‘నేను జెండాలు మార్చేవాడిని కాదు.. అవసరమైతే గన్నవరంలో నేనే ఎన్నికల్లో పోటీచేస్తా..’

ABN , First Publish Date - 2020-08-24T15:58:00+05:30 IST

‘వైసీపీ కార్యకర్తలను బెదిరించడానికి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు. కార్యకర్తలకు అండగా ఉంటా. కొద్ది రోజుల్లో శుభవార్త వింటారు. అవసరమైతే నేనే ఎన్నికల్లో పోటీ చేస్తా..’ అని వైసీపీ పొలిటికల్‌ సలహా కమిటీ సభ్యుడు, గన్నవరం నియోజకవర్గ నేత దుట్టా రామచంద్రరావు

‘నేను జెండాలు మార్చేవాడిని కాదు.. అవసరమైతే గన్నవరంలో నేనే ఎన్నికల్లో పోటీచేస్తా..’

కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు

కార్యకర్తలతో గన్నవరం వైసీపీ నేత దుట్టా 


హనుమాన్‌జంక్షన్‌/గన్నవరం (కృష్ణా జిల్లా): ‘వైసీపీ కార్యకర్తలను బెదిరించడానికి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు. కార్యకర్తలకు అండగా ఉంటా. కొద్ది రోజుల్లో శుభవార్త వింటారు. అవసరమైతే నేనే ఎన్నికల్లో పోటీ చేస్తా..’ అని  వైసీపీ పొలిటికల్‌ సలహా కమిటీ సభ్యుడు, గన్నవరం నియోజకవర్గ నేత దుట్టా రామచంద్రరావు అన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆదివారం దుట్టా తన గృహంలో బాపులపాడు మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తేనే తాను ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌తో కలిశానన్నారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, పదవుల పంపకాల్లో సైతం వైసీపీ కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అలా చేస్తేనే తాను సహకరిస్తానని చెప్పానన్నారు. వైసీపీ కార్యకర్తలతో  కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చిన మీదటే తాను వంశీతో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డానన్నారు. 


కాలక్రమంలో జెండాలు మోసిన కార్యకర్తలకు అన్యాయం జరిగేలా ఉందని తెలుసుకుని, ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక వంశీమోహన్‌కు దూరంగా ఉన్నానన్నారు. ‘నేను జెండాలు మార్చినవాడిని కాదు. నాది ఒకే జెండా.. వైసీపీ జెండా. నా తరువాత నా బిడ్డలు కూడా వైసీపీ వెంటే. జగన్‌ వెంటే ఉండాలనుకునే వాడిని. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఎన్నో కేసులు పెట్టారు. భయపడలేదు. ఇపుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’ అన్నారు. సమావేశంలో గన్నవరం మాజీ ఏఎంసీ చైర్మన్‌ కోటగిరి వర ప్రసాదరావు,  పాతూరి  వెంకటరావు, దుట్టా రవిబాబు, తవ్వా మూర్తి, సూరపనేని రాధా కృష్ణమూర్తి, యనమదల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-24T15:58:00+05:30 IST