ప్రియాంక గట్టెక్కిస్తారా?

ABN , First Publish Date - 2022-01-18T07:37:10+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావో, హథ్రా్‌సలో దళిత యువతులపై అత్యాచారం, హత్య జరిగి నాటి

ప్రియాంక గట్టెక్కిస్తారా?

  • యూపీ  అసెంబ్లీ పోరు
  • కొద్ది నెలలుగా జనంలోనే, అధిక ధరలపై ప్రచారం
  • మహిళలే లక్ష్యంగా హామీలు.. పుంజుకోని కాంగ్రెస్‌


(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి)

ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావో, హథ్రా్‌సలో దళిత యువతులపై అత్యాచారం, హత్య జరిగి నాటి నుంచి లఖీంపూర్‌ ఖేరీలో రైతులపై బీజేపీ నేత వాహనం నడిపించిన ఘటన వరకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రియాంకా గాంధీ వాద్రా  ప్రత్యక్షమవుతున్నారు. ఆమె గత కొద్ది నెలలుగా జనం మధ్యలోనే ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంత ఉంటుందన్న విషయమై రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. నిజానికి ఆమె నేతృత్వంలో కాంగ్రెస్‌ బలం పుంజుకుంటే రాష్ట్రంలో ముక్కోణ పోటీ ఏర్పడుతుందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి.. తమకు లబ్ధి చేకూర్చుతుందని బీజేపీ నేతలు కూడా భావించారు. కానీ అటు ప్రియాంక, ఇటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి వల్ల తమ ఓట్లు పెద్దగా చీలే అవకాశం లేదని, అఖిలేశ్‌ యాదవ్‌ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీతో బీజేపీకి ముఖాముఖి పోటీ తప్పడం లేదని కమలనాథుడొకరు అన్నారు.


ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రియాంక.. యూపీలో కాంగ్రెస్‌ బలోపేతంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే ఇస్తామని ప్రకటించారు. ‘నేను అమ్మాయిని.. పోరాడగలను అన్న ప్రచారాన్ని ఉధృతం చేశారు. హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల దుందుడుకుతనాన్ని దీటుగా ఎదుర్కొంటున్నారు. ధిక ధరలపై ఆమె ఉధృతంగా ప్రచారం చేశారు.


రాహుల్‌కు భిన్నంగా..

తన ప్రసంగాలు, వ్యాఖ్యల్లో ఎక్కడా సంయమనం, హుందాతనం కోల్పోకుండా మాట్లాడడం.. వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండటం ద్వారా తన సోదరుడు రాహుల్‌కంటే భిన్నమైన వ్యక్తినని ప్రియాంక నిరూపించుకున్నారు. ఆమె సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతున్నా.. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ పుంజుకోవడం లేదని.. ఓటు బ్యాంకు పెరుగుతుందని చెప్పలేమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


అయితే.. కాంగ్రెస్‌ ఓట్ల శాతం తప్పకుండా పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో మాయావతి స్థానంలోకి కాంగ్రెస్‌ ప్రవేశిస్తుందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి కీలక శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటుబ్యాంకులో కనీసం 10 నుంచి 20 శాతం మేర ఓట్లను ప్రియాంక చీల్చగలిగితే ఆ పార్టీని బలహీనపరచగలరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


ఏడేళ్ల కిందే వచ్చి ఉంటే..

నిజానికి 2014లోనే ప్రియాంక రంగంలోకి దిగి పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసి ఉంటే ఇవాళ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచేదని.. అగ్రవర్ణాలతో పాటు మైనారిటీలు కూడా ఆమెకు మద్దతిచ్చేవారని ‘దైనిక్‌ జాగరణ్‌’ పత్రిక సీనియర్‌ సంపాదకుడు సంజయ్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ కనీసం 20-30 సీట్లు గెలుచుకుంటే.. అఖిలేశ్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఉండేదని, కానీ కాంగ్రెస్‌ ఐదారు సీట్ల కంటే ఎక్కువ సాధించడం అనుమానమేనని ఆయన పేర్కొన్నారు. 


హస్తానికి 6 శాతమే!

2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపెట్టుకుని.. 403 స్థానాలకు గాను 114 చోట్ల పోటీ చేసి, ఏడు స్థానాలు మాత్రమే గెలిచింది. కేవలం 6 శాతం ఓట్లు సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 80 ఎంపీ సీట్లలో ఒక్క స్థానమే గెలుచుకోగలిగింది.


Updated Date - 2022-01-18T07:37:10+05:30 IST