Abn logo
Oct 23 2021 @ 00:27AM

యాదాద్రి శరవేగంగా

జలకళ, ఆధ్యాత్మికతను సంతరించుకున్న లక్ష్మీపుష్కరిణి, ముఖద్వారం

తుది దశకు లక్ష్మీపుష్కరిణి

కొనసాగుతున్న కల్యాణకట్ట పనులు

గర్భాలయ ముఖద్వారానికి స్వర్ణ కవచాల అమరిక


యాదాద్రి టౌన్‌ : యాదాద్రి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం ఖరారు కావడంతో పెండింగ్‌ పనులను అధికారులు వేగవంతం చేశారు. కొండకింద విష్ణుపుష్కరిణి, మొక్కు తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట, గర్భాలయ ముఖద్వారానికి స్వర్ణ కవచాల అమరిక పనులు వేగవంతమయ్యాయి.

 సీఎం కేసీఆర్‌ ఈ నెల 19న యా దాద్రిని సందర్శించి ఆలయ ఉద్ఘాటన ముహూర్తాన్ని ప్రకటించారు. ముహూర్తంలోగా అన్ని పనులు పూర్తిచేయాలని వైటీడీఏ అధికారులను ఆదేశించారు. దీంతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కొండకింద గం డిచెరువు(లక్ష్మీతటాకం) సమీపంలో సకల వసతులతో మొ క్కు తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట పనులను వైటీడీఏ అధికారులు వేగిరం చేశారు. గండి చెరువు సమీపంలో సుమారు 2.27 ఎకరాల్లో రూ.13.99కోట్ల అంచనా వ్యయంతో 47వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కల్యాణకట్టను నిర్మిస్తున్నారు. ఈ పనులు ఆర్‌అండ్‌బీ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఇక్కడ స్త్రీ, పురుషులకు వేర్వేరుగా అధునాతన సదుపాయాలతో క్షౌరశాలలు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నారు. పురుషులు 360 మంది ఒకేసారి, స్త్రీలు 160 మంది మొక్కు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భవన నిర్మాణం పూర్తికాగానే క్షౌరశాల, భక్తుల వెయిటింగ్‌ హాల్స్‌, లాకర్‌ రూమ్‌, టికెట్‌ కౌంటర్‌, టాయిలెట్లతోపాటు పలు మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయి. కల్యాణకట్టకు ముందు భాగంలోని సిమెంటు పిల్లర్లపై ఏనుగులు, లతల డిజైన్లను అమర్చే పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యారు.


 ఆధ్యాత్మిక సొబగులతో లక్ష్మీపుష్కరిణి

భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు కొండకింద గండిచెరువు సమీపంలో లక్ష్మీపుష్కరిణిని ఆధ్యాత్మిక సొబగులతో తీర్చిదిద్దుతున్నారు. సుమారు 2.47ఎకరాల్లో రూ.11.5కోట్ల అంచనా వ్యయంతో 38,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో లక్ష్మీపుష్కరిణిని నిర్మిస్తున్నారు. పుష్కరిణిలో ఒకేసారి 2500 మంది పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లుచేశారు. సుమారు నాలుగు అడుగుల లోతులో 15లక్షల లీటర్ల నీరు పట్టేలా నిర్మించారు. అదేవిధంగా పుష్కరిణిలోని నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసేందుకు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. పుష్కరిణి వద్ద టాయిలెట్లు, షవర్లు, దుస్తులు మార్చుకునే గదులను స్త్రీ, పురుషులకు వేర్వేరుగా నిర్మించారు. కల్యాణకట్ట వద్ద మొక్కుతలనీలాలు సమర్పించుకున్న భక్తులు నేరుగా లక్ష్మీపుష్కరిణికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పా ట్లు చేశారు. అదేవిధంగా పుష్కరిణి వద్ద రెండు మండపాలు నిర్మించి అమ్మవారి విగ్రహాలు ఏర్పాటుచేశారు. పుష్కరిణికి ఆధ్యాత్మిక సొబగులు దిద్దేపనులు తుది దశకు చేరుకున్నాయి. పుష్కరిణి ముందు స్వాగత తోరణం, ఇరువైపులా గరుడ, ఆం జనేయ విగ్రహాలు, పైభాగంలో హంసలు, లతలు, ప్రహరీపై ఎలిఫెంట్‌ ప్యానళ్లు ఏర్పాటుచేస్తున్నారు. పనులను వైటీడీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లక్ష్మీపుష్కరిణి, ఆర్టీసీ, దేవస్థాన బస్‌ టర్మినల్‌కు వెళ్లే దారి లో యంత్రాల సహాయంతో శుక్రవారం మెటల్‌ పరిచారు. అనం తరం బ్లాక్‌టాప్‌ పనులు కొన సాగుతాయని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. కొండపైన ఉత్త ర దిశలో రిటైనింగ్‌వాల్‌ పనులు తుది దశకు చేరుకోవడంతో ఈ ప్రాంతంలో బస్‌బే నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు మట్టి చదునుచేసే పనులు చేపట్టారు. విష్ణుపుష్కరిణి పక్కన ఎస్కలేటర్‌ పనులు కొనసాగుతున్నాయి. దీని సహాయంతో భక్తులు క్యూకాంప్లెక్స్‌ నుంచి కాకుండా నేరుగా లోహపు దర్శన క్యూలైన్ల వద్దకు చేరుకోవచ్చు.


తుది దశకు స్వర్ణ కవచాల పనులు

యాదాద్రీశుడు కొలువైన గర్భాలయ ముఖద్వారానికి స్వర్ణ కవచాలను అమర్చే పనులు తుది దశకు చేరుకున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా ప్రదర్శన కోసం ముఖద్వారానికి బంగారు రేకులను అమర్చారు. వీటితో ఆధ్యాత్మికశోభ సంతరించుకుందని వైటీడీఏ అధికారులను, కళాకారులను సీఎం ఈ సందర్భంగా అభినందించారు. కాగా, ప్రస్తుతం ఈ పనులు తుదిదశకు చేరాయి. సుమారు 14కిలోల బంగారంతో చెన్నైకి చెందిన స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ గర్భాలయ ముఖద్వారానికి బంగారు తాపడం పనులు నిర్వహిస్తుండగా, అదే రాష్ట్రానికి చెందిన స్వర్ణ కళాకారుడు రవీంద్రన్‌ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. కాగా, ఈ పనులను ఈవో గీతారెడ్డి శుక్రవారం పరిశీలించారు.