పెంచిన ఆస్తిపన్నులు కడుతూ నగరంలో బతకలేం

ABN , First Publish Date - 2021-07-30T05:50:31+05:30 IST

భారీగా పెరిగిన ఆస్తి పన్నులను కడుతూ నగరంలో బతకలేమని, వీటిని రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు.

పెంచిన ఆస్తిపన్నులు కడుతూ నగరంలో బతకలేం
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న వక్తలు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వార్వా, నివాస్‌ ప్రతినిధులు

సిరిపురం, జూలై 29: భారీగా పెరిగిన ఆస్తి పన్నులను కడుతూ నగరంలో బతకలేమని, వీటిని రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిరిపురం దత్‌ ఐలాండ్‌లోని వైజాగ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ర్టీ హాల్‌లో గురువారం వార్వా, నివాస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్తిపన్ను పెంపుపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారితంగా ఆస్తిపన్ను పెంపు, యూజర్‌ చార్జీలపై పోరాటాన్ని, నిరసన ప్రదర్శనలు, పాదయాత్రలు, సంతకాల ఉద్యమం ద్వారా, సోషల్‌ మీడియాలో ప్రచారం ద్వారా విస్తృతం చేయాలన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై పన్నుపోటు వేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. చెత్త, మురుగునీరు, తాగునీరు, రోడ్ల నిర్వహణ వంటి సదుపాయాల కల్పన కోసమే ఆస్తిపన్ను చెల్లిస్తున్నామన్నారు. ఇప్పుడు మళ్లీ అదనంగా చార్జీలు వసూలు చేయడం భావ్యం కాదన్నారు. ఈ సమావేశంలో వార్వా ప్రతినిధులు టి.కామేశ్వరరావు, బీబీ గణేశ్‌, పి.నారాయణమూర్తి, నివాస్‌ ప్రతినిధులు ఉదయ్‌, ఏపీఎఫ్‌ఈఆర్‌డబ్ల్యూఏఎస్‌ అధ్యక్షుడు రవి గోడే, బాలాజీ, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T05:50:31+05:30 IST