీఎంకున్న క్షేత్రస్థాయి బలం, బ్లాక్‌ స్థాయి నుంచి ఉన్న బలగం కాంగ్రె్‌సకు లేవు.



Updated Date - 2021-04-05T08:21:48+05:30 IST