చికెన్ ధరకు రెక్కలు
ABN , First Publish Date - 2021-04-05T09:01:34+05:30 IST
చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు వారాలుగా గ్రేటర్ హైదరాబాద్‌లో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
కిలో స్కిన్‌లెస్ రూ.260
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు వారాలుగా గ్రేటర్ హైదరాబాద్‌లో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఆదివారం స్కిన్‌లెస్ చికెన్ ధర ఒకేసారి రూ.260కి పెరిగింది. మార్చి 21న రూ.220 ఉండగా, 28 నాటికి రూ.200కు తగ్గింది. అయితే మళ్లీ ధర భగ్గుమంటోంది. ఇటీవల రిటైల్ మార్కెట్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.230 ఉండగా, అదనంగా రూ.30 పెరిగింది. నాలుగు నెలల క్రితం స్కిన్‌లెస్ రూ. 120 నుంచి రూ. 140 వరకు ఉండేది. అయితే కొన్నిసార్లు ధర పెరగడం, మరికొన్నిసార్లు తగ్గడం జరుగుతోంది. గతేడాది కరోనా సమయంలో చికెన్ అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. కరోనా విషయంలో చికెన్‌పై ఉన్న అనుమానాలు తొలగిపోవడంతో చాలా మంది మళ్లీ చికెన్ తినడం ప్రారంభించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చికెన్ వినియోగం కాస్త తగ్గి ధరలు కూడా తగ్గాయి. మళ్లీ మార్చి మూడో వారం నుంచి ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఎండలు బాగా ఉండడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత ఏడాది కంటే కోళ్ల ఉత్పత్తి ఈ ఏడాది చాలా తక్కువగా ఉందని వ్యాపారులు వివరించారు. మరోవైపు మటన్ కిలో రూ.700 నుంచి రూ.800 వరకు పలుకుతోంది. దీంతో చికెన్ కొనేవారు పెరగడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి.