యాస్ తుపాను : ఒడిశాలోని క్షిపణి పరీక్షా కేంద్రాలకు గట్టి రక్షణ చర్యలు

ABN , First Publish Date - 2021-05-26T03:51:05+05:30 IST

ఒడిశాలోని క్షిపణి పరీక్షా కేంద్రాలకు యాస్ తుపాను వల్ల నష్టం

యాస్ తుపాను : ఒడిశాలోని క్షిపణి పరీక్షా కేంద్రాలకు గట్టి రక్షణ చర్యలు

భువనేశ్వర్ : ఒడిశాలోని క్షిపణి పరీక్షా కేంద్రాలకు యాస్ తుపాను వల్ల నష్టం జరగకుండా నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకున్నట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధికారి మిలన్ కుమార్ పాల్ తెలిపారు. చండీపూర్, అబ్దుల్ కలాం ఐలండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌ (ఐటీఆర్)ను కాపాడేందుకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు వివరించారు. 


ఐటీఆర్‌కు చండీపూర్‌లో మూడు మిసైల్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. అబ్దుల్ కలాం ఐలండ్‌లో ఒక లాంచ్ కాంప్లెక్స్ ఉంది. వీటికి అదనంగా రెండు వేర్వేరు మిషన్ కంట్రోల్ రూమ్స్, బ్లాక్ హౌసెస్ ఉన్నాయి. ఈ ఐలండ్ వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యంగలది. లాంగ్ రేంజ్ మిసైల్స్‌ ప్రయోగానికి ఇది కీలకమైనది. ఐటీఆర్ నుంచి 80 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ఐలండ్ ఉంది. యాస్ తుపాను ప్రభావం దీనిపై పడవచ్చునని అంచనా వేస్తున్నారు. 


పెను తుపాను నుంచి ఐటీఆర్‌ను రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు మిలన్ తెలిపారు. డీఆర్‌డీవో రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన వ్యవస్థకు భద్రత కల్పించామని, ముఖ్యమైన పరికరాలను ప్రయోగశాలల లోపల భద్రపరిచామని వివరించారు. 


విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, గంటకు 400 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పటికీ తట్టుకునే విధంగా కంట్రోల్ రూమ్, బ్లాక్ హౌస్‌లను నిర్మించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-05-26T03:51:05+05:30 IST