ఎగిరే కారుకు అనుమతులు.. గంటకు 100 మైళ్ల ప్రయాణం!

ABN , First Publish Date - 2021-02-17T02:40:04+05:30 IST

అవును! ఎంతోకాలంగా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగిరే కారుకు అనుమతులు వచ్చేశాయి

ఎగిరే కారుకు అనుమతులు.. గంటకు 100 మైళ్ల ప్రయాణం!

వాషింగ్టన్: అవును! ఎంతోకాలంగా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగిరే కారుకు అనుమతులు వచ్చేశాయి. ఇక, సమీప భవిష్యత్తులో ఆకాశం ఎగిరేకార్లతో రద్దీగా మారిపోతుంది. 10 వేల అడుగుల ఎత్తులో గంటకు 100 మైళ్లు ప్రయాణించే ప్రపంచంలోని తొలి ఎగిరే కారు టేకాఫ్‌కు అధికారిక క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ (ఎఫ్ఏఏ) అనుమతులు మంజూరు చేసింది. 


టెర్రాఫుజియా ట్రాన్సిషన్ ‘రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్’కు ఎఫ్ఏఏ ప్రత్యేక లైట్-స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేసింది. విమానానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు ఈ ‘రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‘లో ఉండడంతో ఈ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ ఎగిరే కారుకు రహదారి అనుమతులు రానప్పటికీ త్వరలోనే అవి కూడా వస్తాయని చెబుతున్నారు. 


ఈ ఎగిరే కారు రెక్కల పొడవు 27 అడుగులు. ముడుచుకుంటే చిన్నపాటి కారుషెడ్డులో కూడా ఇట్టే అమరిపోతుంది. రెండు సీట్ల సామర్థ్యం కలిగిన పూర్తిస్థాయి ఎయిర్, రోడ్డు మోడల్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. పైలట్లు, ఫ్లైట్ స్కూళ్ల కోసం ప్రస్తుతం ఇందులో ఫ్లైట్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ తీసుకోవాలనుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు పైలట్ సర్టిఫికెట్ కూడా ఉండాలని చైనీస్ కంపెనీ అయిన టెర్రాఫుజియా స్పష్టం చేసింది. 


ఈ ఎగిరే కారు తయారీలో పాలు పంచుకున్న బృందానికి టెర్రాఫుజియా అభినందనలు తెలిపింది. ఇప్పటికే ఈ ఎగిరే కారు 80 రోజుల ఫ్లైట్ టెస్టింగ్ పూర్తి చేసుకుందని సంస్థ జనరల్ మేనేజర్ కెవిన్ కోల్‌బర్న్ తెలిపారు. ఎఫ్ఏఏ ఆడిట్ నుంచి 150 టెక్నికల్ డాక్యుమెంట్లు విజయవంతంగా పాసయ్యాయని పేర్కొన్నారు. ప్రాక్టికల్ ఫ్లైయింగ్ కారును అందించాలన్న తమ లక్ష్యాన్ని అమలు చేయడంలో ఇది గొప్ప ప్రయత్నమని వివరించారు. 


ఈ ఫ్లయింగ్ కారు ప్రీమియం గ్యాసోలిన్‌తో కానీ, 100 ఎల్ఎల్ విమాన ఇంధనంతో కానీ పనిచేస్తుంది. కారు హైడ్రాలిక్ మోటార్‌పై పనిచేస్తుంది. నాలుగు చక్రాల హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు, దృఢమైన కార్బన్ ఫైబర్ సేఫ్టీ కేజ్, ఎయిర్‌ఫ్రేమ్ పారాచూట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బరువు 590 కేజీలు. ఇందులో ల్యాండింగ్‌ గేర్, 27 అడుగుల పొడవున్న రెక్కలను అమర్చారు. ఇది విమాన రూపం నుంచి ఒక్క నిమిషంలో కారుగా మారిపోతుంది.

Updated Date - 2021-02-17T02:40:04+05:30 IST