Abn logo
Apr 9 2021 @ 01:48AM

ఇష్టారాజ్యంగా...

కిర్లంపూడి మండలం కృష్ణవరంలో టీడీపీ నాయకుడి ఇల్లు, బైక్‌లను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన దృశ్యం

  • జడ్పీ ఎన్నికల్లో చెలరేగిపోయిన వైసీపీ
  • తుని రూరల్‌ మండలం ఎన్‌.సూరవరంలో అనుచరులతో కలిసి కీలక నేత రిగ్గింగ్‌
  • టీడీపీకి మొగ్గు నేపథ్యంలో పోలింగ్‌బూత్‌కు తాళాలు బిగించి యథేచ్ఛగా బరితెగింపు
  • లక్ష్మీవాడ బూత్‌లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసిన బ్యాలెట్‌తో ఫోటో దిగి సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌
  • చెయ్యేరులో ఏకంగా బ్యాలెట్‌ పత్రాలు పట్టుకుపోయిన గ్రామ వలంటీరు
  • ఉప్పలగుప్తంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పోలింగ్‌ ఏజెంట్‌గా గ్రామ వలంటీర్‌ 
  • పిఠాపురం బి.ప్రత్తిపాడులో దొంగ ఓట్లు వేసే విషయంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల ఘర్షణ
  • పలుచోట్ల బయట నుంచి బ్యాలెట్‌ పేపర్లను బూత్‌ల్లోకి తెచ్చిన వైసీపీ నేతలు
  • బరిలో టీడీపీ లేకపోవడంతో యథేచ్ఛగా బూత్‌ల వద్ద వైసీపీ నేతలు, అభ్యర్థులు, వలంటీర్ల ప్రచారం
  • అడ్డగోలుగా బరితెగించి పోలింగ్‌ అయ్యే వరకు స్లిప్పుల పేరుతో ఓటర్లకు నగదు పంపిణీ

