వైసీపీ ఆధిపత్య పోరులో పొదిలి తహసీల్దార్‌ బలి

ABN , First Publish Date - 2021-07-30T05:17:06+05:30 IST

పొదిలిలో అధికార పార్టీ వైసీపీ నాయకుల ఆటలకు రెవెన్యూ అధికారులు నిలువునా బలవుతున్నారు. భూఆక్రమణల పర్వంలో అధికారపార్టీ నేతల ఆధిపత్య పోరు దెబ్బకు మరో రెండురోజుల్లో ఉద్యోగ విరమణ పొందనున్న తహసీల్దార్‌ హనుమంతరావు ఉద్యోగం పోగొట్టుకున్నారు.

వైసీపీ ఆధిపత్య పోరులో పొదిలి తహసీల్దార్‌ బలి

ఉద్యోగ విరమణ చివరి రోజుల్లో దెబ్బ

అధికార పార్టీ నేత వెంచర్‌పై ఆ పార్టీలోని కీలక నాయకుడి కన్ను

అమ్మాలని ఒత్తిడి చేసినా దక్కని ప్రయోజనం

వెంచర్‌లో ప్రభుత్వ భూమి ఉందని ఆగమేఘాల మీద సర్వే చేసి రాళ్ల తొలగింపు

ఈ వ్యవహారంలో ఉపేక్షించారంటూ తహసీల్దార్‌ సస్పెండ్‌ చేయించిన ముఖ్య నేత

పొదిలి రూరల్‌, జూలై 29 : పొదిలిలో అధికార పార్టీ వైసీపీ నాయకుల ఆటలకు రెవెన్యూ అధికారులు నిలువునా బలవుతున్నారు. భూఆక్రమణల పర్వంలో అధికారపార్టీ నేతల ఆధిపత్య పోరు దెబ్బకు మరో రెండురోజుల్లో ఉద్యోగ విరమణ పొందనున్న తహసీల్దార్‌ హనుమంతరావు ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఆయనతోపాటు ఏఆర్‌ఐ శివరాం, కంభాలపాడు వీఆర్వో కుమార్‌ను కలెక్టర్‌ గురువారం సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకెళ్తే... పొదిలి నుంచి మార్కాపురం వెళ్లే అడ్డరోడ్డు వద్ద గతంలో వెంచర్‌ వేశారు. అప్పట్లో ప్లాట్లకు పెద్దగా డిమాండ్‌ లేకపోవడంతో అదికాస్త మరుగునపడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్‌ వ్యాపారం ఊపందుకోవడంతో ఆ వెంచర్‌కు విలువ పెరిగింది. ఆ వెంచర్‌ను వైసీపీ నాయకుడు కొనుగోలు చేశారు. ఆ భూమిపై ఆ పార్టీకే చెందిన మరో ముఖ్య నేత కుటుంబ సభ్యులు కూడా కన్నేశారు. అందులో కొంత ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుసుకుని తమకు అమ్మాలని బెదిరించసాగారు. అందుకు ఆ నేత ససేమిరా అనడంతో ఆ ముఖ్యనేత అధికారులపై ఒత్తిడి పెంచి 48గంటల్లో సర్వే చేయించారు. ప్రభుత్వ భూమి 23 సెంట్లు ఉన్నట్లు తేల్చారు. అనధికార వెంచర్‌ అంటూ అధికారులపై ఒత్తిడి చేసి రాళ్లు కూడా పీకించారు. అప్పట్లో దానిపై తీవ్ర చర్చ జరిగింది. ఈ విషయంలో తహసీల్దార్‌ అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి గురయ్యారని, పట్టణంలో చాలా చోట్ల ఆక్రమణలున్నా ఈ ఒక్క వెంచర్‌ మాత్రమే కనిపించిందా అంటూ ప్రజలు చర్చించుకున్నారు. ఆ వెంచర్‌ను మొదట కొనుగోలు చేసిన వైసీపీ నేత.. తాము చెప్పినట్లు తమకు అమ్మలేదన్న సాకుతోనే అదే పార్టీకి చెందిన ముఖ్య నేత కుటుంబ సభ్యులు ఆ వెంచర్‌ను అక్రమ లేఅవుట్‌ అంటూ రాళ్లు పీకించారనే చర్చ నడిచింది. ఈ ఆధిపత్య పోరు అంతటితో ఆగలేదు. లేఅవుట్‌ అక్రమంగా వేసినా తహసీల్దార్‌ ఉపేక్షించారన్న నెపంతో ఆయన్ను సస్పెండ్‌ చేయించేంత వరకూ వెళ్లడం గమనార్హం. ఆధిపత్య పోరులో నెగ్గేందుకు వైసీపీ నాయకులు అధికారులను కూడా బలితీసుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో అధికార పార్టీ నాయకుల అనుచరులు ఇప్పటికే భవనాలు నిర్మించినా పట్టించుకోని ఉన్నతాధికారులు కేవలం వెంచర్‌ వేశారని, అందులో కొంత పోరంబోకు భూమి ఉందని నెలాఖరులో ఉద్యోగ విరమణ కానున్న అధికారిని బలి తీసుకోవడం చర్చనీయాంశమైంది.


భూ కబ్జాలను అరికట్టడంలో విఫలం

ముగ్గురు అధికారుల సస్పెండ్‌

పొదిలి, జూలై 29 : పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కంభాలపాడులో ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో విఫలమైన రెవెన్యూ అధికారులపై వేటు పడింది. సర్వే నెంబర్‌ 82-ఏ1, 82-2, 82-4తో పాటు 82-5లో తోపు పోరంబోకు భూములను కాపాడడంలో విఫలమైనందుకు ఎస్‌డీసీ శ్రీదేవి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు తహసీల్దార్‌ ఏవీ హనుమంతరావు, ఆర్‌ఐ శివరాం, కంభాలపాడు వీఆర్వో కుమార్‌లను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భూములలో అనధికారకంగా లేఅవుట్లు, రోడ్లు వేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఈ విషయమై సంబంధిత అధికారులపై వేటు వేశారు. తహసీల్దార్‌ ఏవీ హనుమంతరావు మరో రెండు రోజులలో ఉద్యోగ విరమణ చేయనుండడంతో సస్పెండ్‌ ఉత్తర్వులు అందడం గమనార్హం.

Updated Date - 2021-07-30T05:17:06+05:30 IST