కోవిడ్ సోకిన గబ్బిలం 2017లో కరిచింది : వూహన్ ల్యాబ్ సైంటిస్ట్

ABN , First Publish Date - 2021-01-17T22:01:17+05:30 IST

సజీవంగా ఉన్న వైరస్‌లపై పరిశోధన చేసే చైనా శాస్త్రవేత్తలు చాలా

కోవిడ్ సోకిన గబ్బిలం 2017లో కరిచింది : వూహన్ ల్యాబ్ సైంటిస్ట్

న్యూఢిల్లీ : లైవ్ వైరస్‌లపై పరిశోధన చేసే చైనా శాస్త్రవేత్తలు చాలా అజాగ్రత్తగా ప్రవర్తించినట్లు వెల్లడవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిబంధనలను పాటించకుండా, గ్లోవ్స్, మాస్క్‌లు ధరించకుండా ఓ గుహలో నమూనాలను సేకరించినట్లు బయటపడింది. ఈ గుహలో కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు అంగీకరించారు. దీంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూ హెచ్ఓ బృందం ఈ ప్రశ్నలను లేవనెత్తేందుకు అవకాశం ఏర్పడింది. 


చైనాలోని వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు గతంలో ఓ గుహలో గబ్బిలాల నమూనాలను సేకరించారు. కరోనా వైరస్ సోకిన గబ్బిలాలకు కేంద్రంగా ఈ గుహ ఉంది. ఈ నమూనాల సేకరణలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తమను ఈ వైరస్ సోకిన గబ్బిలాలు కుట్టినట్లు అంగీకరించారని ఆదివారం అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తన రబ్బర్ గ్లోవ్స్‌లోకి ఓ గబ్బిలం కోర సూదిలాగా గుచ్చుకుందని ఓ శాస్త్రవేత్త చెప్పారని మీడియా పేర్కొంది. ఈ సంఘటన 2017లో జరిగిందని ఆ శాస్త్రవేత్త చెప్పారని పేర్కొంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చాలా రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ సంస్థలోని సిబ్బంది కూడా డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను పాటించకుండా గబ్బిలాలతో వ్యవహరించారని చైనీస్ టీవీ సిబ్బంది సేకరించిన ఓ వీడియోలో బయటపడింది. ఈ వీడియో ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేయడానికి రెండేళ్ళ ముందు అంటే, 2017లో ప్రసారమైంది. ఓ శాస్త్రవేత్త తన చేతులకు ఎటువంటి గ్లోవ్స్ లేదా ఇతర రక్షణ లేకుండా గబ్బిలాన్ని పట్టుకున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఓ రీసెర్చర్ మాట్లాడుతూ, ఓ గబ్బిలం తన చేతికిగల రబ్బర్ గ్లోవ్స్‌లోపలికి తన కోరను సూదిలాగా గుచ్చిందని చెప్పారు. దీంతో ఈ శాస్త్రవేత్తలకు అప్పట్లోనే కరోనా వైరస్ సోకిందా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆ వైరస్ కోవిడ్-19 అయినా కావచ్చుననే ఆలోచన వస్తోంది. 


ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ బృందం వూహన్‌లో కోవిడ్-19కు మూలమైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ బృందం మరింత క్షుణ్ణంగా పరిశీలన జరపవలసిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. కోవిడ్-19 వ్యాధికి కారణమైన నోవల్ కరోనా వైరస్‌ను మొదట వూహన్‌లో 2019 చివర్లో గుర్తించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-01-17T22:01:17+05:30 IST