ఎక్కడికక్కడ బెదిరింపులు.. ఆగడాలు.. అరాచకాలు.. అడ్డేలేదన్న ధైర్యంతో అడ్డగోలుగా రిగ్గింగ్‌లు.. పోలింగ్‌ బూత్‌ల్లోకి నేరుగా సెల్‌ఫోన్లతో ప్రవేశాలు.. ఏకంగా బ్యాలెట్‌ పత్రాలతో సెల్ఫీలు.. ఇంకొన్నిచోట్ల బయట నుంచి బ్యాలెట్‌ పత్రాలు నేరుగా లోపలకు తీసుకువెళ్లి బ్యాలెట్‌ బాక్సుల్లో పడేయడం... నిబంధనలకు తూట్లు పొడిచి పోలింగ్‌ కేంద్రం వద్దే స్లిప్పుల పంపిణీ సాకుతో నగదు పంపకాలు.. క్యూలైన్ల వద్ద ప్రచారాలు.. ఏకంగా వలంటీర్లే అభ్యర్థుల తరపున ఏజెంట్లుగా అవతారం ఎత్తడం.. అటు ఓటర్లను నేరుగా ప్రలోభాలకు గురిచేయడం కోసం బియ్యం పంపిణీ వాహనాలు పోలింగ్‌ స్టేషన్ల  వద్దే రోజంతా మోహరించడం.. ఇలా ఒకటేంటీ...అడుగడుగునా ఇష్టారాజ్యంగా అధికార వైసీసీ జడ్పీ ఎన్నికల రోజు బరితెగించింది. ఎదురేలేదన్నట్టు వ్యవహరించింది. ప్రతిపక్ష టీడీపీ ఎన్నికలు బహిష్కరించడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆ పార్టీ నేతలు,అనుచరులు లేకపోవడంతో అదే అదనుగా జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఇష్టారీతిన చెలరేగిపోయి ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేయించుకుంది.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది మొదలు అధి కార వైసీసీ నేతలు ఎక్కడికక్కడ రెచ్చిపోయారు. పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్య ర్థులు, నేతలు, వీరికితోడు గ్రామవలంటీర్లు యథేచ్ఛగా వ్యవహరించి ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో నిబంధనలకు తూట్లు పొడిచి వ్యవహరించినా పోలింగ్‌ అధికారులు, పోలీసులు కళ్లప్పగించి కూర్చున్నారు. దీంతో స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు కాస్తా వైసీపీ కనుసన్నల్లో పూర్తయ్యాయి. తుని రూరల్‌లోని ఎన్‌.సూరవరంలో ఏకంగా ఆ పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్‌ సరళి ప్రకారం స్థానికం గా టీడీపీ అభ్యర్థి ఎంపీటీసీగా గెలిచే అవకాశం ఉందని అంచనా వేసిన నేతలు వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్‌లో పరిస్థితి వివరించారు. దీంతో కీలకనేత తన అనుచరులతో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలింగ్‌ బూత్‌కు వచ్చి బయట తాళాలు వేయించి లోపల యథేచ్ఛగా వ్యవహరించారు. అడ్డుకున్న ఇద్దరు టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లపై చేయి చేసుకున్నారు. అనంతరం లోపలకు ఎవరినీ రానీయకుండా బ్యాలెట్‌ బాక్సులను ఆధీనంలోకి తీసుకుని చెలరేగిపోయారు. అయితే పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగితే దీనికి పోలీసులు బయట కాపలా కాశారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వీరిని పోలింగ్‌ కేంద్రం వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు బూత్‌ వద్ద దొంగ ఓట్లు భారీగా పడ్డాయి. అధికారుల సాయంతో జరిగిన ఈ వ్యవహారంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఏకంగా మేం ఎక్కువ దొంగ ఓట్లు వేశామంటే మేం ఎక్కువ అంటూ తన్నుకున్నాయి. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు లక్ష్మీవాడ పోలింగ్‌బూత్‌లో ఏకంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బ్యాలెట్‌పత్రంపై ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి అనంతరం వాటితో ఫోటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఇలా చేయడం అత్యంత నేరం. సెల్‌ఫోన్‌ బూత్‌ లోపలకు తీసుకువచ్చి ఫోటో తీసే వరకు అధికారులు కళ్లప్పగించి చూడ్డం విశేషం. ఇది ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో ప్రసారం కావడంతో పోలీసులు విచారణ జరిపారు. బాధ్యుల్లో వెంకటరమణ అనే వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదుచేసి అరెస్ట్‌ చేశారు. అయితే నిందితులు తమకు తెలియకుండా ఫోటోలు తీశారని పోలీసు విచారణలో ఎన్నికల సిబ్బంది చెప్పి తప్పించుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్‌ ఇతడి ఓటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే మండలం చెయ్యేరు హైస్కూళ్లో 56/2 బూత్‌లో గ్రామ వలంటీర్‌ ఓటు వేయకుండా తనకు ఇచ్చిన రెండు బ్యాలెట్‌ పత్రాలను బయటకు తీసుకుపోయాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఉప్పలగుప్తం మండలంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పోలింగ్‌ ఏజెంట్‌గా గ్రామవలంటీర్‌ వ్యవహరించారు. ఇలా అనుమతి ఇవ్వడం కుదరదు. అయినప్పటికీ అధికారులు ఏజెంట్‌గా వ్యవహరించడానికి అనుమతించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ వాట్సాప్‌ గ్రూపులో ఫ్యాన్‌ గుర్తుకు ఓటే సిన బ్యాలెట్‌ పత్రాల ఫోటోలు రోజంతా హల్‌చల్‌ చేశాయి. వీటిని నియోజకవర్గం లో వందలాదిమందికి పంపి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి రావాలని ప్రచారం జరిపారు. పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో 24 చోట్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు సానుకూలంగా ఓట్లు పడుతుండడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఓటర్లను వలంటీర్ల సాయంతో బెదిరించారు. టీడీపీకి ఓటు వేస్తే పథకా లు నిలిచిపోతాయని ఏకంగా బూత్‌ల వద్ద బెదిరించారు. దీంతో చాలావరకు బెదిరింపులు వైసీపీకి పనిచేశాయి. ఇలా అనేకచోట్ల యథేచ్ఛగా వైసీపీ నేతలు వ్యవహరించారు. బరిలో టీడీపీ లేకపోవడంతో అనేకచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు, అభ్యర్థులు కనిపించ లేదు. ఇదే అదనుగా వైసీపీ అభ్యర్థులు క్యాడర్‌తో కలిసి పోలింగ్‌ బూత్‌ల్లో ప్రచారం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ కేంద్రాల్లోపల వైసీపీకి ఓటు వేయమంటూ ప్రచారం నిర్వహించారు. అయినా పోలింగ్‌ అధికారులు, పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. అటు కాకినాడ, పెద్దాపురం, అమలాపురం, రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని అనేక మండలాల్లో గ్రామ వలంటీర్లు నేరుగా ప్రచారం చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు స్లిప్పులు పంచే సాకుతో అక్కడే ఉండి ప్రచారం నిర్వహించారు. ఇదేంటని పోలింగ్‌ అధికారులను నిలదీసిన చోట వాళ్లు ఓటు వేయడానికి వచ్చినందున అభ్యంతరం వ్యక్తం చేయలేమని చెప్పి తప్పించుకున్నారు. అనపర్తి, మండపేట, రామచంద్రపురం, కాకినాడ రూరల్‌, రాజోలు, రాజానగరం, రాజమహేంద్రవ రం రూరల్‌, తుని, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో పోలింగ్‌బూత్‌ లోపలికి వెళ్లిన ఓటర్లకు స్లిప్పులు తప్పుగా ఉన్నాయని పక్కన ఓ చిరునామా చెప్పి వెనక్కు పంపించారు. అక్కడ కొత్తగా స్లిప్పులతోపాటు ఓటుకు వైసీపీ నేతలు రూ.500 చొప్పున పంచారు. వందలాది పోలింగ్‌ కేంద్రాలకు ఆనుకుని ప్రభుత్వ రేషన్‌ బియ్యం పంపిణీ చేసే వాహనాలను ఓటర్లను ప్రలోభపెట్టడం కోసం రోజంతా అక్కడే నిలిపి ఉంచారు. మరోపక్క 12 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైసీపీకి ఓటువేయాలని ప్రచారం చేస్తూ నగదు పంచారు. అనపర్తి, మండపేట, ముమ్మిడివరం, కాకినాడ రూరల్‌, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పోలింగ్‌ రోజు ఓటుకు రూ.500, చీర, స్వీటు ప్యాకెట్టు పంపిణీ చేశారు.

