పసుపు రైతు దిగాలు

ABN , First Publish Date - 2021-11-30T04:50:00+05:30 IST

జిల్లాలోని పసుపు రైతులకు ఇటీవల కురిసిన అధిక వర్షాలు ఆందోళన గురిచేస్తున్నాయి. పంట చేళల్లో వర్షపు నీరు నిలచి పంటకు తెగుళ్లు సోకి కొమ్ము ఎదుగుదల నిలిచిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పసుపుకు డిమాండ్‌ ఉన్నా.. పంట దిగుబడి తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.భారీ వర్షాలతో పంట నీట మునగడం, భూమి తడిఆరకపోవడం వల్ల పసుపు ఎదుగుదల నిలిచిపోయింది.

పసుపు రైతు దిగాలు

జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న పసుపు పంట

దుంపకుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లతో పెరగని పసుపుకొమ్ము

దిగుబడి తగ్గుతోందని ఆందోళన చెందుతున్న రైతులు

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపునకు డిమాండ్‌

నిజామాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని పసుపు రైతులకు ఇటీవల కురిసిన అధిక వర్షాలు ఆందోళన గురిచేస్తున్నాయి. పంట చేళల్లో వర్షపు నీరు నిలచి పంటకు తెగుళ్లు సోకి కొమ్ము ఎదుగుదల నిలిచిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పసుపుకు డిమాండ్‌ ఉన్నా.. పంట దిగుబడి తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.భారీ వర్షాలతో పంట నీట మునగడం, భూమి తడిఆరకపోవడం వల్ల పసుపు ఎదుగుదల నిలిచిపోయింది. నీళ్లు ఎక్కువ రోజులు ఉండడం వల్ల దుంప పెరగలేదు. వాతావరణం అనుకూలించక దుంపకుళ్లు, ఆకుమచ్చ వ్యాధి రావడం వల్ల ఈ యేడాది భారీగా దిగుబడి తగ్గుతుందని రైతులు  ఆందోళన చెందుతున్నారు.

ఫ  నైజాం కాలం నుంచి పసుపు సాగు..

జిల్లాలో నైజాం కాలం నుంచి పసుపు పంటను ఏటా సాగుచేస్తున్నారు. ప్రతి సంవత్సరం 50వేల ఎకరాల వరకు పంట వేస్తున్నారు. ఈ యేడాది  45వేల ఎకరాల వరకు సాగు చేశారు. జిల్లాలోని నందిపేట, ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, వేల్పూర్‌, బాల్కొండ, మెండోరా, ముప్కాల్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాల పరిధిలో ఎక్కువగా ఈ పసుపు సాగును చేస్తున్నారు. భీంగల్‌ మండల పరిధిలో కూడా కొన్ని గ్రామాల్లో వేశారు. ఈ సంవత్సరం పసుపు వేసినప్పటి నుంచి సుమారు ఐదు నెలల పాటు వర్షాలు పడ్డాయి. దీంతో పంట చేళ్లలో ఎప్పుడు నీళ్లు ఉండడం వల్ల ఈయేడాది పసుపు అనుకూలంగా ఎదగలేదు. వాతావరణం చల్లగా ఉండడం, భూమి నీరుపట్టి ఉండడం, రోజుల తరబడి ఆరకపోవడం వల్ల వేర్లు కుదురుకోలేదు. పంట అనుకున్న విధంగా రావడంలేదు. ఏకధాటిగా భారీ వర్షాలు పడడం వల్ల వరదలతో కొంత పంట దెబ్బతినగా ఎక్కువ రోజులు నీళ్లు నిల్వ ఉండడం వల్ల మరికొంత పంట దెబ్బతింది. పసుపులో స్వల్ప, ధీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుండడం వల్ల రెండు రకాల పంటలు దెబ్బతిన్నాయి. ప్రతి సంవత్సరం నవంబరు, డిసెంబరు నెల వరకే పసుపు కొమ్ములు బాగా వచ్చేవి. ఈ దఫా మాత్రం అంతగా రావడం లేదు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పసుపు అనుకున్నవిధంగా ఎదగలేదు. జిల్లాలో ఈ సంవత్సరం స్వల్ప రకాలైన రాజేంద్రసోనియా, రాజేంద్ర సొనాలి, ఏసీసీ 48, ఏసీసీ 79, ధీర్ఘకాలిక రకాల్లో ఎర్రగుంటూరు, సేలం వంటివి  రైతులు సాగుచేశారు. గత సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా పంట దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

ఫ అధిక వర్షాలతో అవస్థలు..

జిల్లాలో భారీ వర్షాల వల్ల పసుపు రైతులు సమస్యలు తలెత్తాయి. భూముల్లో నీళ్లు ఉండడం వల్ల వేరు పెరగలేదు. కాడ, దుంప అనుకూలంగా రాలేదు. భారీ వర్షాలకు ఈ సంవత్సరం దుంపకులు తెగులు, ఆకుమచ్చ తెగులు వచ్చాయి. దీనివల్ల పసుపు కొమ్ముపెరగడంలేదు. ఈ తెగులుకు మందులు కొట్టినా తగ్గకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం పసుపు 18 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా ఈ సంవత్సరం తెగుళ్లు బాగా రావడం వల్ల పది నుంచి 15 క్వింటాళ్ల వరకు రావడం కష్టమేనని రైతులు భావిస్తున్నారు. మందులు కొట్టిన ఇప్పటికీ తగ్గకపోవడం, దుంప పెరగకపోవడం వల్ల కొంతమంది రైతులు డిసెంబరులో పసుపు తీసి మరో రకం పంటను వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ దఫా పసుపునకు డిమాండ్‌ ఉండడం, క్వింటాళుకు 6 నుంచి 9వేల వరకు ధర వస్తుండడంతో దిగుబడి తగ్గితే నష్టం వస్తుందని భావిస్తున్నారు. గత సంవత్సరంలోలాగా దిగుబడి వస్తే ధర ఉండడం వల్ల లాభాలు వస్తాయని భావించిన రైతులకు ఈ దుంప తెగుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికీ కాడా పెరగకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-11-30T04:50:00+05:30 IST