Abn logo
Sep 14 2021 @ 00:58AM

అన్న భార్యపై మహిళా కార్పొరేటర్‌ వేధింపులు

ఆపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి

ఆడపడుచు, మామ తరచూ వేధిస్తున్నారని మనస్తాపం

ఆస్పత్రికి తరలింపు... వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు


తాటిచెట్లపాలెం(విశాఖపట్నం): ఆడపడుచు అయిన కార్పొరేటర్‌తోపాటు మామ వేధిస్తున్నారంటూ వార్డు మహిళా వలంటీరు సోమవారం డెటాల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం ఆపస్మారక స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత మహిళ కుటుంబీకులు, కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.


నగరంలోని 47వ వార్డు పరిధి కప్పరాడ వార్డు సచివాలయం పరిధిలో కోరుబిల్లి నందిని వలంటీరుగా పనిచేస్తున్నారు. కంచరపాలెం ఊర్వశి జంక్షన్‌ సమీపంలోని అరుంధతినగర్‌లో భర్త కోరుబిల్లి విజయ్‌కుమార్‌తో కలిసి నివాసం వుంటున్నారు. ఈ ఇంటిలో మొత్తం మూడు పోర్షన్లు వున్నాయి. మిగిలిన రెండు పోర్షన్లలో ఒకదానిలో నందిని అత్తమామలు, మరో పోర్షన్‌లో ఆడపడుచు అయిన 47వ కార్పొరేటర్‌ కంటిపాము కామేశ్వరి (వైసీపీ) కుటుంబ సభ్యులు నివాసం వుంటున్నారు. ఈ నేపథ్యంలో నందినికి... మామ చిన్నారావు(రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌), ఆడపడుచు కామేశ్వరితో చాలా కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి.  మామ, ఆడపడుచు కలిసి తనను తరచూ వేధిస్తున్నారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి శనివారం జరిగిన లోక్‌అదాలత్‌లో న్యాయమూర్తి ఇరువర్గాలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చారు.


తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ సోమవారం సాయంత్రం మామ, ఆడపడుచు కలిసి నందినిపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న డెటాల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆపస్మారక స్థితికి చేరిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం ఎస్‌ఐ దివ్యభారతి ఆస్పత్రికి చేరుకుని నిందితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.