డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపేస్తాం

ABN , First Publish Date - 2020-04-09T07:45:30+05:30 IST

కొవిడ్‌-19 అమెరికాలో కరాళనృత్యం చేస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘కరోనా గురించి మీరు చెప్పిన ప్రతీ విషయం తప్పు. చైనాలో ఏం జరుగుతోందో మీకు...

డబ్ల్యూహెచ్‌వోకు నిధులు నిలిపేస్తాం

  • చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తారా!
  • ముందస్తు హెచ్చరికలు చేయలేదేం..?
  • సొమ్ము మాది... సేవ వారికా..!
  • అమెరికా అధ్యక్షుడి తీవ్ర హెచ్చరిక 
  • సమయం కాదు: డబ్ల్యూహెచ్‌వో

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 7:  కొవిడ్‌-19 అమెరికాలో కరాళనృత్యం చేస్తుండడంతో   ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘కరోనా గురించి మీరు చెప్పిన ప్రతీ విషయం తప్పు. చైనాలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. వైరస్‌ తీవ్రతను ఎందుకు అంచనా వేయలేకపోయారు? ప్రపంచవ్యాప్తంగా పరిశోధన సంస్థలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేయలేకపోయారు’’ అని ఘాటుగా దుమ్మెత్తారు. ‘‘మేం ట్రావెల్‌ బ్యాన్‌ పెడతామన్నాం. ఇపుడే అక్కర్లేదని మీరు సలహా ఇచ్చారు. సరిహద్దులు మూసేస్తామన్నాం. అదీ వద్దన్నారు. దీని ఫలితం మేం ఇపుడు అనుభవిస్తున్నాం’’ అని విమర్శించారు. ‘‘కొవిడ్‌-19 కిందటేడాది చివర్లోనే వుహాన్‌లో మొదలైంది. కానీ మీరు ఎప్పటికప్పుడు తాత్సారం చేస్తూ వచ్చారు. ఆఖరికి ఈ ఏడాది మార్చి 11న గానీ  ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ప్రకటించలేదు. ఎందుకీ ఆలస్యం? డబ్ల్యూహెచ్‌వో  ఇది పెద్ద విషయమే కాదనీ, ఏ సమస్యా రాదని చెప్పింది. వారి మాటే విని ఉంటే పరిస్థితి ఇంకా భీభత్సంగా మారి ఉండేది’’ అని ట్రంప్‌ దుయ్యబట్టారు. ‘‘డబ్ల్యూహెచ్‌వో పూర్తిగా చైనాకు అనుకూలంగా వ్యవహరించింది. మేం పెద్దమొత్తంలో ఈ సంస్థకు నిధులిస్తున్నాం. మా సొమ్ముతో వారికి సాయం చేస్తారా? దాన్ని నిలిపేస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. దీన్ని డబ్ల్యూహెచ్‌వో నిరసించింది. నిధులు ఆపేయడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఈ సమయంలో నిధుల కొరత సృష్టించడం సరికాదని అభిప్రాయపడింది. 


మరణాలు తక్కువే

ఒక్క మంగళవారంనాడే అమెరికాలో కరోనాతో 1900 మంది బలికావడంతో అమెరికా తీవ్రంగా రోదిస్తోంది. అయితే ఈ సంఖ్య అంచనాల కంటే  తక్కువేనని దేశాన్ని సముదాయించే ప్రయత్నం చేశారు ట్రంప్‌!  ‘‘వందల మంది చనిపోతున్నప్పటికీ కేసులు, మరణాల సంఖ్య కుదుటపడుతోంది. క్రమేణా నిలకడగా మారుతోంది’’ అన్నారు. ‘‘దేశంలోని 330 మిలియన్‌ జనాభాలో 97 శాతం ఇంట్లోనే ఉంటున్నారు. అనేక పబ్లిక్‌ ప్రదేశాలు, కన్వెన్షన్‌ సెంటర్లు, హోటళ్లను క్వారంటైన్‌, ఐసొలేషన్‌ కేంద్రాలుగా మార్చాం. వేల కొద్దీ వెంటిలేటర్లు సిద్ధం చేశాం’’ అని చెప్పారు.


క్లోరోక్విన్‌ వల్ల ఆమె బతికింది

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడడం వల్ల మిచిగన్‌ రాష్ట్ర ప్రతినిధి తన ప్రాణాలు దక్కించుకోగలిగారని ట్రంప్‌ చెప్పారు. ఈ మందు మంచిదా కాదా.. అన్న చర్చ జరుగుతున్న వేళ ఆయన ఈ విషయం వెల్లడించారు. ‘కరెన్‌ విట్‌సట్‌ అనే ఆ ప్రతినిధి నాకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. వైరస్‌ సోకడం వల్ల తాను, తన భర్త కొన్నాళ్లుగా బాధపడుతున్నామని, హెచ్‌సీక్యూ వాడడం వల్ల బతికి బట్టకట్టామని ఆమె ట్వీట్‌ చేశారు. మరి నా నిర్ణయం (భారత్‌నుంచి దిగుమతి) సరైనదా? కాదా?’ అని ఆయన పేర్కొన్నారు. ‘డెమొక్రాట్‌ అయిన ఆమె దీన్ని జయించింది. అందరి విషయంలో ఇలానే జరుగుతుందని నేను చెప్పలేను’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-04-09T07:45:30+05:30 IST