భాగ్యనగరంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న అక్రమ రవాణా!

ABN , First Publish Date - 2021-06-03T14:14:02+05:30 IST

ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మహిళలు, చిన్నారులను అక్రమంగా నగరానికి చేరుస్తున్న ముఠాలు వారి జీవితాలతో

భాగ్యనగరంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న అక్రమ రవాణా!

  • ఆగని అక్రమ రవాణా
  • ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి.. 
  • యువతులను, చిన్నారులను దిగుమతి చేస్తున్న ముఠాలు 
  • ఉక్కుపాదం మోపుతున్న రాచకొండ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ : నగరంలో మానవ అక్రమ రవాణా రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మహిళలు, చిన్నారులను అక్రమంగా నగరానికి చేరుస్తున్న ముఠాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మహిళలను బలవంతంగా పడుపు వృత్తిలోకి దింపుతూ.. చిన్నారులను బాలకార్మికులుగా, యాచకులుగా మారుస్తున్నారు. ఇలాంటి కేటుగాళ్ల ఆటకట్టించాలని సంకల్పించారు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌. గతేడాది జూలైలో ప్రత్యేకంగా యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ను ఇన్‌చార్జిగా నియమించి ఆయన సారథ్యంలో ఒక ఎస్‌ఐ, ఒక ఏఎ్‌సఐ, ముగ్గురు కానిస్టేబుల్స్‌, మరో ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్‌తో ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని రంగంలోకి దింపారు. బలవంతంగా పడుపు వృత్తి చేస్తున్న గ్యాంగ్‌లు, చిన్నారులను బాలకార్మికులుగా మార్చుతున్న వారిని కటకటాల్లోకి నెడుతున్నారు. గతేడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు 10 కేసులను ఛేదించిన యాంటీటీమ్‌ మొత్తం 36 మంది బాధితులను రక్షించి.. 32 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టారు. వారిలో 10మందిపై పీడీయాక్టు సైతం నమోదు చేశారు.


5 నెలల్లో అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలు 

మొత్తం నమోదు చేసిన కేసులు 30

పోలీసులు రక్షించిన బాధితులు 102

పట్టుబడ్డ నేరస్థులు  81

పీడీ యాక్ట్‌ నమోదైన నేరస్థులు 38


ఉపాధి పేరుతో...

మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలు బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఉగాండా దేశాలతో పాటు.. పశ్చిమబెంగాల్‌, ముంబై, ఢిల్లీ తదిర ప్రాంతాల నుంచి యువతులను దిగుమతి చేస్తున్నారు. అక్కడ వారి ఆర్థిక స్థితిగతులను అవకాశంగా చేసుకొని ఉద్యోగం, ఉపాధి పేరుతో నగరానికి రప్పిస్తున్నారు. ఆ తర్వాత వారిని బలవంతంగా  పడుపు వృత్తిలోకి దింపుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ సెక్స్‌ రాకెట్‌ను నడుపుతున్న ముఠాలన్నీ ఇలాంటి వారిని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇతర దేశాలు, రాష్ట్రాలకు చెందిన కొంతమంది ఏదో ఒక పనికోసం నగరంలోకి వచ్చి తిష్టవేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడే అక్రమంగా ఉంటూ.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి వారి సొంత ప్రాంతాల నుంచి యువతులను రప్పిస్తున్నారు. ఆ తర్వాత అంతా ఒక ముఠాగా ఏర్పడి ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఉగాండా దేశానికి చెందిన మహిళల ముఠా పట్టుబడిన విషయం తెలిసిందే.


చిన్నారులతో వెట్టిచాకిరీ...

మధ్యప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిషా, తదితర  ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాలు వారిని కంపెనీలు, కార్ఖానాల్లో, గాజుల పరిశ్రమల్లో, ప్లాస్టిక్‌ కంపెనీల్లో పనికి పెడుతున్నారు. చిన్నారులనే జాలి కూడా లేకుండా ఆయా కంపెనీల యాజమాన్యాలు రోజుకు 15 గంటలు పనిచేయిస్తూ చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. 


5 నెలల్లో 30 కేసులు...

కేసులు నమోదు చేస్తున్నా.. నిందితులను కటకటాల్లోకి నెడుతున్నా.. నగరంలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. యఽథేచ్ఛగా అక్రమ దందా జరుగుతోంది. దాంతో రాచకొండ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది కేవలం 5 నెలల్లోనే 102 మంది బాధితులను రక్షించారు. 30 కేసులు నమోదు చేసి 81మందిని కటకటాల్లోకి నెట్టారు. ఇలాంటి నిందితులు బయట ఉంటే ప్రమాదకరమని భావించిన సీపీ మహేష్‌ భగవత్‌ ఇప్పటి వరకు 38 మంది నేరస్థులపై పీడీయాక్టు నమోదు చేశారు.

Updated Date - 2021-06-03T14:14:02+05:30 IST