అధ్వానంగా పాయకరావుపేట రోడ్డు

ABN , First Publish Date - 2020-10-20T09:08:29+05:30 IST

జిల్లాలో ఇప్పటికే అధ్వానంగా వున్న రహదారులు...కొద్దిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మరింత దారుణంగా తయారయ్యాయి. గతంలో చిన్నవిగా వున్న

అధ్వానంగా పాయకరావుపేట రోడ్డు

బాబోయ్‌..ఇవేం రోడ్లు!!

అసలే అంతంతమాత్రం...

ఇప్పుడు మరింత దారుణం

వర్షాలు, వరదలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు ఛిద్రం

రూపురేఖలు కోల్పోయిన తారు రోడ్లు 

వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్న గోతులు

రాళ్లు, కంకర తేలడంతో వాహనదారులు, ప్రయాణికుల అగచాట్లు

మారుమూల గ్రామాలకు ఆటోలు బంద్‌

రాత్రిపూట ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్ర వాహన చోదకులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

జిల్లాలో ఇప్పటికే అధ్వానంగా వున్న రహదారులు...కొద్దిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మరింత దారుణంగా తయారయ్యాయి. గతంలో చిన్నవిగా వున్న గోతులు...భారీ వర్షాలు, వరదల కారణంగా మరింత పెద్దవయ్యాయి. పలుచోట్ల రహదారులపై ఏర్పడిన గోతుల్లో వర్షపు నీరు నిలిచి, ఈత కొలనులు, చెరువులను తలపిస్తున్నాయి. రాళ్లు, కంకర తేలిపోయి వాహనదారులతోపాటు పాదచారులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వరదల కారణంగా కొన్నిచోట్ల రహదారులకు గండ్లు పడడం, తారురోడ్డు పూర్తిగా లేచిపోవడం వంటివి జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఇంతవరకు తాత్కాలిక మరమ్మతు పనులు కూడా చేపట్టలేదు. 

పాడేరు-జి.మాడుగుల, అచ్యుతాపురం-గాజువాక, చోడవరం నుంచి చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట మండలాలకు వెళ్లే రహదారులు, కశింకోట మండలం నుంచి బుచ్చెయ్యపేట, రావికమతం మండలాలకు వెళ్లే రోడ్డు, చింతపల్లి నుంచి జీకే వీధి మీదుగా సీలేరు వెళ్లే రోడ్డు, నర్సీపట్నం నుంచి గొలుగొండ, రోలుగుంట, కోటవురట్ల, నాతవరం మండలాలకు వెళ్లే రహదారులతోపాటు మరెన్నో గోతులతో నిండిపోయి వాహనదారులు, ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. గోతుల కారణంగా రాత్రిపూట ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రూరల్‌ ప్రాంతంలోని పలు మండలాల్లో శివారు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఆటోలపైనా ఆధారపడుతుంటారు. అయితే ఆయా రహదారులు గోతులతో రాళ్లు లేచిపోయి అధ్వానంగా వుండడంతో వాహనాలు పాడైపోతాయని ఆటో డ్రైవర్లు రావడం లేదు. దీంతో పలు గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. 


పెంటకోట-వెంకటనగరం రోడ్డులో వాహనచోదకుల పాట్లు

గత వారం కురిసిన వర్షాలకు పాయకరావుపేట మండలంలోని పెంటకోట-వెంకటనగరం రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ రోడ్డులో వెంకటనగరం, రాజానగరం, పాల్మన్‌పేట, కొర్లయ్యపేట, రాజయ్యపేట గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. టీడీపీ హయాంలో సుమారు కోటి రూపాయలతో ఈ రోడ్డు నిర్మించారు. తరువాత నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో ఛిద్రమైంది.


అధ్వానంగా చోడవరం-జన్నవరం రోడ్డు

చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లోని పలు గ్రామాలను కలిపే చోడవరం-పీఎస్‌పేట-జన్నవరం రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా తయారైంది.  రహదారిపై పలుచోట్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పాడ్డాయి. ప్రధానంగా చోడవరం కొత్తూరు జంక్షన్‌ నుంచి పీఎస్‌ పేట చెరకు కాటా వరకు రహదారి...వాహనాలు ప్రయాణించడానికి వీలుకాని విధంగా మారింది. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఆధీనంలో ఉన్న ఈ రహదారికి రెండేళ్ల నుంచి నిర్వహణ పనులు చేయడం లేదు.   


కోతకు గురైన కొంగసింగి రోడ్డు

భారీవర్షాలు, వరదల కారణంగా గొలుగొండ మండలంలోని పలు రహదారులపై భారీగోతులు ఏర్పడ్డాయి. కృష్ణాదేవిపేట-కొంగసింగి రహదారిని నాలుగేళ్ల క్రితం రూ.1.5 కోట్లతో అభివృద్ధి చేశారు. పాతకృష్ణాదేవిపేట రహదారికి మూడేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. రెండు, మూడు నెలల్లో పాడైపోయి గోతులు ఏర్పడ్డాయి. అధికారులు తాత్కాలిక మరమ్మతు పనులు కూడా చేపట్టడం లేదు. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.


నగరంలో దారుణం

ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని రహదారులన్నీ దెబ్బతిన్నాయి. నగరం మధ్య నుంచి వెళ్లే జాతీయ రహదారితోపాటు ఇతర ప్రధాన రహదారులు సైతం బాగా పాడైపోయాయి. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడ్డాయి. డెయిరీ ఫారం జంక్షన్‌ నుంచి ఎన్‌ఏడీ కూడలి వరకూ జాతీయ రహదారి బాగా దెబ్బతింది. అలాగే శంకరమఠం రోడ్డు, డాబాగార్డెన్స్‌లోని ప్రధాన రహదారి, అక్కయ్యపాలెం 80 ఫీట్‌ రోడ్డు నుంచి కంచరపాలెం మెట్టు వైపు వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారై...ప్రయాణానికి ఇబ్బందికరంగా తయారయ్యాయి. 

సబ్బవరం-చోడవరం రహదారిలో లింగాలతిరుగుడు వద్ద, పినగాడి-కె.కోటపాడు రోడ్డులో మొగలిపురం, మలునాయుడుపాలెం, గుల్లేపల్లి, అయ్యన్నపాలెం గ్రామాల వద్ద రహదారులు అధ్వానంగా ఉన్నాయి. 

పద్మనాభం మండలంలోని అనంతవరం-అలమండ రహదారి, రెడ్డిపల్లి ప్రధాన రహదారి నడవడానికి సైతం వీలులేని విధంగా తయారయ్యాయి. 


Updated Date - 2020-10-20T09:08:29+05:30 IST