హోదా తేలేని వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2021-06-20T05:54:25+05:30 IST

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని వైసీపీ ఎంపీలు, సీఎం జగన్‌ రాజీనామా చేయాలని టీడీపీ రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు.

హోదా తేలేని వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

సబ్‌కలెక్టరేట్‌ వద్ద టీడీపీ నాయకుల నిరసన


మదనపల్లె టౌన్‌, జూన్‌ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేని వైసీపీ ఎంపీలు, సీఎం జగన్‌ రాజీనామా చేయాలని టీడీపీ రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు శనివారం సబ్‌కలెక్టరేట్‌ వద్ద మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ తమకు 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్‌.. 22 మంది ఎంపీలు గెలిచినా తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడటానికి వాక్సినేషన్‌కు నిధులు మంజూరు చేయడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాజంపేట ఎంపీగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న మిఽథున్‌రెడ్డి కడప-బెంగళూరు రైలు మార్గానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించలేక పోయారన్నారు. కనీసం ఈ విషయాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావించకుండా  తన చేతకాని తనం నిరూపించుకున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ మాట్లాడుతూ... తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. పుంగనూరు టీడీపీ నేత శ్రీనాఽథరెడ్డి మాట్లాడుతూ...  వాక్సిన్‌ను కొనుగోలు చేసి సత్తా ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు మాట్లాడుతూ... నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వైసీపీ నేతలు తమ మోసపు మాటలతో మభ్యపెడుతున్నారన్నారు. అనంతరం సబ్‌కలెక్టరేట్‌ డీఏవో శేషయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగురైతు విభాగం నాయకుడు రాటకొండ మధుబాబు, కార్యదర్శి ఖాదర్‌బాషా, దొరస్వామినాయుడు, సిద్దప్ప, ఆర్‌జే వెంకటేష్‌, ఎస్‌ఏ మస్తాన్‌, పఠాన్‌ఖాదర్‌ఖాన్‌, సోమశేఖర్‌, ఎస్‌ఎం రఫి, దాదు, బావాజాన్‌, పూల మురళి, విజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:54:25+05:30 IST