మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?

ABN , First Publish Date - 2022-02-25T08:57:08+05:30 IST

పోలండ్‌పై జర్మనీ దురాక్రమణ ఆనాడు రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసినట్టే ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా దాడి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ప్రపంచవ్యాప్తంగా పలువురి భయం ఇది! ఒకవైపు ప్రబల అణ్వాయుధ శక్తి రష్యా...

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?

  • మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?
  • ఆ ప్రమాదం లేదంటున్న నిపుణులు
  • ఉక్రెయిన్‌ నాటో సభ్య దేశం కాదు
  • సైన్యాన్ని పంపబోమన్న అమెరికా
  • పుతిన్‌ మదిలో ఏముందన్నదే కీలకం
  •  తదుపరి ఎత్తుగడలపై తీవ్ర ఉత్కంఠ


పోలండ్‌పై జర్మనీ దురాక్రమణ ఆనాడు రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసినట్టే ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా దాడి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ప్రపంచవ్యాప్తంగా పలువురి భయం ఇది! ఒకవైపు ప్రబల అణ్వాయుధ శక్తి రష్యా... రెండోవైపు అగ్రరాజ్యం అమెరికా, దాని మిత్రపక్షాలు మోహరించి ఉన్నందున త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. లక్షల మంది నెటిజన్లు ఇలాంటి భయాన్ని వ్యక్తంచేస్తున్నారు. అయితే ప్రస్తుత సంక్షోభం మరింత పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం తక్కువేనని రక్షణ, విదేశాంగ నిపుణులు అంటున్నారు. అమెరికా, దాని మిత్రపక్షాల కూటమి నాటోలో 30 దేశాలు ఉన్నాయి. నాటో ఒప్పందం ప్రకారం సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మిగతా సభ్య దేశాలన్నీ దానికి అండగా యుద్ధానికి దిగాలి. కానీ ఉక్రెయిన్‌ నాటో సభ్య దేశం కాదు. నాటోలో చేరడానికి ఉక్రెయిన్‌ సంసిద్ధత తెలిపినప్పటికీ దానిని చేర్చుకునే విషయంలో నాటో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా, మిత్రపక్షాలు యుద్ధ రంగంలోకి ప్రవేశించే అవకాశం లేదు.


అమెరికా-రష్యా సైనికులు పరస్పరం కాల్పులు జరుపుకుంటే అది ప్రపంచ యుద్ధమే అవుతుందని, అందువల్ల ఉక్రెయిన్‌లో బలగాల్ని దించబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. నాటో కూడా గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే ఉక్రెయిన్‌ సైన్యానికి కొందరు అమెరికన్లు ఇప్పటివరకూ శిక్షణ ఇస్తుండగా, మరికొందరు సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌లో బయటి శక్తుల జోక్యం వల్ల తమ దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని, అందుకే ఉక్రెయిన్‌పై దాడికి యోచిస్తున్నామని పుతిన్‌ వ్యాఖ్యానించగానే అమెరికన్‌ శిక్షకులు, సలహాదారులు ఉక్రెయిన్‌ను వీడారు. దీనిని బట్టే అమెరికా వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌పై రష్యా మరింత పట్టు బిగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ విజయం ఇచ్చే ఉత్సాహంతో పుతిన్‌ తదుపరి ఎలాంటి అడుగులు వేస్తారనే దానిపైనే ‘‘మూడో ప్రపంచ యుద్ధం’’ ఆధారపడి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గతంలో సోవియట్‌ ప్రభావం కింద ఉండే పోలండ్‌, లిథువేనియా, లాత్వియా వంటి దేశాలు సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత నాటోలో చేరిపోయాయి. ఆ దేశాల్లో నాటో బలగాలు తిష్ఠ వేయడం వల్ల కూడా తమ దేశానికి ముప్పు పెరుగుతోందని పుతిన్‌ భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ విజయం తర్వాత పుతిన్‌ ఆ దేశాలపై దాడి మొదలుపెడితే అప్పుడు నాటో జోక్యం తప్పనిసరి. కానీ పుతిన్‌ మదిలో ఏముందో తెలియదు. ఆయన అంత సాహసం చేస్తారా లేదా అనేది కాలమే చెప్పాలి.

 సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2022-02-25T08:57:08+05:30 IST