కార్మికులు దైవంతో సమానం

ABN , First Publish Date - 2020-04-05T10:58:30+05:30 IST

కరోనా వ్యాప్తి నివారణ కోసం మునిసిపల్‌ కార్మికులు చేస్తున్న కృషి మరువలేనిదని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో

కార్మికులు దైవంతో సమానం

క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించడం భేష్‌

వారి సేవలను ప్రజలు గుర్తించాలి

కాలనీల్లోకి సాదరంగా ఆహ్వానించాలి

ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

కార్మికులకు హెల్త్‌కిట్లు నిత్యావసర సరుకుల పంపిణీ


మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 4 : కరోనా వ్యాప్తి నివారణ కోసం మునిసిపల్‌ కార్మికులు చేస్తున్న కృషి మరువలేనిదని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సేవలు చేస్తున్న వారు దైవంతో సమానమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా పట్టణమంతా తిండి తిప్పలు మాని పారిశుధ్య పనులు చేపడుతున్నారని, ఇంటింటికీ తిరిగి స్ర్పే చేస్తున్నారని చెప్పారు. మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో శనివారం మంత్రి కార్మికులకు నిత్యావసర సరుకులు, హెల్త్‌ కిట్లను పంపిణీ చేశారు.


ఒక్కో కార్మికుడికి పది కిలోల బియ్యం, మూడు కిలోల మంచి నూనె, రెండు కిలోల చక్కర, ఐదు కిలోల గోధుమ పిండి, కిలో కంది, పెసర పప్పులు, అర కిలో చింతపండు, అరకిలో కారం, పసుపు, జీర, ఉప్పు, టీ పౌడర్‌, అచార్‌, అధ్రక్‌లైసన్‌, అల్లంవెల్లులి, తువ్వార్‌దాల్‌, చట్నీలు, శానిటైజర్‌ కిట్లను అందజేశారు. పురుష కార్మికులకు టీ షర్టులు, మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు ఇలాంటి సమయంలో కార్మికులు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరు గుర్తించాలని, కాలనీలలోకి వచ్చే కార్మికులను ప్రజలు సాదరంగా ఆహ్వానించాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కొరమోని నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, కమిషనర్‌ వడ్డె సురేంధర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T10:58:30+05:30 IST