మీ బ్యాంక్ ఖాతాలతో సైబర్ క్రైమ్స్.. పోలీసులు చెప్పింది విని కంగుతిన్న మహిళ.. ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో..

ABN , First Publish Date - 2021-08-03T02:48:10+05:30 IST

ఆ మహిళకు సడెన్‌గా సైబర్ క్రైం పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. ఆమె పేరున ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి అనేక సైబర్ క్రైమ్స్ జరిగాయని, ఈ కారణంగా ఆ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

మీ బ్యాంక్ ఖాతాలతో సైబర్ క్రైమ్స్.. పోలీసులు చెప్పింది విని కంగుతిన్న మహిళ.. ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో..

ఇంటర్నెట్ డెస్క్: ఆ మహిళకు సడెన్‌గా సైబర్ క్రైం పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. ఆమె పేరున ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి అనేక సైబర్ క్రైమ్స్ జరిగాయని, ఈ కారణంగా ఆ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. దీంతో షాకైన ఆమె.. వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి వివరాలు కోరింది. అప్పుడుకానీ ఆమెకు తెలియలేదు, తాను చేసిన తప్పేంటో. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. మీనా అనే మహిళకు ఫేస్‌బుక్ ద్వారా బెంజమిన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. యూకేకు చెందిన అతనితో కొంతకాలం స్నేహంగా ఉన్న తర్వాత.. ‘‘నా మిత్రుడు జాన్.. మరికొన్ని రోజుల్లో ఇండియా వస్తాడు. అక్కడ వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాడు. మీ పేరు మీద బ్యాంకు అకౌంట్లు తీసిస్తే బిజినెస్‌కు వాడుకుంటాడు. మేం విదేశీయులం కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి’’ అని అతను చెప్పడంతో మీనా నమ్మింది.


బెంజమిన్ సూచనల మేరకు వేరు వేరు బ్యాంకుల్లో మొత్తం 8 ఖాతాలు ఓపెన్ చేసింది. ఆ తర్వాత ఈ బ్యాంకు ఖాతాల వివరాలతోపాటు, రూ.90వేల నగదును కూడా ఒక అడ్రస్‌కు పంపాలని బెంజమిన్ చెప్తే పంపింది. ఇప్పుడు తాజాగా పోలీసులు వచ్చి ఈ ఖాతాలన్నింటినీ సైబర్ క్రైమ్స్ చేయడానికి వాడుతున్నట్లు చెప్పడంతో మీనాకు తాను మోసపోయినట్లు తెలిసింది. బెంజమిన్ చెప్తే వేరే యువతికి కూడా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి సాయం చేసినట్లు మీనా చెప్పింది. అలాగే ఒకసారి ఒక యువతి ఫోన్ చేసి కస్టమ్స్ అధికారినని చెప్పిందని, అర్రి జాన్సన్ అనే వ్యక్తిని సరైన పత్రాలు లేకపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసినట్లు ఆ యువతి మీనాకు చెప్పింది. తను మీనా ఫ్రెండ్ అని అతను చెప్పాడట. ఈ విషయాన్ని కూడా పోలీసులకు మీనా చెప్పింది. 


ఇదంతా ఒక సైబర్ క్రైం ముఠా కుట్రగా పోలీసులు భావిస్తున్నారు. భారత్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన వారిని మోసం చేసిన సైబర్ గ్యాంగ్ సభ్యులు.. బాధితుల నుంచి డబ్బులు సేకరించడం కోసం మీనా ఓపెన్ చేసిన ఖాతాలను వాడుకున్నారు. ఈ ముఠాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన అర్రి జాన్సన్, మీనా చెప్తున్న జాన్ ఒకరేనా తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-08-03T02:48:10+05:30 IST