రాత్రి నుంచి సాయంత్రం వరకు అదే పని..

టీడీపీ, జనసేన నేతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు బుధవారం అర్ధ రాత్రి నుంచి పోలింగ్‌ పూర్తయిన గురువారం సాయంత్రం వరకు రెచ్చిపోయారు. పోలీసుల సాయంతో అడ్డగోలుగా వ్యవహరించారు. టీడీపీ, వైసీపీ నేతల ఇళ్లపై దాడులు, దౌర్జన్యాలకు దిగారు. అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో జనసేన పార్టీ తరపున చురుగ్గా తిరుగుతున్నాడనే కక్షతో జనసేన కార్యకర్త ద్విచక్రవాహనానికి బుధవారం అర్ధరాత్రి నిప్పంటించారు. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో బుధవారం అర్ధరాత్రి వైసీపీ-టీడీపీకి చెందిన ఇద్దరి నేతల మధ్య ఘర్షణ జరగ్గా, ఆగ్రహంతో టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి బైకులు, ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. మామిడికుదురు మండలం పెదపట్నంలంక-సత్తెమ్మపేటలో జనసేన నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. అనంతరం ఇరువర్గాల దాడుల్లో కొందరికి గాయాలయ్యాయి. పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడులో వైసీపీ సర్పంచ్‌ వర్గానికి చెందిన ఓ వ్యక్తి బ్యాలెట్‌ పత్రంతో పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు రావడంతో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. విరవాడలో జనసేన కార్యకర్తపై వైసీపీ వర్గీయుడు దాడికి దిగారు. బుధవారం అర్ధరాత్రి పన్నెండు తర్వాత నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో పెద్దఎత్తున నగదు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో పోలీసుల సాయంతో టీడీపీ నేతలు ఇళ్ల నుంచి రాకుండా కట్టడి చేసి వైసీపీ నేతలు నగదు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌, పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, తుని, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, అనపర్తి తదితర నియోజకవర్గాల్లో కోట్లలో నగదు పంపకాలు జరిగాయి. వీటిని అడ్డుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను కోడ్‌ ఉల్లంఘన పేరుతో పోలీసు స్టేషన్లకు తరలించారు.

Advertisement
Advertisement
Advertisement