మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్

ABN , First Publish Date - 2021-06-11T19:47:45+05:30 IST

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ...

మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీని శుక్రవారంనాడు కలుసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటన కోసం గురువారంనాడు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రధానితో భేటీ అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లారు. హోం మంత్రి అమిత్‌షాను ఇప్పటికే ఆయన కలుసుకున్నారు..


యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు కొద్దిరోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కోవిడ్ పరిస్థితిని చక్కబెట్టడానికి సంబంధించి కొన్ని వర్గాల్లో అసంతృప్తులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో పార్టీని పటిష్టం చేసేందుకు కొద్దిరోజులుగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. యోగి సర్కార్‌లోని మంత్రులు, నేతల అభిప్రాయాలను కూడా సేకరించి వ్యూహరచన సాగిస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం మెరుగుపరచేందుకు ఈ వారం మొదట్లో లక్నోకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వచ్చారు. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 300కు పైగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ 49, బీఎస్‌పీ 18, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకున్నాయి



Updated Date - 2021-06-11T19:47:45+05:30 IST